చైనా నుంచి విద్యుత్ సామగ్రి దిగుమతికి కేంద్రం చెక్..

ABN , First Publish Date - 2020-07-04T00:33:09+05:30 IST

చైనా యాప్‌లను నిషేధిస్తూ 'డిజిటల్ స్ట్రయిక్' చేసిన కేంద్రం మరింత వ్యూహాత్మకంగా వ్యవహిస్తోంది. తమ ముందస్తు అనుమతి..

చైనా నుంచి విద్యుత్ సామగ్రి దిగుమతికి కేంద్రం చెక్..

న్యూఢిల్లీ: చైనా యాప్‌లను నిషేధిస్తూ 'డిజిటల్ స్ట్రయిక్' చేసిన కేంద్రం మరింత వ్యూహాత్మకంగా వ్యవహిస్తోంది. తమ ముందస్తు అనుమతి లేకుండా చైనా, పాక్ నుంచి విద్యుత్ సామగ్రిని రాష్ట్రాలు దిగుమతి చేసుకోరాదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ శుక్రవారంనాడు పేర్కొన్నారు.


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రులతో సదస్సు అనంతరం సింగ్ మాట్లాడుతూ, ఇవాళ దేశంలోని విద్యుత్ వ్యవస్థకు అవసరమైన ప్రతీదీ దేశంలోనే తయారు చేసుకుంటున్నామని చెప్పారు. ఆ సామర్థ్యం మనకు ఉందని అన్నారు. 2018-19లో రూ.71,000 కోట్లు విలువ చేసే విద్యుత్ సామగ్రిని మనం దిగుమతి చేసుకోగా, ఇందులో రూ.21,000 కోట్ల విద్యుత్ సామగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. తాజాగా, కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఎలాంటి విద్యుత్ సామగ్రిని దిగుమతి చేసుకోరాదని నిర్ణయించినట్టు చెప్పారు.


విద్యుత్ రంగం వ్యూహాత్మక రంగమని, సైబర్ దాడులకు అవకాశాలుంటాయని, ట్రోజాన్ వంటి మాల్‌వేర్స్‌ ఉండే అవకాశం ఉన్నందున దిగుమతయ్యే సామగ్రిని చెక్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సామగ్రి సేకరణ విషయంలో దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. కొన్ని విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రధానంగా చైనాతో పాటు ఇతర దేశాల్లో తయారయ్యే సామగ్రిని వాడుతున్నారని, ఆ సామగ్రిని దేశీయంగానే తయారు చేసుకునేలా చూడాలని అన్నారు.


దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన (డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డవలప్‌మెంట్ స్కీమ్‌ను విలీనం చేసి, త్వరలోనే కొత్త పథకం ప్రకటిస్తామని కూడా మంత్రి చెప్పారు. కొత్త స్కీమ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని ఆర్‌కే సింగ్ తెలిపారు.

Updated Date - 2020-07-04T00:33:09+05:30 IST