రైల్వే జోన్‌ లేదు!

ABN , First Publish Date - 2021-12-09T08:26:35+05:30 IST

మరో విభజన హామీని కేంద్రం అటకెక్కించింది. విశాఖ కేంద్రంగా

రైల్వే జోన్‌ లేదు!

  • మరో విభజన హామీకి కేంద్రం స్వస్తి.. దేశవ్యాప్తంగా ఉన్న జోన్లు 17 మాత్రమే
  • లోక్‌సభలో కేంద్ర మంత్రి జవాబు.. అందులో విశాఖ జోన్‌ మాయం
  • ఈ జోన్‌పై 2019 ఫిబ్రవరిలోనే కేంద్రం ప్రకటన.. రెండు బడ్జెట్లలో నిధులు
  • ఓఎస్‌డీ నియామకం.. ఆర్థిక, సాంకేతిక అంశాలపై రెండేళ్ల కిందటే డీపీఆర్‌


న్యూఢిల్లీ/విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మరో విభజన హామీని కేంద్రం అటకెక్కించింది. విశాఖ కేంద్రంగా తానే ప్రకటించిన కొత్త దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్టల్‌) రైల్వే జోన్‌ ఊసే లేకుండా చేసింది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని బుధవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. అందులో విశాఖ జోన్‌ కనిపించ లేదు. పైగా దేశంలో కొత్త రైల్వే జోన్‌ను మంజూరు చేసే అవకాశమే లేదని ఆయన సెలవిచ్చారు. ఇదే మంత్రి వారం రోజుల క్రితం (డిసెంబరు 1న) పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కొత్త దక్షిణ కోస్తా జోన్‌కు 2020-21 బడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించామని.. ఈ జోన్‌కు తూర్ప కోస్తా రైల్వేలోని కొత్త రాయగడ డివిజన్‌తో కలిపి రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని చెప్పారు. 2019 ఆగస్టులోనే దీని డీపీఆర్‌ను సమర్పించారనీ తెలిపారు. వారం తిరిగేసరికి.. ఆ జోన్‌ ప్రస్తావనే లేకుండా సమాధానమివ్వడం కేంద్రం వైఖరిని తేటతెల్లం చేసింది.


విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు మూడున్నర దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ ఈ హామీని పొందుపరిచారు. ఎట్టకేలకు 2019 ఫిబ్రవరిలో విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అదే ఏడాది ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖకు వచ్చిన ప్రధాని మోదీ రైల్వే మైదానంలోప్రసంగిస్తూ.. రైల్వే జోన్‌ త్వరలోనే ఏర్పాటవుతుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ జోన్‌కు ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ అని నామకరణం చేసినట్లు నాటి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు.


దక్షిణ మధ్య రైల్వే నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు, తూర్పు కోస్తా జోన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలను కలిపి ఇది ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ జోన్‌ పనుల కోసమని ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎ్‌సడీ)గా భారతీయ రైల్వే సిబ్బంది సర్వీసు అధికారి ఎస్‌.ఎ్‌స.శ్రీనివా్‌సను  కూడా నియమించారు. ఆయన ఆర్థిక, సాంకేతిక అంశాలన్నింటినీ పేర్కొంటూ జోన్‌ ఎలా ఏర్పాటు చేయాలో డీపీఆర్‌ను రెండేళ్ల క్రితమే రైల్వే బోర్డుకు పంపించారు. దానిని ఇప్పటివరకు బోర్డు పరిశీలించలేదు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా.. ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు.


అయితే విశాఖ జోన్‌ను గుర్తిస్తూ గత రెండు బడ్జెట్లలోనూ కేంద్రం నిధులు కేటాయించడం గమనార్హం. తాజాగా బీజేపీ ముజఫర్‌పూర్‌ (బిహార్‌) ఎంపీ అజయ్‌ నిషాద్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వైష్ణవ్‌ బదులిస్తూ.. దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని.. ఇక ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడా కొత్త జోన్‌ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఆయన చెప్పిన17జోన్లలో విశాఖ జోన్‌ లేదు.



కరోనా సమయంలో ఏం చేశారు?

కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేశారు. ఆ సమయంలో దాదాపుగా ఏడాది పాటు రైల్వే అధికారులకు, బోర్డుకు పెద్దగా పనులేమీ లేవు. ఆ ఖాళీ సమయంలో విశాఖ జోన్‌ డీపీఆర్‌ను పరిశీలించి ఉంటే.. ఇప్పటికి సగం పనులు పూర్తయి ఉండేవి. కానీ రైల్వే బోర్డు డీపీఆర్‌ను పక్కన పెట్టేసింది.




ప్రధాని హామీకి కూడా దిక్కు లేదా?

కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుపై స్వయంగా ప్రధాని మోదీయే విశాఖపట్నం వచ్చి హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వంలో మోదీ హామీకే దిక్కు లేని పరిస్థితి ఉందా? డీపీఆర్‌ ఇచ్చి రెండేళ్లు అవుతుంటే రైల్వే బోర్డు ఏం చేస్తోంది? ఇదేనా కేంద్రం పనితీరు..? జోన్‌ ఏర్పాటు చేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం. ఈసారి బీజేపీకి ఏపీలో నూకలు చెల్లిపోయినట్లే!

- జేవీ సత్యనారాయణమూర్తి, కన్వీనర్‌, విశాఖ రైల్వే జోన్‌ సాధన సమితి


Updated Date - 2021-12-09T08:26:35+05:30 IST