‘ఆసరా’పై వివక్ష

ABN , First Publish Date - 2020-09-29T06:02:08+05:30 IST

ఆసరా పింఛన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. ఏడాది కాలంగా కొత్తగా పింఛన్లను మంజూరు చేయడం లేదు. అలాగే 57 సంవత్సరాలు నిండిన

‘ఆసరా’పై వివక్ష

జిల్లాలో ఏడాదిగా కొత్త పింఛన్ల మంజూరు లేదు

కొత్తగా అర్హులైన 2,295 మంది ఎదురుచూపులు

పెన్షన్‌ అర్హత వయసు తగ్గింపుపై ఊసే లేదు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఆసరా పింఛన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. ఏడాది కాలంగా కొత్తగా పింఛన్లను మంజూరు చేయడం లేదు. అలాగే 57 సంవత్సరాలు నిండిన వారికే పింఛన్లు ఇస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోతున్నది. దీంతో పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్న అర్హులైనవారు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం, ఇతర జిల్లాలకు మంజూరు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పింఛన్ల మంజూరు కోసం అనేక మంది కార్యాలయాల చుట్టూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 


జిల్లాలో 80,556 మందికి లబ్ధి..

జిల్లాలో 80,556 మందికి ఆసరా పథకం కింద పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో 30,390 మంది వృద్ధులకు, 29,479 మంది వితంతువులకు, 13,060 మంది దివ్వాంగులకు, 763 మంది చేనేత కార్మికులకు, 2,224 మంది గీత కార్మికులకు, 694 మంది బీడీ కార్మికులకు, 2,413 మంది ఒంటరి మహిళలకు, 1169 మంది ఏఆర్‌టీ బాధితులకు, 364 మంది ఫైలేరియా కలవారికి పింఛన్‌ ఇస్తున్నారు. దివ్యాంగులకు నెలకు 3,016 రూపాయలకు, ఇతరులకు 2,016 రూపాయలు మొత్తం 17 కోట్ల 78 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇందులో చనిపోయిన వారి పేర్లను తొలగిస్తుంటారు. కొత్తగా మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 735 మంది వృద్ధులు, 980 మంది వితంతువులు, 299 మంది దివ్యాంగులు, 50 మంది చేనేత కార్మికులు, 104 మంది గీత కార్మికులు, నలుగురు బీడీ కార్మికులు, 123 మంది ఒంటరి మహిళలు మొత్తం 2,295 మంది అర్హత సాధించారు. జిల్లా అధికారులు మంజూరుకై సెర్ఫ్‌కు పంపించారు. ఏడాది కాలంగా ప్రభుత్వం కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఇప్పుడు, అప్పుడు అంటూ ప్రభుత్వం ఊరిస్తున్నదే తప్ప మంజూరు మాత్రం ఇవ్వడం లేదని చెబుతున్నారు. 


పింఛన్‌ కోసం ఎదురుచూపులు..

వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు అర్హత వయస్సు 65 సంవత్సరాలు కాగా, దీనిని 57 సంవత్సరాలకు తగ్గించింది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేరకు అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేశారు. ఆ లెక్కన జిల్లాలో దాదాపు 17 వేల మందికి పైగా ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పింఛన్‌ మంజూరు చేయలేదు. చాలా మంది పింఛన్లపై ఆశలు పెంచుకున్నారు. నెలకు 2 వేల రూపాయలు వస్తే తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ కొత్తవి పింఛన్లు మంజూరు చేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని అర్హులు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-29T06:02:08+05:30 IST