అర్జీలకు.. స్పందన ఏదీ..?

ABN , First Publish Date - 2022-08-09T06:50:52+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వాల హయాంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ పేరిట రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహించేవారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత స్పందనగా పేరు మార్చారు. కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజన్లలో, తహసీల్దారు

అర్జీలకు.. స్పందన ఏదీ..?

పరిష్కారానికి నోచుకోక మళ్లీ మళ్లీ వినతులు

దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి

ఎక్కువ శాతం భూవివాదాలే..

పింఛన్ల తొలగింపుతో స్పందనకు క్యూ కట్టిన విభిన్న ప్రతిభావంతులు

కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో జరిగిన స్పందన తీరు ఇదీ..!


ప్రజా సమస్యల పరిష్కారం కోసమే స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశాం.. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం.. ఇందుకోసం ఇచ్చిన అర్జీలు ఏ స్థితిలో ఉందో కనుగొనేందుకు టోల్‌ ఫ్రీ నెంబరును కూడా ఏర్పాటు చేశాం.. రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి మండల  స్థాయి అధికారుల వరకూ ప్రజల నుంచి సేకరించిన అర్జీలను ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరిస్తాం.. ఆ అర్జీల స్థితిగతులు కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వం తొలినాళ్లలో స్పందన కార్యక్రమం గురించి చెప్పుకొచ్చింది. అయితే స్పందన కార్యక్రమంలో ప్రజలిచ్చే అర్జీలకు స్పందన కనిపించడం లేదు. అవి పరిష్కారం కాకపోవడంతో మళ్లీ మళ్లీ తిరిగి అర్జీలు ఇస్తున్నారు. స్పందన కార్యక్రమ అమలుపై ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కడప కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో జరిగిన స్పందన కార్యక్రమాన్ని విజిట్‌ చేసింది. 


(కడప - ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వాల హయాంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ పేరిట రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహించేవారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత స్పందనగా పేరు మార్చారు. కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజన్లలో, తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. పోలీసులకు సంబంధించి ఎస్పీ కార్యాలయంలో స్పందన నిర్వహిస్తున్నారు. స్పందనకు వచ్చే అర్జీలలో భూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. విశేషమేమంటే సమస్యలు పరిష్కారం కాకపోవడం సరే.. పరిష్కారమైనట్లు మెసేజ్‌లు పంపించడం గమనార్హం. అయితే అవుట్‌ సోర్సింగ్‌ కుటుంబీకుల పింఛన్లు తొలగించడంతో కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతులు పోటెత్తడంతో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. ఏ ఏ సమస్యల మీద ఎక్కువ జనం వస్తున్నారో.. గతంలో ఇచ్చిన అర్జీలకు మోక్షం లభించిందా..? మండల స్థాయిలో పరిష్కారం కాకపోవడం వల్లే జిల్లా కేంద్రానికి హాజరవుతున్నా వంటి వాటిపై ఆరా తీశారు.  వీటిలో కొన్ని.. 


ఈ రైతు పేరు ఓబుల్‌రెడ్డి. చాపాడు మండలంలోని చిన్న గురవలూరు. ఈయన తండ్రి పేరిట 1.24 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఆయన మరణించాడు. ఇప్పుడది చుక్కల భూమిగా చూపిస్తున్నారు. సమస్య పరిష్కరించాలంటూ స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీన్ని పరిష్కరించాలంటూ కడప స్పందనకు వచ్చారు. 


- మైదుకూరుకు చెందిన ఖాజాహుసేన్‌, ఎన్‌.సుబ్బరత్నమ్మ, ఎస్‌.జవహర్‌ తాజ్‌లకు పట్టణంలో దేవి టాకీస్‌ సమీపంలో సర్వే నెం.703/1బిలో ఖాజా హుస్సేన్‌కు 8.25 సెంట్లు, ఎన్‌.సుబ్బరత్నమ్మకు 2.75 సెంట్లు, జవహర్‌ తాజ్‌కు య.0.03 సెంట్ల నివాస స్థలాలున్నాయి. అయితే వీరికి వీరి పక్క సర్వేనెంబర్ల భూయజమానితో వివాదం ఉంది. న్యాయం చేయాలంటూ స్థానిక అధికారులను ఆశ్రయించారు. అక్కడ స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చినా స్పందన లేదు. దీంతో సమస్య పరిష్కారం కోసం కడప కలెక్టరేట్‌లో జూలై 11న అర్జీ ఇచ్చారు. కొలతలు వేసి హద్దులు చూపించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారమైనట్లుగా జూలై 27న మెసేజ్‌ వచ్చింది. మళ్లీ రెండోసారి కడప కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చారు. 


- జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన దొరస్వామి, ఏసోబు, మార్తమ్మ, దానమ్మ, వెంకటేషు, మునెయ్యలు. వీరికి ఒక్కొక్కరికి ఎకరా నుంచి 3 ఎకరాల పొలం ఉండేది. వీరి భూములను స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణం కోసమంటూ ఏపీఐసీసీ పేరిట తీసుకుంది. రూ.7.50 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పింది. భూములకు సంబంధించిన పాస్‌బుక్కులు అన్నీ ఇచ్చేశారు. మూడేళ్లయింది.. ఇంత వరకు పరిహారం మాత్రం అందలేదు. పరిహారం కోసం ఎంపీ అవినా్‌షరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం, కడప కలెక్టరును పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా పరిహారం రాలేదు. దీంతో సోమవారం 41 మంది కడప స్పందనకు వచ్చారు. అంత మందిని కలెక్టరు అనుమతించకపోవడంతో ఒక్కొక్కరుగా స్పందన కార్యక్రమానికి వచ్చారు. భూములు తీసుకొని మూడేళ్లయింది. ఇంత వరకు పరిహారం అందలేదు. ఆ భూములతో బ్యాంకుల్లో పంట రుణాలు తెచ్చుకున్నాం, అవి కట్టండంటూ బ్యాంకుల వారు నోటీసులు అందిస్తున్నారు. పరిహారం అందిస్తే బ్యాంకు అప్పులు కట్టుకుంటాం. ఎన్నోసార్లు అధికారులనో, నాయకులనో కలిసి వినతిపత్రాలు అందించినా మాకు న్యాయం జరగడంలేదంటూ వాపోయారు. 


- ఈమెది మైదుకూరు మండలం, నానాపల్లెకు చెందిన జ్యోతి స్వగ్రామం. పేరు సావిత్రమ్మ, ఈమె విభిన్న ప్రతిభావంతురాలు. 15 సంవత్సరాలుగా పింఛన్‌ తీసుకుంటుంది. అయితే కస్తూర్భాగాంధీ గురుకుల పాఠశాలలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. దీంతో పింఛన్‌ నిలిపివేశారు. అయితే ఆ ఉద్యోగమేమీ శాశ్వతం కాదు. ఆ వచ్చే పదరూ.13 వేలతో ఎలా బతకాలంటూ వాపోయింది. 


- ఈ యువకుడి పేరు సాయికుమార్‌. ఇతనిది యర్రగుంట్ల. ఎంబీఏ చదువుతున్నాడు. ఇతను విభిన్న ప్రతిభావంతుడు కావడంతో పదమూడేళ్లుగా పింఛన్‌ తీసుకుంటున్నాడు. యర్రగుంట్ల మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు పింఛన్‌ నిలిపివేశారు. 


- కడపలోని బిస్మిల్లానగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌ జీవనోపాధి కోసం కొడుకును దుబాయ్‌ పంపేందుకు కడపకు చెందిన ఏజంటుకు రూ.1.25 లక్షలు సమర్పించాడు. ఏడాదిన్నరగా దుబాయ్‌ పంపలేదు. తన డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేశాడు.


- గోవర్ధన్‌రెడ్డి. తాళ్ల ప్రొద్దుటూరు. ఇతనికి 3.58 సెంట్లు భూమి ఉంది. చీనీ చెట్లు వేశాడు. ఈ ఏడాది జూలై 13న గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చీనీ చెట్లను నరికివేశాడు. ఇందుకు బాధ్యులైన వారిపై ఫిర్యాదు చేస్తే గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కేసు పరిష్కారం కోసం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.


- కాశినాయన మండలం చెన్నవరం గ్రామానికి చెందిన దస్తగిరమ్మ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈమె చెల్లెలు షర్మిల ఇద్దరు పిల్లలతో కలిసి జూలై 4న అదృశ్యమైంది. ఫోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. న్యాయం జరగకపోవడంతో ఎస్పీకి  ఫిర్యాదు చేశారు.


- మైదుకూరు మండలం, ఓబులాపురానికి చెందిన వికలాంగ రైతు సుబ్బరామిరెడ్డికి భూమి ఉండేది. గత మూడేళ్ల కిందట 6 ఎకరాల మెట్ట భూమిని తన కుమారుడు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాడు. గతంలో ఈయనకు పింఛను వచ్చేది. కానీ భూమి ఉందని చెప్పి రేషన్‌ కార్డు, పెన్షన్‌ కట్‌ చేశారు. ఈయనకు 70 ఏళ్లు ఉన్నాయి. 65 శాతం వికలత్వంతో బాధ పడుతున్నాడు. ఈయన భార్య కూడా అనారోగ్యంతో మంచం పట్టింది. కలెక్టరేట్‌లోని స్పందనలో మూడు సార్లు వినతిపత్రం ఇచ్చినా పరిష్కారం దొరక లేదు. 


- కొండాపురం మండలానికి చెందిన హిమబిందుకు ఏడాది కిందట తండ్రి చనిపోయాడు. ఈమె తల్లి సుబ్బరంగమ్మ పెరాలసిస్‌తో మంచం మీదుంది. వితంతు పెన్షన్‌ కోసం సచివాలయానికెళ్తే పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారు. ఈమె తల్లికి ఎలాంటి ఆధారం లేదు. సచివాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కలెక్టరేట్‌ స్పందన కార్యక్రమంలో రెండవ సారి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. 

Updated Date - 2022-08-09T06:50:52+05:30 IST