అనుమతి లేకుండానే కరోనా చికిత్స

ABN , First Publish Date - 2021-05-15T05:50:38+05:30 IST

కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం కొన్ని వైద్యశాలలకు అనుమతి ఇచ్చింది. ఆ వైత్యశాలల్లో ప్రభుత్వ అధికారులను పర్యవేక్షణకు నియమించింది.

అనుమతి లేకుండానే కరోనా చికిత్స
తనిఖీలు చేస్తున్న అధికారులు

 ఆకాష్‌ వైద్యశాలలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ


నెల్లూరు(క్రైం), మే 14: కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం కొన్ని వైద్యశాలలకు అనుమతి ఇచ్చింది. ఆ వైత్యశాలల్లో ప్రభుత్వ అధికారులను పర్యవేక్షణకు నియమించింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు వైద్యశాలల్లో అనుమతులు లేకుండానే కరోనా చికిత్స చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు శుక్రవారం సాయంత్రం నగరంలోని పొగతోటలో ఉన్న ఆకాష్‌ వైద్యశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో  కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురు కరోనా సోకిన రోగుల వివరాలు తెలుసుకున్నారు. ఇంకా ఎవరికైనా కరోనా చికిత్స అందించారా అని రికార్డులు పరిశీలిస్తున్నారు. సామాన్య రోగులకు, కరోనా సోకిన రోగులకు కలిపి చికిత్స చేస్తూ కరోనాను వ్యాప్తి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆసుపత్రిలో సేకరించిన వివరాల ఆధారంగా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్‌, వైద్యులు అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


వీఎస్‌యూ వీసీ తొలగింపు!

ఇన్‌చార్జ్‌ వీసీగా రాజశేఖర్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ


వెంకటాచలం, మే 14 : విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ (వీసీ) రొక్కం సుదర్శన్‌ రావును తొలగిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా సుదర్శన రావు నియామకం జరిగిందని, దీంతో ఆ పదవి నుంచి ఆయన్ను తొలగిస్తునట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌ వీసీగా పాఠశాల విద్యా శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (ఐఏఎస్‌) ఆర్‌ రాజశేఖర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర ఉత్వర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-05-15T05:50:38+05:30 IST