పింఛన్లనూ వదల్లేదు!

ABN , First Publish Date - 2022-07-01T05:38:05+05:30 IST

జిల్లాలో మరో రాజకీయ సభకు వైసీపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంక్షేమ పథకాల పంపిణీని కూడా తన ప్రచారార్భాటానికి వాడుకుంటోంది. భారీ సభలు ఏర్పాటు చేసి పార్టీని ఫోకస్‌ చేస్తోంది. పేదల సంక్షేమం కోసం అంటూ గొప్పలు చెబుతోంది. ఈసారి పింఛన్లకూ అదే పంథాను అనుసరిస్తోంది.

పింఛన్లనూ వదల్లేదు!


ప్రచారసభగా పంపిణీ కార్యక్రమం
19న అందజేస్తామని ప్రకటన
నూతన లబ్ధిదారులు అసంతృప్తి

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జూన్‌30:
జిల్లాలో మరో రాజకీయ సభకు వైసీపీ ప్రభుత్వం  సన్నద్ధమవుతోంది. సంక్షేమ పథకాల పంపిణీని కూడా తన ప్రచారార్భాటానికి వాడుకుంటోంది. భారీ సభలు ఏర్పాటు చేసి పార్టీని ఫోకస్‌ చేస్తోంది. పేదల సంక్షేమం కోసం అంటూ గొప్పలు చెబుతోంది. ఈసారి పింఛన్లకూ అదే పంథాను అనుసరిస్తోంది. కొత్త పింఛన్లపై గంపెడాశలు పెట్టుకున్న పేదలు ఈ నెల ఒకటిన అందుకోవచ్చునని భావించారు. కానీ వారికి ప్రభుత్వం నిరాశ పరిచే వార్త చెప్పింది. కొత్త వాటిని ఈ నెల 19న అందజేస్తామంటూ మెలిక పెట్టింది. దీంతో ఆయా లబ్ధిదారులు నిరాశకు గురాయ్యరు. గతంలో వైఎస్‌ఆర్‌ జలసిరి ప్రారంభంలో కూడా ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో పెద్దఎత్తున హడావుడి చేసి రిగ్గు వాహనాలను అట్టహాసంగా ప్రారంభించారు. తరువాత కాలంలో ఎంతమంది రైతులకు బోర్లు వేశారో తెలియదు. కొత్త పింఛన్ల పంపిణీని 19 తేదీకి వాయిదా వేయడాన్ని పేదలంతా విమర్శిస్తున్నారు. సెర్ఫ్‌ సీఈవో ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ప్రజలను భారీగా తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఫ జిల్లాలోని 27 మండలాల్లో 2లక్షల 60వేలకు పైగా ఫింఛన్‌లు అందుతున్నాయి. వివిధ కారణాతో అందుతున్న పింఛన్‌లను కొన్నాళ్ల కిందట నిలిపివే సిన సంగతి విదితమే. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఆ పింఛన్‌లతో సహా, కొత్తగా అర్జీలు పెట్టుకున్నావారు 14 వేలకు పైగా ఉన్నారు. వీటిలో ఆధార్‌ కార్డులో తక్కువ వయసు కలిగిన వారి పింఛన్‌లు 917 వరకు ఉన్నాయి. వీరికి జూలై 19న పింఛన్‌ రాకుంటే తిరిగి 2023 జనవరి వరకూ ఆగాల్సిందే. ప్రభుత్వం ఎంత మందికి న్యాయం చేస్తుందో చూడాలి.

 14 వేలకు పైగా పింఛన్లు
 జిల్లాలో సుమారు 14వేలమంది వరకు వివిధ రకాల కొత్త పింఛన్లు అందనున్నాయి. వీటిని ఈ నెల 19న ప్రజాప్రతినిధులు చేతులమీదుగా అందివ్వాలని ఉన్నతాధికారుల నుంచి అదేశాలు ఉన్నాయి. అర్హులైన అందరికీ పెన్సన్‌లు మంజూరు చేస్తాం.
            - ఎ.కళ్యాణచక్రవర్తి, డీఆర్‌డీఏ, పీడీ

Updated Date - 2022-07-01T05:38:05+05:30 IST