Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఖాళీలు బోలెడున్నా రెగ్యులర్‌ నియామకాలేవీ?

వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలకు కాంట్రాక్‌్ట పద్ధతిని రద్దు చేస్తామని టిఆర్‌ఎస్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన రెండు మూడు వారాలకే కాంట్రాక్ట్ సేవలను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక అప్పటినుంచి నేటి వరకు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైమ్, గంటల ప్రాతిపదికన పని... ఇవన్నీ సమాన పనికి సమాన వేతనం అనే ప్రజాస్వామిక విలువకు విఘాతం కలిగించేవే.


కచ్చితమైన ఖాళీలు ఉన్నప్పుడు అక్కడ రెగ్యులర్ నియామకాలు జరపాలి. తద్వారా ప్రభుత్వశాఖల్లో పనులు సజావుగా సాగుతాయి. ఓవైపు నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. జనాభా అవసరాలకు అనుగుణంగా వివిధ శాఖల్లో అదనపు సిబ్బంది అవసరం కూడా పెరుగుతున్నది. అయినప్పటికీ– కొత్తగా కల్పించవలసిన ఉద్యోగాల మాటేమోగాని ఉన్న ఉద్యోగాల్లో ఏర్పడిన ఖాళీలలోనే నియామకాలు జరపడం లేదు. 


ఇంటర్మీడియట్ విద్యాశాఖకు సంబంధించి సెప్టెంబరు 28, 2021న విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3686 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటన్నింటిలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగులను నియమించాలని, అప్పటికే నియమితులైనవారిని కొనసాగించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలను అసహజ మరణాలకు చేరువ చేస్తున్నారు. ఇది కుట్ర కాక మరేమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 80 శాతం పైగా ఖాళీలు ఉన్నట్లు ఇవే ఉత్తర్వులు పేర్కొంటున్నాయి.


కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్న వారు ఈ దుర్భర పరిస్థితులను మరింతగా పెంచి పోషించడం సమర్థనీయం కాదు. వ్యాపార ధోరణిలో నడిచే ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రిస్తూ, క్రమేపీ వాటి రద్దు దిశగా అడుగులు వేస్తూ, చివరకు పూర్తిగా విద్యను ప్రభుత్వసంస్థల పరం చేయాలి. తద్వారా రాజ్యాంగ విలువలను నిలబెట్టినవారవుతారు.


బి. రామకృష్ణ

Advertisement
Advertisement