అంటుకుంటే బుగ్గే.. ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఫైర్‌సేఫ్టీ నిల్‌

ABN , First Publish Date - 2020-08-11T15:44:46+05:30 IST

ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రుల్లోనే ప్రాణాలు పోతున్నాయి. అసలే కరోనాతో ప్రాణాలను అర చేతిలో పట్టుకుని బతుకుతున్న వారికి ఆస్పత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

అంటుకుంటే బుగ్గే.. ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఫైర్‌సేఫ్టీ నిల్‌

అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అంతే..

ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్‌, 

కోఠి ఆస్పత్రుల్లో సదుపాయాలు అంతంతే..

పరికరాలు ఉన్నా.. పని చేయని వైనం

పలు ఆస్పత్రుల్లో ఘటనలు.. 

అయినా, స్పందించిన అధికారులు


హైదరాబాద్‌ సిటీ/మంగళ్‌హాట్‌ (ఆంధ్రజ్యోతి): ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రుల్లోనే ప్రాణాలు పోతున్నాయి. అసలే కరోనాతో ప్రాణాలను అర చేతిలో పట్టుకుని బతుకుతున్న వారికి ఆస్పత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ ఎలా ఉందో పరిశీలిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కాదు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అగ్ని ప్రమా ద నివారణ చర్యలు నామమాత్రంగానే ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే పెద్దాసుపత్రులుగా పేరుగాంచిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ లేకపోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని రోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ పరికరాలు మినహా పూర్తిస్థాయిలో ఫైర్‌సేఫ్టీ లేదు. గతేడాది ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రధాన ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా అగ్నిమాపక పరికరాలు, సిలిండర్లను అందుబాటులో ఉంచినప్పటికీ దాదాపు రెండేళ్లుగా అవి వినియోగించలేదు. వాటిని ఆరు నెలలకు ఒకసారి రీఫిల్‌ చేయాల్సి ఉంటుంది. అది కూడా చేయకపోవడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటే అవి పనిచేసే అవకాశం లేదని సిబ్బంది అంటున్నారు. కరోనా చికిత్సకు కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో మాత్రం అగ్నిమాపక చర్యలు పటిష్టంగానే ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.  ఏడాది క్రితం జరిగిన సంఘటనతో అప్రమత్తమై అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.


ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో..

ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో 450 పడకలు ఉండగా, రెండు భవనాలు ఉన్నాయి. నూతన భవనానికి ఐరన్‌ ఫైర్‌సేఫ్టీ ఉన్నప్పటికీ గత నెలలో పాత భవనంలోని బ్లడ్‌బ్యాంక్‌లో అగ్నిప్రమాదం జరిగితే, అదుపు చేసేందుకు అది పనిచేయలేదు. దీంతో ఫైర్‌స్టేషన్‌ నుంచి మూడు ఫైర్‌ఇంజన్లు రప్పించి మంటలను అదుపు చేశారు. అప్పటికే విలువైన యంత్రాలు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. బ్లడ్‌బ్యాంక్‌ పైఅంతస్తులో, సమీపంలో రోగులు చికిత్సలు పొందుతున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో రోగులను తరలించేందుకు దాదాపు మూడు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. అయినా, ఇప్పటి వరకు ఫైర్‌ సేఫ్టీపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.


నిలోఫర్‌లో... 

చిన్నపిల్లలకు అతిపెద్ద ఆస్పత్రిగా పేరుగాంచిన వెయ్యి పడకల నిలోఫర్‌ ఆస్పత్రిలో మూడు భవనాలు ఉన్నాయి. నాట్కో, ఇన్ఫోసెస్‌ భవనాల్లో ఐరన్‌ ఫైర్‌సేఫ్టీ ఉంది. పాత భవనంలో పిడియాట్రిక్‌ విభాగంతోపాటు, చిన్నపిల్లల వార్డులు ఉన్నాయి. ఈ భవనంలో ఫైర్‌ సేఫ్టీ కోసం సిలిండర్లు మాత్రమే ఉన్నాయి. సంవత్సరాల క్రితం ఫిల్‌ చేసినవి కావడంతో అవి పనిచేసే అవకాశం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఒక వేళ నిలోఫర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే.. పరిస్థితి ఊహించలేం. 


