No Safety For Chinese Nationals In Pakistan: పాకిస్థాన్‌లో గాల్లో దీపాల్లా మారిన చైనీయుల ప్రాణాలు

ABN , First Publish Date - 2022-09-29T00:51:22+05:30 IST

పాకిస్థాన్‌లో చైనీయుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి.

No Safety For Chinese Nationals In Pakistan: పాకిస్థాన్‌లో గాల్లో దీపాల్లా మారిన చైనీయుల ప్రాణాలు

కరాచీ: పాకిస్థాన్‌లో చైనీయుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ఓ ఉన్మాది రోగిలా నటించి కాల్పులు జరపడంతో ఒక చైనీయుడు మరణించాడు. మరో ఇద్దరు చైనీయులు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని సద్దార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చైనీయులే లక్ష్యంగా సద్దార్‌లోని హు డెంటల్ క్లీనిక్‌లోకి రోగిలా వచ్చిన ఉన్మాది కాల్పులు జరిపి పారిపోయాడు. మృతుడిని డాక్టర్ డోనాల్డ్ రేమౌండ్ చౌ గా గుర్తించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దంపతుల్లో 45 ఏళ్ల రిచర్డ్ చౌ, 40 ఏళ్ల మార్గరెట్ హూ ఉన్నారు. వీరిని కరాచీలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి పరారైన దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. 


ఘటనపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఆదేశించారు. 


 

కరాచీ యూనివర్సిటీ వద్ద ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులు చనిపోయారు. బుర్ఖా ధరించి వచ్చిన సుసైడ్ బాంబర్ యూనివర్సిటీ గేట్ వద్ద చైనీయులు ప్రయాణిస్తున్న వ్యాన్ సమీపించగానే తనను తాను పేల్చివేసుకుంది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా ముగ్గురు చైనీయులు. పలువురు గాయపడ్డారు. ఆత్మాహుతికి పాల్పడిన మహిళ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సభ్యురాలని తెలిసింది. 


గత ఏడాది జులైలో ఈశాన్య పాకిస్థాన్‌లో చైనా ఇంజనీర్ల బస్సుపై జరిగిన దాడిలో పది మంది చనిపోయారు.   


బలూచిస్థాన్ నుంచి పాక్, చైనా వెళ్లిపోవాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ కింద రెండు దేశాలూ చేపట్టిన ప్రాజెక్టులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ బలగాలు బలూచిస్థాన్‌లో జరుపుతున్న దారుణాలను, పెద్ద ఎత్తున జరుపుతోన్న మారణహోమాన్ని బలూచ్ మేధావులు అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్నారు.    


Updated Date - 2022-09-29T00:51:22+05:30 IST