రైతులను బలి చెయ్యొద్దు

ABN , First Publish Date - 2020-09-25T10:10:55+05:30 IST

తమ త్యాగాలను అవహేళన చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటిం

రైతులను బలి చెయ్యొద్దు

  ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, సెప్టెంబరు 24 : తమ త్యాగాలను అవహేళన చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన దీక్షలు గురువారం 282వ రోజుకు చేరుకున్నాయి. పెదపరిమి, తుళ్లూరు, అనంతవరం, దొండపాడు, అబ్బరాజుపాలెం, తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, ఐనవోలు తదితర రాజధాని గ్రామాల్లో దీక్షలు కొనసాగించారు.


ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడు రాజధానులతో ప్రయోజనం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో భూములు అమ్ముకోవటానికే కుట్ర పన్నారని ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానాల్లో రైతులకు తప్పక న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. తల్లిలాంటి అమరావతిని నాశనం చేయవద్దని వేడుకున్నారు.


మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో రైతు సంఘ నేతలు మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రకటనను వెంటనే ప్రభుత్వం విరమించుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరారు. 


రైతుసంఘ నేతలు ఉమామహేశ్వరరావు, ఎ.కిరణ్‌, ఎం.సాంబశివరావు, రమేష్‌, వెంకటేశ్వరరావు, సతీష్‌, అశోక్‌, కుమారి, పద్మ, జ్యోతి, దుర్గారావు, భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రైతు జేఏసీ నాయకులు, స్థానికులు నిరసన దీక్షలు కొనసాగించారు. 

Updated Date - 2020-09-25T10:10:55+05:30 IST