అంగన్‌వాడీలకు అందని జీతాలు!

ABN , First Publish Date - 2022-05-15T06:30:17+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి రెండు నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదు.

అంగన్‌వాడీలకు అందని జీతాలు!

మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి పెండింగ్‌

ఉమ్మడి విశాఖ జిల్లాలో 8,067 మంది సిబ్బంది 

కేంద్రం వాటా ఠంచనుగా విడుదల చేస్తున్నా... రాష్ట్రం తన వాటా జమ చేయకపోవడమే ఆలస్యానికి కారణం

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న కార్యకర్తలు, ఆయాలు

ఒక నెల వేతనం రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తామంటున్న అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)



అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి రెండు నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన జీతాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడం పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,952 అంగన్‌వాడీ కేంద్రాలు (1365 మినీ కేంద్రాలు) ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో  కార్యకర్త, ఆయా పనిచేస్తుండగా, మినీ కేంద్రాల్లో ఒక్కరే  (టీచర్‌ కమ్‌ ఆయా) విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ మూడు కేడర్లు కలిపి ఉమ్మడి జిల్లాలో 8,067 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, ఆయాకు రూ.7 వేలు, మినీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్త/ఆయాకు రూ.7 వేలు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనంగా చెల్లిస్తోంది. అయితే, మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన వేతనాలను  ఇప్పటివరకూ ఇవ్వలేదు. సాధారణంగా వేతనం నెల ప్రారంభమైన ఐదారు రోజుల్లోనే జమ అవుతుంటుంది. అయితే మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన జీతాలు మే సగం పూర్తయినప్పటికీ అందకపోవడం పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల గౌరవ వేతనాలకు సంబంధించిన బిల్లులను రెండు రోజుల కిందట పెట్టామని, మరో రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మార్చి నెల జీతాలు ఇప్పుడు క్లియర్‌ అయితే...ఏప్రిల్‌ జీతాలు ఎప్పుడు చెల్లిస్తారని అంగన్‌వాడీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. 


బడ్జెట్‌ కేటాయించకపోవడంతోనే.. 

బడ్జెట్‌ కేటాయించకపోవడమే జీతాల చెల్లింపులో ఆలస్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట బడ్జెట్‌ కేటాయించినట్టు సమాచారం రావడంతో బిల్లులు పెట్టినట్టు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గౌరవ వేతనాలను చెల్లిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తరువాత....వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమ చేసి వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల గౌరవ వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. 


ఆర్థికంగా ఇబ్బందులు.. 

రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సిబ్బంది వాపోతున్నారు. మరో 15 రోజులు గడిస్తే మూడో నెల కూడా పూర్తవుతుందని, ఇచ్చే అరకొర జీతాలను నెలల తరబడి చెల్లించకపోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలని సిబ్బంది కోరుతున్నారు. 

Updated Date - 2022-05-15T06:30:17+05:30 IST