స్పందన లేదు

ABN , First Publish Date - 2022-08-09T05:10:41+05:30 IST

స్పందన.. పేరు బాగుంది.

స్పందన లేదు
క్యూలో నిలబడ్డ అర్జీదారులు

  1. ఏళ్ల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు
  2. అధికంగా రెవిన్యూ సమస్యలే 
  3. పేదల భూములపై నాయకుల కన్ను
  4. పరిష్కరించలేకపోతున్న తహసీల్దార్లు
  5. అంతా తెలిసి ఏమి చేయలేని ఉన్నతాధికారులు 
  6.   లక్ష్యం నెరవేరని స్పందన

కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 8:  స్పందన.. పేరు బాగుంది.   తమ సమస్యల మీద దరఖాస్తు ఇవ్వడమే తడవు అధికార యంత్రాంగం స్పందిస్తుందని జనం అనుకుంటారు. పైగా ప్రభుత్వం అంత కంటే ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. మీ సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా స్పందనను నిర్వహిస్తున్నాం.. అని చెప్పుకుంటోంది. కానీ అధికార యంత్రాంగం స్పందించడం అంత తేలిక కాదు. ప్రతి సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి వందల దరఖాస్తులు వస్తున్నాయి. రేషనకార్డులు, పింఛన్లు, ఇండ్ల పట్టాలు, ఆనలైన భూసమస్యలు, సంక్షేమ పథకాలు, కుటుంబసమస్యలు.. ఒకటేమిటి..  సునయన ఆడిటోరియంలో వారం వారం  వినతులు ఇవ్వడానికి జిల్లా మారుమూల పల్లెల నుంచి కూడా జనం వస్తున్నారు. కలెక్టర్‌ ప్రతి వారం అర్జీలు పెండింగ్‌లో పడిపోకూడదని, సత్వరం ప్రజా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తునే ఉన్నారు. కానీ ఒక్కడి అర్జీలు అక్కడే అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి  వచ్చిన కొందరు అర్జీదారులను ఆంధ్రజ్యోతి పలకరించింది. సమస్యలపై అర్జీలు ఇచ్చి  పరిష్కారం కోసం తిరిగి తిరిగి అలసిపోయామని చెప్పారు. స్పందన తీరు గురించి వాళ్ల మాటల్లోనే చదవండి..

 పింఛన కోసం గ్రామ సచివాలయానికి వెళ్లితే ‘నీ కూతురికి ఉద్యోగం ఉంది...  కాబట్టి కలెక్టర్‌, సీఎం, ఆఖరకు ప్రధాని చెప్పినా నీకు పింఛన రాద’ని కొందరు సచివాలయ ఉద్యోగులు అర్జీదారులకు ఖరాఖండిగా చెబుతున్నారు. రేషనకార్డు కోసం సంవత్సరం పొడవున స్పందన చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదనే  ఓ దివ్యాంగుడు వాపోయారు. తమ్ముడు సచివాలయ ఉద్యోగి అయితే తనకు దివ్యాంగ పింఛన ఎందుకు ఇవ్వరని  మరో  దివ్యాంగుడు బోరుమన్నారు. ఇక భూ సమస్యలపై వచ్చే అర్జిదారుల గోడు అంతా ఇంతా కాదు. ప్రజాసాధికర సర్వే ఆనలైనను క్లోజ్‌ చేయడం వల్లే రేషనకార్డులు, పింఛన, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు దూరమవుతున్నారు.  ఉద్యోగం వచ్చి పెళ్లయి అమ్మాయిలు అత్తారింటికి వెళ్లిపోయాక కూడా...తల్లిదండ్రుల రేషనకార్డులు, పింఛన్లు తీసేస్తారు.   ఇంత అస్తవ్యస్తంగా యంత్రాంగం పని చేస్తోంది. వీటిని పరిష్కరించడమని బాధితులు కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు: 