కింగ్‌ కోఠిలో..

కింగ్‌కోఠి ఆసత్రిలో 380 పడకలు, రెండు భవనాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రిని కొవిడ్‌ సెంటర్‌గా మార్చారు. ఇందులో 180 పడకలున్న నూతన భవనంలో ఐరన్‌ ఫైర్‌సేఫ్టీ ఉండగా, 200 పడకలున్న పాత భవనంలో దాదాపు 30 ఫైర్‌ సేఫ్టీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి కోసం నాలుగు నెలల క్రితం ఫైర్‌సేఫ్టీ సిలిండర్లను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐసొలేషన్‌ మొదలుకొని, వార్డులన్నింటీ వద్ద సిలిండర్లను అందుబాటులో ఉంచినట్లు వారు పేర్కొన్నారు.


ఫీవర్‌ ఆస్పత్రిలో..

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం 9 వార్డులు అందుబాటులో ఉండగా, సుమారు 400 బెడ్లు చికిత్స కోసం వినియోగిస్తున్నారు. మూడు అంతస్తుల్లో భవనంతోపాటు గ్రౌండ్‌ ఫ్లోర్‌తో ఉన్న భవనాల్లో ఉన్న వార్డులకు అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అన్నిచోట్ల అగ్నిమాపక సిలిండర్లు ఉంచి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు  అధికారులు చెబుతున్నారు. 


గాంధీ ఆస్పత్రిలో..

ఏడాది క్రితం గాంధీ ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో షాక్‌ సర్క్యూట్‌ కారణంగా  ఐసీయూ వార్డులో మంటలు రేగి, కొన్ని వైద్య పరికరాలు కాలిపోయాయి. ఆ సమయంలో అక్కడ పేషంట్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అప్పటి నుంచి గాంధీలో అగ్ని మాపక విభాగం అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఎనిమిది అంతస్తుల్లో  విస్తరించి ఉన్న గాంధీ ఆస్పత్రిలో 1,500 బెడ్లు ఉంటాయి. ప్రస్తుతం కరోనా రోగులకే చికిత్స అందిస్తున్నారు. జాగ్రత్తలు సైతం ప్రత్యేకంగా  తీసుకుంటున్నారు.


ఉస్మానియా ఆస్పత్రిలో.. 

పదమూడు వందల పడకల సామర్థ్యం గల ఉస్మానియా ఆస్పత్రిలోని మూడు బ్లాకులకు ఐరన్‌ ఫైర్‌ సేఫ్టీ లేదు. శతాబ్ద కాలం నాటి పాత భవనంతోపాటు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, ఆపరేషన్‌ థియేటర్లు ఉన్న క్యూక్యూడీసీ, అత్యవసర విభాగాలు, 100 పడకల ఐసొలేషన్‌ వార్డు ఉన్న ఓపీ బ్లాక్‌లోనూ ఐరన్‌ ఫైర్‌ సేఫ్టీ లేదు. సంవత్సరాల క్రితం ఆయా భవనాల్లో ఫైర్‌ సేఫ్టీకి సిలిండర్లు, పరికరాలను ఏర్పాటు చేశారు. వాటి రీఫిలింగ్‌, నిర్వహణ పట్టించుకునే వారు లేకపోవడంతో అవన్నీ హెల్త్‌ఇన్‌స్పెక్టర్‌ గదిలోని ఓ మూలకు చేరాయి. ఉస్మానియాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటే భారీ ప్రాణనష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. ఆరు నెలల క్రితం ఉస్మానియా పాత భవనం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఫైర్‌స్టేషన్‌ నిర్మాణం పనులు చేపట్టారు. అది అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే మంటలను ఆర్పేందుకు సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌పై ఆధారపడాల్సిదే.

Updated Date - 2020-08-11T15:44:46+05:30 IST