భౌతికదూరం లేదు... కరోనా భయం లేదు!

ABN , First Publish Date - 2021-05-17T06:15:53+05:30 IST

మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో ఆదివారం చేపలు, నాటుకోళ్ల కోసం ప్రజలు పోటెత్తారు. కనీసం భౌతిక దూరం పాటించకపోగా మాస్కులు ధరించకపోవడం గమనార్హం.

భౌతికదూరం లేదు... కరోనా భయం లేదు!
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారి పల్లె లో మాంసం, చేపల కోసం గుమిగూడిన ప్రజలు

మదనపల్లె రూరల్‌/ నిమ్మనపల్లె, మే 16: కరోనా సెకండ్‌వేవ్‌లో విజృంభిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు  భౌతికదూరం  పాటించడం లేదు. కరోనా అంటే భయపడటం లేదు. బంధువులు, మిత్రులను కలవాలన్నా ముఖం చాటేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. కానీ మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో ఆదివారం చేపలు, నాటుకోళ్ల కోసం ప్రజలు పోటెత్తారు. కనీసం భౌతిక దూరం పాటించకపోగా మాస్కులు ధరించకపోవడం గమనార్హం. నీరుగట్టువారిపల్లె టమోటా మార్కెట్‌ యార్డు ఎదురుగా ప్రతి ఆది, మంగళవారాల్లో ఇతర ప్రాంతాల నుంచి చేపలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి నాటుకోళ్లు తెచ్చి విక్రయిస్తుంటారు. వందల మంది ఇక్కడ కొనుగోలుదారులు, వ్యాపారులు వస్తుంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుం డటంతో భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతిని ధులు, డాక్టర్లు చెబుతున్నా  ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రజలు కరోనా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. నిమ్మనపల్లె మండలంలో కరోనా విలయ తాండవం చేస్తున్నా ప్రజలు కాసింత భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ  భౌతికదూరం పాటించడం లేదు. నిత్యావసరాల కోసం చట్టుపక్కల గ్రామాల నుంచి నిమ్మనపల్లె పట్టణానికి అధిక సంఖ్యలో గ్రామీణులు వస్తున్నారు. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించక పోవడంతో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం చికెన్‌, మటన్‌ కోసం దుకాణాల వద్ద గుంపులుగా చేరారు.  టీ బంకులు, హోటళ్ల వద్ద కూర్చొని బీడీలు, సిగరెట్లు తాగుతూ కరోనాపై చర్చించడం గమనార్హం. పాజిటివ్‌ నిర్ధరణ అయిన వారు సైతం విచ్చలవిడిగా తిరుగుతుం డడంతో  కేసుల సంఖ్య పెరిగి పోయింది.  



కొనసాగిన కర్ఫ్యూ 


మదనపల్లె అర్బన్‌: పట్టణంలో పన్నెండో రోజు కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలైంది. ఆదివారం కావ డంతో ఉదయం నుంచి పట్టణంలో మటన్‌, చికెన్‌ దుకాణాల వద్ద జనాలు గుంపుగా చేరారు. మధ్యా హ్నం 12 గంటల తరువాత దుకాణాలు మూత పడ్డాయి. పట్టణంలో పలు చోట్ల వాహనాల రాక పోకలను కట్టడి చేయడానికి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌, అప్పారావువీధి, చిత్తూరు , బెంగళూరు బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. 

Updated Date - 2021-05-17T06:15:53+05:30 IST