డోపీకి ప్లేసు.. విజేతకు లేదా చోటు?

ABN , First Publish Date - 2020-08-15T08:55:31+05:30 IST

టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)కు సంబంధించి 258 మంది అథ్లెట్లతో కూడిన జాబితాను భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) తాజాగా ప్రకటించింది

డోపీకి ప్లేసు.. విజేతకు లేదా చోటు?

బెంగళూరు: టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)కు సంబంధించి 258 మంది అథ్లెట్లతో కూడిన జాబితాను భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) తాజాగా ప్రకటించింది. అయితే, ఆ జాబితాలో.. మేటి హెప్టాథ్లెట్‌, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత స్వప్నా బర్మన్‌కు చోటు లేకపోగా డోపీకి స్థానం కల్పించడం విమర్శలకు తావిస్తోంది. ‘2018 ఆసియా క్రీడల్లో పసిడి, దోహా ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో రజత పతకం నెగ్గింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత రేస్‌లో తప్పకుండా ఉంటుంది. అలాంటి అథ్లెట్‌కు టాప్స్‌ జాబితాలో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని ప్రముఖ కోచ్‌ ఒకరు వ్యాఖ్యానించాడు. టాప్స్‌లో తనకు స్థానం లభించకపోవడం నిరాశ కలిగించినా.. కఠిన సాధనను కొనసాగిస్తానని బర్మన్‌ చెప్పింది. ‘దీని గురించి ప్రతికూలంగా ఆలోచించ దలుచుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో మరింత రాణించేందుకు ప్రయత్నిస్తా’ అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల స్వప్న తెలిపింది. ఇక.. 2017లో డోపింగ్‌లో దొరికిపోయిన జావెలిన్‌ త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌కు జాబితాలో చోటు కల్పించడం గమనార్హం. ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో రజతం గెలుపొందిన అనంతరం యాదవ్‌.. డోపీగా  తేలాడు. అతడిపై నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉన్నా ఏడాది శిక్షతో నాడా సరిపెట్టింది.

Updated Date - 2020-08-15T08:55:31+05:30 IST