Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 03 Sep 2021 00:00:00 IST

ఆధ్యాత్మికతలో భయానికి స్థానం లేదు!

twitter-iconwatsapp-iconfb-icon
ఆధ్యాత్మికతలో భయానికి స్థానం లేదు!

‘‘హృదయపూర్వకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడమే ధ్యానం లక్ష్యం. కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం... ఇలాంటి ఏ వివక్షకూ ఇందులో తావు లేదు’’ అంటారు ‘శ్రీ రామచంద్ర మిషన్‌’ అధిపతి దాజీ (కమలేశ్‌ డి. పటేల్‌). అటువంటి అనుభూతిని సర్వ జనులకూ అందించడమే ధ్యేయంగా పని చేస్తున్న దాజీ... మనిషి జీవించేది ఆనందం కోసమైతే దాన్ని పొందే మార్గం ధ్యానమేని చెబుతారు. పురాణేతిహాసాల నుంచి కొవిడ్‌ లాంటి సమకాలీన సమస్యల వరకూ, తాత్త్విక చింతన నుంచి వ్యక్తి వికాసం వరకూ ఎన్నో అంశాలపై ఆయన ‘నివేదన’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.కొవిడ్‌ అందరి జీవితాల్లో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఈ పరిస్థితులను ఆధ్యాత్మిక కోణం నుంచి ఎలా చూడాలి?

కొవిడ్‌ అందరికీ కొత్తగా బతకటం నేర్పింది. దీనిని మనం ఇంకా పూర్తిగా నివారించలేకపోతున్నాం. అయితే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి భౌతికంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు. కానీ కొవిడ్‌ కన్నా భయంకరమైన మానసిక సమస్యలు ఉన్నాయి. వీటికి ఎటువంటి వ్యాక్సిన్‌ లేదు. మానసిక సమస్యలు ఉన్నాయని కొందరు బయటకు చెబుతారు. కొందరు చెప్పరు. కానీ నా ఉద్దేశంలో మానసిక సమస్యలు లేని కుటుంబం ఒక్కటి కూడా ఉండదు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం- భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞత. ఈ స్థితికి చేరుకుంటే- మానసికంగా మనం వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లే.


ఈ స్థితప్రజ్ఞతను ఎలా సాధించలుగుతాం? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు.. ఇతర పవిత్ర గ్రంఽథాలు చదవటం ద్వారా ఈ స్థితిని చేరవచ్చా? 

లేదు. చేరలేం. అయితే మనకు కావాల్సిన అన్ని ఆధ్యాత్మిక అంశాలు ఈ గ్రంథాల్లో ఉన్నాయి. వీటిని చదవటం... అందులోని మంచిని గ్రహించటం తప్పు కాదు. కానీ ఆచరణ లేకుండా కేవలం చదవటం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఉదాహరణకు మీరు తాజ్‌ ప్యాలెస్‌ లాంటి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్లారనుకుందాం. అక్కడ అందమైన మెనూ ఇస్తారు. అందులో అనేక ఆహార పదార్థాల పేర్లు, దినుసులు, తయారీ చేసే విధానం, ఫొటోలు అన్నీ ఉంటాయి. వాటిని చూస్తే మీ ఆకలి తీరుతుందా? మరింత ఆకలి వేస్తుంది. ఇలా- గ్రంథాల వల్ల ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. అనురక్తి కలుగుతుంది. ఆ అంశాలను ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. వీటిలో ఉన్న చిన్న చిన్న విషయాలు మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి. ఉదాహరణకు దేవుడి విగ్రహం ముందు తలవంచటం- మనకు జీవితంలో నమ్రతను నేర్పుతుంది. రాతి విగ్రహానికే మొక్కినప్పుడు - కళ్ల ముందు జీవించి ఉన్న పెద్దవాళ్ల ముందు ఎందుకు తలవంచకూడదనే ఆలోచన కలగజేస్తుంది. 


కొవిడ్‌ తర్వాత అందరిలోను ఒక విధమైన భయం ప్రవేశించింది.. దీనిని ఎలా తొలగించుకోవాలి?