జిల్లాలో భూ సమస్యల పరిష్కార విషయంలో దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించడన్న చందంగా తయారైంది బాధితుల పరిస్థితి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్వయంగా కలెక్టర్‌ ఆదేశించినా మండల స్థాయిలోని తహసీల్దార్లు పెడచెవిన పెడుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి అధికారికి చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో అర్జీదారుడు కలెక్టరేట్‌కు వచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా భూ సమస్యలే అధికంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇందులోనూ కూడా పేదల భూములపై రాజకీయ నాయకులు కన్నేసిన భూముల సమస్యలే పరిష్కారం కాకపోవడంతో ఏళ్ళ తరబడి తిరగాల్సి వస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌లను ఆదేశించినా... క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు తుంగలో తొక్కి పెడుతున్నారు. ఆపైన నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని స్పందనకు అర్జీలు ఇవ్వడానికి వచ్చిన బాధితులు వాపోతున్నారు.

నేడు స్పందనలో వచ్చిన అర్జీలు

  రేషనకార్డు కోసం సంవత్సరంగా తిరుగుతున్నా: పీర్‌బాషా, కుమ్మరిగేరి, కర్నూలు

నాపేరు పీర్‌బాషా. దివ్యాంగుడిని. నేను కుమ్మరి గేరిలో నివసిస్తున్నాను.  నాకు భార్య, ఇద్దరు పిల్లలు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. అద్దె ఇంట్లో ఉంటూ బీడీల పని చేసుకుంటూ జీవిస్తున్నాను.  సంవత్సరం క్రితం నా రేషన కార్డును తొలగించారు. కొత్త కార్డును ఇప్పించాలని కోరుతున్నా మంజూరు చేయడం లేదు. ఇప్పటి వరకు మూడుసార్లు స్పందనకు వచ్చాను. అయినా ఫలితం లేదు. రేషనకార్డు మంజూరు చేసి నన్ను ఆదుకోవాలి. ఇంటి పట్టా ఇచ్చారు.. కాని ఇంత వరకు స్థలం చూపలేదు.

దివ్యాంగ పింఛన రావడం లేదు: రాజశేఖర్‌, కల్లపరి, కోడుమూరు మండలం. 

మా తమ్ముడు సచివాలయ ఉద్యోగి. ప్రజాసాధికర సర్వేలో ఒకే కుటుంబం కింద సర్వే చేయించుకున్నాం.  ఇప్పుడు ఇద్దరికి వివాహాలు అయ్యాయి. వేరువేరుగా రేషనకార్డులు వచ్చాయి. మా తమ్ముడు వేరే ఉంటున్నాడు.  గత సంవత్సరం మా నాన్నకు వచ్చే వృద్ధాప్య పింఛన  కట్‌ అయ్యింది. మా తమ్ముడు ఉద్యోగి కావడంతో పింఛన తొలగించారనుకున్నాం. ఇప్పుడు నా దివ్యాంగ పింఛనను రద్దు చేశారు. ఇదేమిటని సచివాలయంలో అడిగితే మీ తమ్ముడు సచివాలయ ఉద్యోగి కావడంతో నీకు పింఛన ఆపేశామని చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం? నాకు పింఛన ఇప్పించాలని  స్పందనకు వచ్చాను.

సీఎం చెప్పినా చేయడం లేదు: చెంచు సవారన్న, గోవర్ధననగర్‌, కల్లూరు

కల్లూరులోని గోవర్ధన నగర్‌లో 1974లో 530, 531 సర్వే నెంబర్లలో 60 సెంట్ల కొనుగోలు చేసి అగ్రిమెంట్‌ చేయించుకున్నాను. రిజిస్ర్టేషన కాలేదు. అయితే ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించుకుని కాంపౌండ్‌ నిర్మించాడు. నా స్థలం నాకు ఇవ్వమని పదేపదే కలెక్టర్లకు విన్నవించాను. గతంలో సీఎం జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో సమస్యను విన్నవించాను. ఆయన నా స్థలం నాకు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. అయినా ఫలితం లేదు.  కలెక్టరేట్‌ చుట్టూ తిరగలేక కాళ్లు అరిగిపోతున్నాయి.  

