‘ఓపి’క లేదు

ABN , First Publish Date - 2022-08-18T06:23:44+05:30 IST

రిమ్స్‌ యంత్రాంగానికి నిర్లక్ష్యపు రోగమొచ్చింది. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలంటూ చేస్తున్న ఆర్భాటం మాటలకే పరిమితమైంది.

‘ఓపి’క లేదు
ఒంగోలులోని జీజీహెచ్‌

జీజీహెచ్‌కు తగ్గుతున్న రోగుల సంఖ్య 

సాధారణ మందుబిళ్లలతో సరి

పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండని వెద్యులు

శస్త్రచికిత్సలు ఆలస్యం... రోగులకు తప్పని పాట్లు 

ప్రకటనలకే పరిమితమైన పేదలకు ఆరోగ్య భరోసా

రిమ్స్‌ యంత్రాంగానికి నిర్లక్ష్యపు రోగమొచ్చింది. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలంటూ చేస్తున్న ఆర్భాటం మాటలకే పరిమితమైంది. గుండె, కేన్సర్‌, కీలుమార్పిడి వంటి పెద్ద రోగాలకు ఆధునిక శస్త్రచికిత్సల సంగతి దేవుడెరుగు, సాధారణ వ్యాధులకూ వైద్యం కరువైంది. బీకాంప్లెక్స్‌, పారాసిట్మాల్‌ వంటి చిన్నచిన్న బిళ్లలతో ఆసుపత్రి అధికారులు నెట్టుకొస్తున్నారు. పెద్ద జబ్బులకు అవసరమైన మందులను వైద్యులు బయటకు రాసిస్తున్నారు. కొన్ని వైద్య పరికరాలు మూలకు చేరాయి. రక్తపరీక్షల కోసం వచ్చే బాధితులు వామ్మో 6వ వార్డా అంటూ వణికిపోతున్నారు. థైరాయిడ్‌ పరీక్షల ఊసే లేదు. ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్న పేదలకు ఆరోగ్య భరోసా ప్రకటనలకే పరిమితమైంది. వైద్యులు వచ్చామా.. వెళ్లామా అన్నట్లు సేవలందిస్తున్నారు. డాక్టర్ల  కొరతతో శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయి. సరైన వైద్యం అందడం లేదు. దీంతో రోగుల రాక తగ్గిపోయింది.

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 17: ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారంటూ రోగులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా రిమ్స్‌ యంత్రాంగం తీరులో మార్పు రావడం లేదు. అలాగే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వార్డుల్లో తాగునీటి సమస్య  నిత్యకృత్యమైంది. మందుబిళ్లలు, కట్టుగుడ్డల కొరత వేధిస్తోంది. వైద్యపరీక్షలూ కరువయ్యాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలకు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కీలకమైన సర్జన్లు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు ఐదుగురు వరకు ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరముండగా, మెడిసిన్‌ విభాగంలో మరో ముగ్గురు వైద్యుల కొరత ఉంది. ఇక ఆపరేషన్లకు కీలకమైన మత్తు డాక్టర్లు లేకపోవడంతో పేరుకే పెద్దాసుపత్రిగా రిమ్స్‌ మారింది. ఇక గుండెజబ్బులు, న్యూరాలజీకి పోస్టులే లేకపోవడం మరింత దారుణంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో బదిలీలు జరగడంతో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి పలువురు వైద్యులు వచ్చారు. అయితే వారంలో రెండు, మూడురోజులు మాత్రమే విధుల్లో అందుబాటులో ఉంటారని మిగిలిన అత్యవసర వైద్యానికి వీరి సేవలు కరువయ్యాయనే ఆరోపణలున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. 


పేదల వైద్యానికి లభించని భరోసా 

అరకొర సదుపాయాలు, వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత, నాసిరకం మందులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్యశాలకు వస్తున్న రోగులకు భయం తప్ప, భరోసా లభించడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ ఉచితమే అని పాలకులు పదేపదే చెబుతున్నప్పటికీ ఖరీదైన వైద్యపరీక్షలకు ప్రైవేటు సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి. విలువైన వైద్య పరికరాలు వినియోగంలో లేకుండాపోయాయి. వివిధ రక్త పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేకించి ఏడాదిగా థైరాయిడ్‌ పరీక్షలు లేకపోవడంతో రోగులు బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వైద్య పరీక్షలకే వేలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. 


సాధారణ మందులకూ కొరత

రిమ్స్‌లో సాధారణ మందుబిళ్లలకూ కొరత ఏర్పడింది. ఆసుపత్రికి వచ్చే బాధితులు, వారి వ్యాధులను బట్టి 250 రకాల మందుల అవసరం ఉంది. అయితే ప్రస్తుతం 50 రకాలే ఇస్తున్నారు. అవి కూడా అరకొరగానే ఉంటున్నాయి. ముఖ్యంగా హిమోఫీలియా బాధితులకు ఖరీదైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్న వారికి వాడే ఇంజెక్షన్లు ఫ్యాక్టర్‌-8,9 ఖరీదు రూ.2వేలకుపైనే ఉంటుంది. అయితే ఆ మందు ఖర్చు ఏడాదికి రూ.10లక్షల వరకూ అవుతుంది. కానీ అలాంటి ఖరీదైన మందులు బాధితులకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పేరుకు పెద్దాసుపత్రి అయినా, అక్కడ మందులు లభించక వైద్యుడు రాసిన చీటి చేతపట్టుకుని బయట షాపులకు వెళ్లాల్సి వస్తుందని రోగులు చెబుతున్నారు. ఉచిత ఓపీ తప్ప ఇక అన్నీ ఖరీదుగానే ఉన్నాయని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


తగ్గిన  ఔట్‌ పేషెంట్‌ల రాక 

2007లో రూ. 300కోట్ల వ్యయంతో 37 ఎకరాల్లో నిర్మించిన జీజీహెచ్‌కి ఇటీవల వరకు రోజు 1,500మంది రోగులు వస్తుండేవారు. అందుకు అనుగుణంగా కనీస వసతులు, వైద్యసేవలు కల్పించే పరిస్థితి లేదు.అరకొర వైద్య పరికరాలు, అవసరానికి సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులకు నిత్యం నరకం కనిపిస్తోంది. వివిధ విభాగాల్లో లోపాలు పేదలకు శాపంగా మారాయి. కీలకమైన చికిత్స విభాగాల్లో వసతులు లేవు. గత కొన్నినెలల క్రితం వరకు రోజుకు 2వేల వరకు ఓపీలు ఉండేవి. వారిలో 400మంది వరకు ఇన్‌పేషెంట్‌లు.  వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చుచేయలేని వారంతా ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పుడు కనీసం రోజుకు 300 మించి కూడా రోగులు రాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని పరిస్థితుల్లోఆర్థిక ఇబ్బందులతో రిమ్స్‌లో చేరిన పేదలను సక్రమంగా పట్టించుకునే వారు లేరనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా రిమ్స్‌ అధికారుల నిర్లక్ష్యపు రోగానికి మందు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రోగులు కోరుతున్నారు..


Updated Date - 2022-08-18T06:23:44+05:30 IST