అలజడి-ప్రశాంతత మాదిరిగా భయం-ధైర్యం ఒకే నాణానికి ఉండే రెండు పార్శ్వాలు. భయం, ఒత్తిడి లేకపోతే అభివృద్ధి ఉండదు. ఉదాహరణకు కొవిడ్‌ వల్ల సమస్యలు వస్తాయనే భయం లేకపోతే ఎవరూ జాగ్రత్తలు పాటించరు. అలాగని ఈ భయం పెరిగిపోతే మానసిక, శారీరక సమస్యలు ఏర్పడతాయి. మనకు ఒక భయం ఏర్పడటానికి వెనక ఉన్న కారణాన్ని గమనిస్తే- అనేక సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఆధ్యాత్మిక కోణం నుంచి కూడా చూద్దాం. ‘‘నేను దేవుడికి భయపడతాను’’ అని అనేవాళ్లు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అసలు మనం దేవుడిని చూసి ఎందుకు భయపడాలి? ఆధ్యాత్మిక ప్రపంచంలో భయానికి స్థానం లేదు. భగవంతుడితో ఒక వ్యక్తికి ఉండేది ప్రేమతో కూడిన సంబంధమే! ఇలాంటి భయం లేని సంబంధం ఏర్పడాలంటే కొన్ని నియమ నిబంధనలతో జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికతలో భయానికి స్థానం లేదు!

ఒక సాధారణ వ్యక్తి జీవితానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది?

ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటాడు.. ఆనందంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత కావాలి. ఈ ప్రశాంతతను మనకు ఇచ్చేది మన హృదయం. మెదడు మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కానీ ప్రశాంతతను ఇవ్వదు. ‘ఒకే విషయంపై దృష్టిని కేంద్రీకరించటం.. లేదా పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించటమే ధ్యానం’ అనే నిర్వచనం చెబుతూ ఉంటారు. ఒక వ్యాపారవేత్త డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక యువకుడు తన ప్రేయసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది ధ్యానం కాదే! అంటే ధ్యానం అంటే ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించటంతో పాటుగా.. దాన్ని అనుభవించగలగాలి. అంటే ఆలోచన నుంచి అనుభూతికి ప్రయాణించాలి. దీనికి కుల, మత, జాతి, లింగ బేధాలు ఉండవు. దేవుడిని నమ్మటం, నమ్మకపోవటమనే తేడా ఉండదు. ‘‘నువ్వు ఎవరో నాకు తెలియదు.. నువ్వు ఉన్నావా? లేదా? అనే విషయాన్ని తెలియజేయి...’’ అని ప్రార్థిస్తే చాలు. ఆ అనుభూతి పొందినప్పుడు కలిగేదే నిజమైన ఆనందం. ఆ ఆనందం కోసమే కదా అందరూ జీవిస్తున్నారు. దానికి మార్గం ధ్యానమే!


ఇది అందరికీ సాధ్యమవుతుందా? పరిస్థితుల్లో మార్పు లేకుండా ఒకే ప్రాంతంలో లేదా ప్రదేశంలో కూర్చుని ధ్యానించటం వల్ల ప్రయోజనం ఉంటుందా?

మానవుడు చలనశీలి. ఎప్పుడూ మార్పును కోరుకుంటూ ఉంటాడు. కానీ ఆధ్యాత్మిక కోణం దీనికి భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తి కొత్త ప్రదేశానికి వెళ్లకపోవచ్చు. కానీ ధ్యానం చేస్తూ ఉంటే- అతనిలో అంతర్గతంగా మార్పులు వస్తాయి ఆధ్యాత్మిక స్థితిలో మార్పు వస్తుంది. ఇక్కడొక విషయాన్ని చెప్పాలి. మనిషి హృదయం ఒక ప్రయోగశాల. దీనిలోని గొప్పదనమేమిటంటే - మనిషే శాస్త్రవేత్త. మనిషే ప్రయోగాలకు నమూనా. ఫలితాన్ని అనుభవించేది కూడా ఆ మనిషే!


ఆధునిక యువత - ప్రతి విషయానికి శాస్త్రీయమైన ఆధారాలు అడుగుతూ ఉంటారు. విశ్వాసమనే పునాదులను వారు నమ్మరు. అలాంటి వారిని ఆధ్యాత్మికతవైపు, ధ్యానం వైపు ఎలా మళ్లించాలి?

