న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను మార్చే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉందంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారంనాడు తెరదించారు. ముఖ్యమంత్రి మార్పు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం బీజేపీ ముందు లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇటీవల కర్ణాటక మంత్రి, సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప తన కేబినెట్ సహచరుడైన మురేగేష్ నిరానిని సమర్ధుడైన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొనడం, త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించడం తాజా ఊహాగానాలకు తావిచ్చింది.
కాగా, ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై నిరానీ వెంటనే వివరణ ఇచ్చారు. ఈశ్వరప్పకు తనపై ఉన్న నమ్మకం, గౌరవం ఉన్నందుకు సంతోషమని, ఆ కోణంలోంచే ఆయన మాట్లాడరని, అయితే 2023లో పదవీకాలం పూర్తయ్యేంత వరకూ బొమ్మైనే సీఎంగా సేవలందిస్తారని చెప్పారు. ఈశ్వరప్ప కామెంట్లను ఒక 'జోక్'గా కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా కొట్టివేశారు. ఈ వదంతులకు కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి తాజాగా తెరదించారు. ''ఇప్పటికైతే పార్టీ ముందు నాయకత్వ మార్పు ప్రతిపాదన ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఈ మాట చెబుతున్నాను. ముఖ్యమంత్రి మార్పు ఉండదు. బసవరాజ్ బొమ్మై సీఎం పదవిలో కొనసాగుతారు. నాయకత్వ మార్పుపై ఎవరూ మాట్లాడకుండా ఉండటం మంచిది'' అని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
కేబినెట్ విస్తరణపై...
కాగా, కర్ణాటక మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయంటూ వస్తున్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారంనాడు స్పందించారు. ఢిల్లీ అగ్రనేతలతో మాట్లాడిన అనంతరం మాత్రమే మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ఉంటుందన్నారు. ప్రస్తుతానికైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ పోల్స్, బెళగవిలో అసెంబ్లీ సమావేశాలపైనే తాము దృష్టిసారించామని చెప్పారు. మంత్రివర్గ విస్తవరణకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ అనేది సీనియర్ నాయకత్వం సూచనలు, సలహాలకు అనుగుణంగానే ఉంటుందని తెలిపారు.