గదుల్లేవు.. నిధుల్లేవు!

ABN , First Publish Date - 2021-02-25T08:11:05+05:30 IST

పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

గదుల్లేవు.. నిధుల్లేవు!

  • కొవిడ్‌ మార్గదర్శకాలు సరే.. అమలెలా..? 
  • 6-10 విద్యార్థులకు పాఠాలెలా? 
  • సమస్యల వలయంలో పాఠశాలలు 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అసలే అరకొర వసతుల తో ఉన్న పాఠశాలల్లో కొవిడ్‌ మార్గదర్శకాలను అమలు చేయడం ఎలా.. అందుకు తగిన సిబ్బంది, నిధులు లేని స్థితిలో ఎలా నెట్టుకురావాలని టీచర్లు, బడికి పంపితే తమ పిల్లలకు ఏమవుతుందోనని తల్లిదండ్రులు మథనపడుతున్నారు. తరగతి గదులను ప్రతిరోజు శానిటైజ్‌ చేయాలి.. కానీ.. శుభ్రపరిచేందుకు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం ఎవరిస్తారు? తరగతి గదులను ఎవరు శుభ్రపరుస్తారు? ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకునేందుకు థర్మామీటర్‌/థర్మల్‌ స్కానర్‌ యంత్రాలు ఎవరివ్వాలి? విద్యార్థులు నల్లా నీటితో నిత్యం చేతులు సబ్బుతో శుభ్రపరచుకోవాలి.. అసలు నీటివసతే లేని పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి.. అక్కడి విద్యార్థుల సంగతేంటి? నీటి వసతి ఉన్నచోట సబ్బులు సమకూర్చేదెవరు? తరగతి గదుల్లో గరిష్ఠంగా 20 మందిని మాత్రమే అనుమతించాలి.


ప్రతి విద్యార్థి మధ్య కనీసం 6 ఫీట్ల దూరం పాటించాలి. అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గదులు ఇరుకుగా ఉంటాయి. అందులో దూరం పాటిస్తూ 20మంది కూర్చోవడం సాధ్యమేనా? ఇవి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్నలు.. దీనికి ప్రభుత్వ సమాధానం ఒక్కటే. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని విద్యా కమిటీలు అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. కానీ.. పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 


వేల సంఖ్యలో సౌకర్యాలు లేని బడులు 

దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం అసలు మరుగుదొడ్లే లేని ప్రభుత్వ పాఠశాలలు 500కు పైనే ఉన్నాయి. అలాగే నీటి వసతి లేని బడులు 800పైగా ఉన్నాయి. సరిపడా గదుల్లేక వరండాలలో తరగతులు నిర్వహించే పాఠశాలల సంఖ్య తక్కువేమీ కాదు.  ఆర్థికంగా నష్టపోతున్నాం.. ప్రత్యక్ష తరగతులకు వెంటనే అనుమతులివ్వండి.. అంటూ గత కొద్ది నెలలుగా ప్రభుత్వంపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల తీవ్ర ఒత్తిడి చేస్తూ వచ్చాయి. కానీ.. పాఠశాలలు ప్రారంభిస్తే కోవిడ్‌ మార్గదర్శకాలు అమలు చేసేందుకు సరిపడా వనరులు, వసతులు ఎన్ని ప్రైవేటు పాఠశాలల్లో  ఉన్నాయి..? అన్న విషయంపై వీరు స్పందించరు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా 11,38,382 మంది ఉండగా.. 6,7,8 తరగతుల విద్యార్థులు 13,11,772 మంది ఉన్నారు. 6-10 తరగతుల విద్యార్థుల సంఖ్య 24,50,154గా ఉంది. ఇప్పుడు ఒక్కో తరగతిలో 6 ఫీట్ల దూరం పాటిస్తూ గరిష్ఠంగా 20 మందినే అనుమతించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం కష్టమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరో వైపు నిధుల సమస్య తమకు పెద్ద గుదిబండలా మారిందని అంటున్నారు.  


కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలివీ.. 

విద్యార్థులు, ఉపాధ్యాయులకు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అనుమతించకూడదు. తరగతి గదిలో 20 మంది కంటే ఎక్కువగా ఉండరాదు. మాస్కులు ధరించి, 6 ఫీట్ల దూరం పాటించాలి.  సబ్బుతో చేతులు, ముఖం శుభ్రం చేసుకోవాలి. 


చేతులు నిత్యం శుభ్రపరచుకునేందుకు పాఠశాలలు, వసతిగృహాల్లో నల్లా నీరు ఉండాలి. 


సబ్బులు అందుబాటులో ఉంచాలి. పాఠశాలకు వచ్చాక, వెళ్లే సమయంలో, భోజనం తినడానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. 


ప్రతి విద్యార్థి ఉదయం, సాయంత్రం చొప్పున రెండు మాస్కులు వాడాలి. ప్రతిరోజు వాటిని సబ్బునీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి. 


అన్ని తరగతి గదులు, గ్రంథాలయం, కిచెన్‌, ల్యాబ్‌, అన్ని ప్రాంతాలను శానిటైజ్‌ చేయాలి. 


స్కూల్‌ బస్సు ఉంటే ప్రతిరోజు రెండుసార్లు బస్సు సీట్లను శానిటైజ్‌ చేయాలి. ఒక బెంచిలో ఒక్కరే కూర్చోవాలి. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


వసతిగృహంలో సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఏ సమయంలోనైనా వైద్య సేవలు అందేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పాఠశాలలు, వసతిగృహాల్లో రెండు ఐసోలేషన్‌ గదులు సిద్ధం చేయాలి.

Updated Date - 2021-02-25T08:11:05+05:30 IST