 మా గ్రామంలో ఎండీయూ ద్వారా బియ్యం పంపిణీ చేయడం లేదు: పుసులూరు సర్పంచ, కల్లూరు మండలం.

మా గ్రామంలో రేషన పంపిణీ చేసే ఎండీయూ వాహనం రేషన బియ్యం ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం లేదు. ఇప్పటి వరకు రెండుసార్లు స్పందనలో అర్జీలు ఇచ్చాం. అధికారులు స్పందించకపోగా.. మీ గ్రామంలో మీకు ఎండీయూ వాహనదారుడికి సరిపోక ఫిర్యాదు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ఎండీయూ వాహనం ద్వారా పంపిణీ చేయకపోవడంతో రేషన డీలర్‌ వద్దకు వెళ్లితే ఆయన మీరు ప్రతిపక్షపార్టీలకు ఓటు వేశారని, మీకెందుకు రేషన ఇవ్వాలని   వేధిస్తున్నారు. డీలర్‌ రేషన పంపిణీ చేసిన తర్వాత స్లిప్పులు ఇవ్వడం లేదు. గట్టిగా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. ఎండీయూ తిరగకపోవడంతో దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ఎస్సీ కాలనీ ప్రజలు, వృద్ధ్దులు రేషనషాపు వద్దకు వచ్చి రేషన తీసుకోలేకపోతున్నారు. కాబట్టి కలెక్టర్‌ స్పందించి ఎండీయూ వాహనాన్ని ఇంటింటికి రేషన పంపిణీ చేసేలా చూడాలి.

నాలుగుసార్లు వచ్చా: చిన్న వీరస్వామి, నేలకోసిగి, కోసిగి మండలం.

15 సంవత్సరాలుగా నేలకోసిగి గ్రామంలో 11వ ప్లాట్‌లో గుడిసె వేసుకొని జీవిస్తున్నాను. ఇళ్లు నిర్మించుకుందామని పాదులు తీస్తుంటే వంద ఎకరాల ఆసామి నాలుగు సంవత్సరాల క్రితం ఇదే స్థలంపై నాకు పట్టా ఇచ్చారని అడ్డుపడుతున్నాడు. 15 సంవత్సరాల నుంచి అక్కడే గుడిసె వేసుకొని జీవిస్తున్నాం. ఇల్లు కట్టుకుందామని  తెచ్చుకున్న సిమెంటు గడ్డకట్టి పోతోంది. పోలీసులు, తహసీల్దార్‌ వారికే మద్దతు తెలుపుతున్నారు. కరెంటు బిల్లు అన్నీ నా పేరుమీదే ఉన్నాయి. నా స్థలం నాకు ఇప్పించాలంటూ ఇంతవరకు నాలుగుసార్లు కలెక్టరేట్‌కు వచ్చాను. కలెక్టర్‌ చెబుతున్నా.. మండలంలో నాయకుల ఒత్తిడితో తహసీల్దార్‌ స్పందించడం లేదు. 

ఫ మా పాఠశాలను విలీనం చేయొద్దు: వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, నాగరాజు, మాదన్న, భాస్కర్‌రెడివేముగోడు గ్రామస్థులు, గోనెగండ్ల మండలం

 మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దని కల్టెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. విలీనం వల్ల పిల్లలు కర్నూలు- ఎమ్మిగనూరు ప్రధాన రహదారి దాటాల్సి వస్తోంది.  చిన్న పిల్లలు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరగవచ్చని తల్లిదండ్రులు భయపడుతున్నారు.  ప్రాథమిక పాఠశాల విలీనాన్ని ఆపాలని కోరడానికి వచ్చాం. 

