తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసుపై రాజకీయ ఒత్తిడి లేదు: పోలీసులు

ABN , First Publish Date - 2020-07-04T01:51:42+05:30 IST

తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసులో విచారణపై అధికార పార్టీ జోక్యం లేదని పోలీసులు..

తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసుపై రాజకీయ ఒత్తిడి లేదు: పోలీసులు

చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసులో విచారణపై అధికార పార్టీ జోక్యం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో క్రైమ్ బ్రాంచ్-క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం (సిబి-సిఐడి) ఐజీ కె.శంకర్ మాట్లాడుతూ.. ‘‘టుటికొరిన్ జిల్లా, శాతంకుళానికి చెందిన పి. జయరాజు, బెన్నిక్స్ కస్టోడియల్ డెత్  కేసు విచారణపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను అవాస్తవం. ఐదుగురు పోలీసుల మీద హత్యానేరం, ఆధారాలు తారుమారు చేయడం సహా ఇతర అభియోగాలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పరారీలో ఉన్న మరో కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నాం. ముందు ముందు మరిన్ని అరెస్టులు కూడా ఉండొచ్చు..’’ అని పేర్కొన్నారు. 


గత నెల 19న నిర్దేశించిన సమయానికి అదనంగా మరో 15 నిమిషాల పాటు మొబైల్ షాపు తెరిచి ఉంచారన్న కారణంగా పోలీసులు జయరాజ్ (59), అతడి కుమారుడు బెనిక్స్ (31)లను అరెస్ట్ చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత ఇద్దర్నీ చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. శరీరంపైనా, లోపలా తీవ్ర గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 22న సాయంత్రం 7.45కి బెనిక్స్‌ను ఓ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 9 గంటలకు మృతి చెందాడు. అయన తండ్రిని అదేరోజు రాత్రి 10 గంటలకు ఆస్పత్రిలో చేర్చగా.. మరుసటి రోజు ఉదయం 5.40కి మృతి చెందాడు. ఈ మరణాలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. అయితే సీబీఐ ఈ కేసుపై విచారణ చేపట్టేలోపు ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉన్నందున ఈలోగా సీబీ-సీఐడీ దర్యాప్తు చేపట్టాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2020-07-04T01:51:42+05:30 IST