భూముల వేలానికి కానరాని స్పందన

ABN , First Publish Date - 2022-09-24T06:34:04+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) భూముల అమ్మకానికి తంటాలు పడుతోంది.

భూముల వేలానికి కానరాని స్పందన

సుమారు 25 ఎకరాలను అమ్మకానికి పెట్టిన వీఎంఆర్‌డీఏ

ఆన్‌లైన్‌లో బల్క్‌ వేలం

ఎకరా నుంచి ఆరు ఎకరాలు వరకూ...

గజాల చొప్పున ధర నిర్ణయం

దరఖాస్తులు సమర్పించేందుకు మరో మూడు రోజులే గడువు

పెద్దగా ఎవరూ ముందుకురాలేదని ప్రచారం

మళ్లీ వాయిదా తప్పదా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) భూముల అమ్మకానికి తంటాలు పడుతోంది. గతంలో లేఅవుట్లు వేసి, 150 గజాల నుంచి 500 గజాల వరకు ప్లాట్లుగా విభజించి విక్రయించేది. ప్రజలు వారి స్థాయి, స్థోమతను బట్టి కొనుక్కునేవారు. ఇప్పుడు రూటు మార్చింది. రాత్రికి రాత్రి వందల కోట్ల రూపాయలు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోయడానికి ‘బల్క్‌ వేలం’ ప్రకటన జారీచేసింది. అది కూడా ప్రత్యక్ష వేలం కాకుండా ఆన్‌లైన్‌లో ‘ఈ-వేలం’. ఆయా భూములు అర ఎకరా నుంచి ఆరు ఎకరాల వరకు  యథాతథంగా తీసుకోవాలనే నిబంధన పెట్టింది. అయితే వాటి ధరలు మాత్రం గజాల లెక్కనే వేసింది. 

వీఎంఆర్‌డీఏ మొదట భీమిలి మండలం కాపులుప్పాడ, చిట్టివలస, విశాఖ గ్రామీణ మండలం మధురవాడ, పరవాడ మండలం ఈ.బోనంగిలో భూములను అమ్మకానికి పెట్టింది. వాటి ద్వారా వచ్చే నిధులు సరిపోవని వెంటనే మరో ప్రకటన జారీచేసింది. ఈసారి మధురవాడలో భూములతో పాటు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల భూములు అమ్ముతున్నామని తెలియజేసింది. ఈ వేలంలో పాల్గొనదలచినవారు సెప్టెంబరు 27వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదే నెల 30న ఈ-వేలం నిర్వహిస్తామని తెలిపింది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ఈ-వేలం అంటే ఎవరికీ తెలియడం లేదని ప్రచారం కూడా ప్రారంభించింది. సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో లిఫ్టు వద్ద...ఒక స్టాల్‌ ఏర్పాటు చేసి..ఇద్దరు ఉద్యోగులను పెట్టి..వేలానికి పెట్టిన భూముల గురించి వివరిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ అందిన దరఖాస్తులు రెండు అంకెల సంఖ్యను దాటలేదు. దాంతో మరోసారి వేలం తేదీని పొడిగించి, దరఖాస్తు గడువు పెంచాలని యోచిస్తున్నట్టు తెలిసింది. 


రాజధాని ప్రచారంతో వెనకడుగు

విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అని ప్రభుత్వం ప్రకటించినప్పుడల్లా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొద్దికాలం స్తంభించిపోతోంది. ప్రజలు ఏమి జరుగుతుందో వేచి చూడాలనే ఆలోచనతో కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఆగిపోతున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని అంటూ ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఊదరగొడుతోంది. విశాఖలో మామూలుగానే భూముల ధరలు అధికం. ఈ రాజధాని ప్రచారంతో అవి మరింత పెరిగిపోయాయి. దాంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే వీఎంఆర్‌డీఏ కూడా సాధారణ ప్రజలను లక్ష్యంగా పెట్టుకోకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఉపయోగపడేలా బల్క్‌ వేలానికి నిర్ణయించింది. అయితే ఇలా అధికారికంగా వేలంలో ఎకరాలకు ఎకరాలు కొంటే...మొత్తం అంతా బ్యాంకుల ద్వారా చెల్లించాల్సి ఉంటుందని, దీని వల్ల పన్నుల భారమే కాకుండా, ఐటీ శాఖ కన్ను కూడా పడుతుందని చాలామంది ఆసక్తి చూపడం లేదంటున్నారు. వేలంలో పాల్గొంటే...అప్‌సెట్‌ ధర కంటే ఎక్కువకు కొనాల్సి ఉంటుందని, వాటిని మళ్లీ అభివృద్ధి చేసి అమ్ముకోవాలంటే...చుక్కలు కనిపిస్తాయని, అందుకే ఎవరూ దరఖాస్తు కూడా చేయడం లేదని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ఒకరు అసలు విషయం బయటపెట్టారు. 


వీఎంఆర్‌డీఏ తీరుపై విమర్శలు

వీఎంఆర్‌డీఏ తన దగ్గర భూములను బహిరంగ వేలానికి పెట్టి అమ్ముకుంటూ, ప్రైవేటు భూములు కలిగినవారు లేఅవుట్లు వేసి వాటిలో 40 శాతం తమకు ఇవ్వాలని, వాటిని మధ్య తరగతి ప్రజలకు 20 శాతం తక్కువ రేటుకు అమ్మి, ఆ డబ్బు సంస్థలకు ఇస్తామంటూ ఇటీవల ఒక ప్రతిపాదన చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో సమావేశం కూడా నిర్వహించింది. సంస్థ భూములను అధిక ధరలకు అమ్ముకొని, తమ భూములు తక్కువ రేటుకు ఇమ్మని అడగడం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ అనుసరిస్తున్న విధానం సరిగ్గా లేదని, అందుకే స్పందన తక్కువగా వుందని చెబుతున్నారు. 


ఈ-వేలానికి పెట్టిన భూములు, వాటి ధరలు.

------------------------------------------------------------------------------------------------

గ్రామం              విస్తీర్ణం ఎకరాల్లో       గజాల్లో         గజం విలువ

---------------------------------------------------------------------------------------------------

మధురవాడ          0.193 ఎకరాలు          934.12          రూ.40 వేలు

మధురవాడ          1.755 ఎకరాలు          8,404.2          రూ.40 వేలు

మధురవాడ          0.832 ఎకరాలు          4,026.88         రూ.40 వేలు

మధురవాడ          0.87 ఎకరాలు           4,200           రూ.40 వేలు

కాపులుప్పాడ         1.66 ఎకరాలు           8,034.4          రూ.29 వేలు

చిట్టివలస            3.55 ఎకరాలు           17,182           రూ.13 వేలు

ఈ.బోనంగి(పరవాడ) 0.87 ఎకరాలు            4,200           రూ.10 వేలు

ఈ.బోనంగి(పరవాడ) 4.5 ఎకరాలు            21,780           రూ.10 వేలు

తుమ్మపాల           3.96 ఎకరాలు          19,166.4          రూ.8 వేలు

తుమ్మపాల           6.00 ఎకరాలు         29,040           రూ.8 వే లు

-------------------------------------------------------------------------------------------------

Updated Date - 2022-09-24T06:34:04+05:30 IST