సత్యం కోసం పోరాడుతున్నవారిని ఎవరూ బెదిరించలేరు, కొనలేరు : రాహుల్ గాందీ

ABN , First Publish Date - 2020-07-09T00:31:12+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా

సత్యం కోసం పోరాడుతున్నవారిని ఎవరూ బెదిరించలేరు, కొనలేరు : రాహుల్ గాందీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబానికి అనుబంధంగల మూడు ట్రస్టులపై దర్యాప్తు జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మోదీపై పదునైన విమర్శలు గుప్పించారు. తనను, కాంగ్రెస్ పార్టీని ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు. 


రాహుల్ బుధవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘లోకమంతా తనలాగే ఉందని మిస్టర్ మోదీ నమ్ముతున్నారు. ప్రతి వారికీ ఓ ధర ఉందని, బెదిరించగలమని ఆయన అనుకుంటున్నారు. సత్యం కోసం పోరాడేవారికి ధర ఉండదని, వారిని బెదిరించడం సాధ్యం కాదని ఆయనకు ఎన్నటికీ అర్థం కాదు’’ అని దుయ్యబట్టారు.


అంతకుముందు కాంగ్రెస్ స్పందిస్తూ, గాంధీ కుటుంబానికి అనుబంధంగల మూడు ట్రస్టులపై దర్యాప్తును సమన్వయపరిచేందుకు ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం పక్షపాతంతో కూడుకున్నదని ఆరోపించింది. బీజేపీకి, ఆ పార్టీ నేతలకు అనుబంధంగల సంస్థలపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని నిలదీసింది.


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసి, మూడు ట్రస్టులపై దర్యాప్తును సమన్వయ పరచాలని నిర్ణయించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టు మనీలాండరింగ్ చట్టం, ఆదాయపు పన్ను చట్టం, విదేశీ విరాళాల చట్టాలను ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును ఈ కమిటీ సమన్వయపరుస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పెషల్ డైరెక్టర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. 


Updated Date - 2020-07-09T00:31:12+05:30 IST