ఇలాంటి పరిస్థితులు మనకు కొత్త కాదు. రాముడు, సీతలతో జాబాలి ముని వాదన వింటే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఇదే చార్వాక సిద్ధాంతంగా చాలా కాలంగా అనేకమంది అనుసరిస్తున్నారు. అయితే బ్రాహ్మణులు దీన్ని ప్రచారంలోకి రానివ్వలేదు. ఒక సారి జాబాలి- రాముడు,సీత ఎదురుపడతారు. అప్పుడు రాముడితో జాబాలి- ‘‘నువ్వు రాజువు... ప్రజలను పాలించాలి. అంతే తప్ప అరణ్యవాసానికి వెళ్లి సమయాన్ని వృథా చేసుకుంటావా?’’ అంటాడు. అదే విధంగా సీతతో - ‘‘విధవరాళ్లైన ముగ్గురు అత్తలను చూసుకోవాల్సిన బాధ్యత నీపై లేదా?’’ అని ప్రశ్నిస్తాడు. ‘అశ్వమేధంలో ఆవును వధించకుండా.. గుర్రాన్నే ఎందుకు వధిస్తారు? నరమేథ యజ్ఞంలా - పత్నిమేథ యజ్ఞం ఎందుకు చేయరు?’ అని అడుగుతాడు. ఆధునిక యువతకు కూడా ఇలాంటి సందేహాలు రావటంతో తప్పు లేదు. చార్వాక సిద్ధాంత ప్రకారం ఒక వ్యక్తి భౌతికంగా స్వయం సమృద్ధి సాధిస్తే తప్ప ఆధ్యాత్మికత అవసరం లేదు. అయితే దీన్ని నేను పూర్తిగా అంగీకరించను. ఒక వైపు భౌతికంగా... మరో వైపు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించాలి. ఉదాహరణకు ఒక పక్షిని తీసుకోండి. పక్షికి తోక సూచికలా ఉపయోగపడుతుంది. తన మార్గాన్ని మలుచుకోవటానికి తోకను ఉపయోగించుకుంటుంది. మనిషికి హృదయం తోకలాంటిది. మనిషి మార్గం మారటానికి ఇది ఉపకరిస్తుంది. ఒక వ్యక్తి ధ్యానం చేస్తూ పోతే- జీవితమే ధ్యానంగా మారిపోతుంది. అలాంటి వారిని ఎవరూ కదపలేరు. 


శ్రీ రామచంద్ర మిషన్‌ గ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌ - హైదరాబాద్‌ శివార్లలోని కన్హా శాంతి ఆశ్రమంలో ఉంది. సుమారు 160 దేశాల్లో శాఖలు ఉన్న రామచంద్ర మిషన్‌కు దాజీ అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రారంభించిన హార్ట్‌ఫుల్‌నెస్‌ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణం వంటి అనేక అంశాల్లో రామచంద్ర మిషన్‌కు చెందిన కొన్ని లక్షల మంది కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ నిర్వహించే ధ్యాన శిక్షణ తరగతులకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను ఠీఠీఠీ.జ్ఛ్చిట్టజఠజూుఽ్ఛటట.ౌటజ ద్వారా తెలుసుకోవచ్చు.
‘‘డిజిటల్‌ యుగం అనేక ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. డిజిటల్‌ ఫ్లాట్‌ఫారాలు మానవాళికి వరాలు. అందరినీ ఒకే తాటిపై కలిపే సాధనాలు. అవే శాపాలుగా కూడా మారుతున్నాయి. ఏ ఇంట్లో, ఏ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవటం లేదు. కోట్ల మంది తమ దిళ్ల కింద ఫోన్లను పెట్టుకొని పడుకుంటున్నారు. యంత్రాలు మనుషులను నియంత్రించే పరిస్థితి వస్తోంది. గ్రీకు నాగరికత ఎలా అంతమయిందో చాలా మందికి తెలియదు. ఆ సమయంలో పాత్రలు నిగనిగలాడటం కోసం మైలుతుత్తాన్ని వాడటం మొదలుపెట్టారు. ఈ మైలుతుత్తమే వారి పాలిట విషంగా మారింది. ఈ విధంగానే డిజిటల్‌ ఫ్లాట్‌ఫారాలను సరిగ్గా వాడుకోకపోతే వినాశనం దిశగా ప్రయాణిస్తాం.’- సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఫొటోలు: లవకుమార్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.