 చుక్కల భూమి సమస్యకు చుక్కలు చూపుతున్నారు: గంగమ్మ, రేమట గ్రామం, కర్నూలు రూరల్‌ మండలం

నాలుగు వారాలుగా చుక్కల భూమి సమస్యకు పరిష్కారం చూపాలంటూ కలెక్టరేట్‌లో జరుగుతున్న స్పందన కార్యక్రమానికి  వస్తున్నాను. కలెక్టర్‌ ఆదేశించినా కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ పట్టించుకోవడం లేదు. స్పందనలో వీడియో కాన్ఫరెన్సులో ఓకే సార్‌ చేస్తాను అని చెబుతున్నారే తప్ప అక్కడికి వెళ్లితే పట్టించుకోవడం లేదు. చుక్కల భూమి సమస్యను పరిష్కరించేందుకు కర్నూలు రూరల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం అధికారులు ఐదేళ్లుగా తిప్పుకుంటున్నారు.  రేమట గ్రామంలో సర్వే నెంబర్‌ 34లో 2.33 ఎకరాల  చుక్కల భూమి(ప్రభుత్వ భూమిగా) ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ 5 ఏళ్లుగా కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. గతంలో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ జోక్యం చేసుకున్నారు. అయినా పని కాలేదు.  1.02 ఎకరాలు ఆనలైన చేశారని, ఇంకా మిగిలిన భూమిని ఆనలైన చేయడం లేదని, నీవు బతికి ఉన్నంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదని తహసీల్దార్‌ అన్నారు.  ఓ ప్రజా ప్రతినిధి నా  పొలంపై కన్నేయడంతోనేతహసీల్దార్‌ ఈ  సమస్యను పరిష్కరించడం లేదు. 

 6 నెలలుగా తిరుగుతున్నా: రంగయ్య, ఎదురూరు, కర్నూలు

నా కూతురు సచివాలయ ఉద్యోగి అంటూ పింఛన తొలగించారు. ఆమె వివాహం చేసుకొని అత్తగారింటికి వెళ్లిపోయింది. ప్రజాసాధికార సర్వేలో  ఒకే కుటుంబం కింద మ్యాపింగ్‌ అయ్యింది. దీంతో నాకు వచ్చే పింఛనను తొలగించారు. పింఛన ఇవ్వమని దుద్యాల సచివాలయంలో సంబంధిత అధికారిని అడిగాను. ఆమె కలెక్టర్‌, సీఎం, చివరకు పీఎం చెప్పినా నీకు పింఛన రాదంటున్నారు. పింఛన ఇప్పించాలని గత 5, 6 నెలలుగా తిరుగుతున్నారు. నాకు పింఛన ఇప్పించండి.

గత మూడేళ్లలో స్పందనకు వచ్చిన అర్జీలు ప్రధాన శాఖలు

గత మూడేళ్లలో స్పందన కార్యక్రమానికి 24,223 అర్జీలు వచ్చాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 23,382 అర్జీలు పరిష్కారం అయ్యాయని, కేవలం 824 మాత్రమే పెండింగుల్లో ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 

 ఇందులో ప్రధాన విభాగాలలో వచ్చిన అర్జీలు

-----------------------------------------------------------------------------------------------------

డిపార్టుమెంట్లు వచ్చిన అర్జీలు పరిష్కారం అయినవి పెండింగ్‌లో ఉన్నవి

-------------------------------------- 

రెవిన్యూ  6,582  4469   508

గ్రామ సచివాలయాలు 3788 2922     18 

 పంచాయతీ రాజ్‌ 1635  1152   35 

మున్సిపల్‌ అడ్మినిసే్ట్రషన 1819 1293   17 

అగ్రికల్చర్‌  2054 1683   25

--------------------------------------------------------- 






Updated Date - 2022-08-09T05:10:41+05:30 IST