విద్యార్థులు మతాచారాలు పాటించేందుకు పాఠశాలలకు రావద్దు

ABN , First Publish Date - 2022-02-04T13:58:41+05:30 IST

పాఠశాలల్లో బాలికలు హిజాబ్ ధరించడంపై కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు....

విద్యార్థులు మతాచారాలు పాటించేందుకు పాఠశాలలకు రావద్దు

కర్ణాటక హోంశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు: పాఠశాలల్లో బాలికలు హిజాబ్ ధరించడంపై కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.విద్యార్థులు మతాచారాలు ఆచరించేందుకు పాఠశాలలకు రావద్దని మంత్రి జ్ఞానేంద్ర కోరారు. పాఠశాలల్లో విద్యార్థులు హిజాబ్, కాషాయం కండువాలు ధరించకూడదని మంత్రి సూచించారు. దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న మత సంస్థలపై నిఘా వేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. పాఠశాల అంటే విద్యార్థులందరూ చదువుకునే ప్రాంతమని, మతాన్ని ఆచరించేందుకు ఎవరూ పాఠశాలకు రావద్దని మంత్రి కోరారు.ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో కొందరు విద్యార్థులు ‘హిజాబ్’ ధరించడంపై వివాదం నెలకొంది.


హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చిన కుందాపూర్ పీయూ కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థినులను ప్రిన్సిపాల్ గేటు వద్ద అడ్డుకున్నారు. తరగతి గదుల్లోకి హిజాబ్ ధరించడానికి అనుమతి లేదని లోపలికి వెళ్లే ముందు వాటిని తొలగించాలని కోరారు.ఉడిపి ప్రభుత్వ కళాశాలల వద్ద నిరసనల తర్వాత కర్ణాటక హిజాబ్ గొడవ శివమొగ్గకు వ్యాపించింది.హిజాబ్‌లు ధరించిన అమ్మాయిలకు కౌంటర్‌గా సుమారు 100 మంది హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలు ధరించి తరగతులకు వచ్చారు.ప్రజలు స్వేచ్ఛగా తమ మతాన్ని ఆచరించడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి చర్చిలు, మసీదులు, దేవాలయాలు ఉన్నాయని, పాఠశాలల్లో జాతీయ సమైక్యత సమగ్రతను పెంపొందించే సంస్కృతిని పెంపొందించడానికి పిల్లలకు విద్యా వాతావరణం ఉండాలని మంత్రి కోరారు.


‘‘భారత మాత బిడ్డలుగా చదువుకునేందుకు అందరూ విద్యాసంస్థలకు రావాలి. పాఠశాల ఆవరణలో ఎవరూ హిజాబ్ లేదా కాషాయం కండువాలు ధరించకూడదు, విద్యార్థులు పాఠశాల నిర్వహణ కమిటీలు నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి’’ అని హోంమంత్రి సూచించారు.


Updated Date - 2022-02-04T13:58:41+05:30 IST