‘పాకిస్థాన్‌లో మత స్వేచ్ఛ లేదు, హిందువులను బలవంతంగా మతం మార్చుతున్నారు’

ABN , First Publish Date - 2020-08-06T02:27:38+05:30 IST

పాకిస్థాన్‌ ఏర్పడినప్పటి నుంచి అక్కడి హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా

‘పాకిస్థాన్‌లో మత స్వేచ్ఛ లేదు, హిందువులను బలవంతంగా మతం మార్చుతున్నారు’

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ ఏర్పడినప్పటి నుంచి అక్కడి హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారు. మత పెద్దలు, స్థానికుల ఒత్తిళ్ళతో హిందువులు, ఇతర మైనారిటీలు నిర్బంధంగా మతం మారవలసిన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మత మార్పిడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిని ఆసరాగా చేసుకుని, నిర్బంధ మత మార్పిడులు జరిగేలా చేస్తోంది. 


మానవ హక్కులు, మత స్వేచ్ఛ మద్దతుదారులు, ఉద్యమకారులు ఈ విషయాలు చెప్తున్నారు. పాకిస్థాన్ ఏర్పడినప్పటి నుంచి హిందువులతో సహా మైనారిటీలను పద్ధతి ప్రకారం వివక్షకు గురి చేస్తున్నట్లు తెలిపారు. హిందూ మైనర్లను బలవంతంగా పెళ్ళి చేసుకోవడం, మహిళలను అపహరించడం వంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని చెప్పారు. దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందువుల ఆస్తులను లాక్కోవడం పాకిస్థాన్‌లో సర్వసాధారణ విషయాలని తెలిపారు. 


పాకిస్థాన్‌లోని ఆర్థికంగా, కుల పరంగా వెనుకబడిన, బలహీన వర్గాలవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, మతం మారకపోతే ప్రభుత్వ పథకాల ప్రయోజనం కల్పించేది లేదని బెదిరిస్తున్నారని చెప్పారు. 


1947లో పాకిస్థాన్ ఏర్పడేనాటికి హిందువులు ఆ దేశ జనాభాలో 20.5 శాతం మంది ఉండేవారని, 1998 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో హిందువులు 1.6 శాతానికి తగ్గిపోయారని తెలిపారు. 


పాకిస్థాన్ చట్ట సభ మాజీ సభ్యురాలు, ప్రస్తుతం వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న పరిశోధక సంస్థ రెలిజియస్ ఫ్రీడం ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో ఫరనాజ్ ఇస్పహానీ మాట్లాడుతూ, పాకిస్థాన్‌లోని మైనారిటీలను డీహ్యూమనైజ్ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని, ఉపాధి కరువైందని, ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని మత మార్పిడులకు తెగబడుతున్నారని చెప్పారు. హింస, ఆకలి, మరో రోజు బతికి బట్టకడితే చాలుననే భయాందోళన వల్ల హిందువులు మతం మారుతున్నారని చెప్పారు.


2010లో సంభవించిన వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులను కూడా మత మార్పిడులకు వాడుకున్నారని చెప్పారు. వరదల వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారని, ఆ సమయంలో ముస్లింలతో కలిసి హిందువులను కూర్చోనిచ్చేవారు కాదని తెలిపారు. ప్రభుత్వం సైతం హిందువుల పట్ల వివక్ష చూపిందని, ముస్లింల కన్నా హిందువులకు తక్కువ నష్ట పరిహారం ఇచ్చిందని పేర్కొన్నారు. 


మనస్ఫూర్తిగా మతం మారుతారా? అని ప్రశ్నిస్తూ, తాను అలా అనుకోవడం లేదన్నారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో మరింత వర్గ హింస జరుగుతుందని, తద్వారా మైనారిటీలపై మతం మారాలని ఒత్తిళ్ళు పెరుగుతాయని చెప్పారు. 


పాకిస్థాన్ అధికార పార్టీ పాకిస్థానీ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ తరపున గెలిచిన హిందూ పార్లమెంటు సభ్యుడు లాల్ చంద్ మహ్లి మాట్లాడుతూ, మొత్తం మీద, పాకిస్థాన్‌లో మతపరమైన అల్ప సంఖ్యాకులు తాము సురక్షితంగా ఉన్నట్లు భావించడం లేదన్నారు. ఈ మైనారిటీలందరిలోనూ పేద హిందువులు అత్యంత బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. హిందువులు అత్యంత దయనీయ స్థితిలో ఉండటం, నిరక్షరాస్యులు కావడం వల్ల మసీదులు, ముస్లిం ఛారిటీలు, ముస్లిం వ్యాపారులు వీరిని చాలా సులువుగా మతం మార్చుతున్నట్లు తెలిపారు. ఈ విధంగా జరుగుతున్న మత మార్పిడుల్లో ధన ప్రమేయం ఎక్కువగా ఉంటోందన్నారు. 


నిర్బంధ మత మార్పిడుల నుంచి మైనారిటీలను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లాల్ చంద్ ఓ సభ్యుడు. 


మైనారిటీల హక్కులకు రక్షణ కల్పిస్తామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చాలా సార్లు ప్రకటించినప్పటికీ, ఆ వాగ్దానాలను అమలు చేయడం లేదని మానవ హక్కుల మద్దతుదారులు చెప్తున్నారు. మైనారిటీలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ  సమాజం కూడా అనేకసార్లు దుయ్యబట్టింది.


Updated Date - 2020-08-06T02:27:38+05:30 IST