కొత్త కొలువులకు కరువు

ABN , First Publish Date - 2020-06-10T06:24:41+05:30 IST

భారత ఉద్యోగ మార్కెట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కరోనా కుదుపుతో కొత్త కొలువులు కరువయ్యాయి. ‘కొవిడ్‌-19’ తర్వాత దశకు సిద్ధమవుతున్న కార్పొరేట్‌ రంగం...

కొత్త కొలువులకు కరువు

  • 5 శాతం కంపెనీల్లోనే హైరింగ్‌ యోచన 
  • 15 ఏళ్లలో ఇదే అత్యంత నిస్తేజం 
  • క్యూ2లో నియామకాలపై మ్యాన్‌పవర్‌ సర్వే 

న్యూఢిల్లీ: భారత ఉద్యోగ మార్కెట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కరోనా కుదుపుతో కొత్త కొలువులు కరువయ్యాయి. ‘కొవిడ్‌-19’ తర్వాత దశకు సిద్ధమవుతున్న కార్పొరేట్‌ రంగం.. ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉందని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయ్‌ అవుట్‌లుక్‌ సర్వే రిపోర్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి (క్యూ2) ఉద్యోగులను నియమించుకునే ఆలోచనలో ఉన్నది కేవలం 5 శాతం కంపెనీలేనని ఈ సర్వే వెల్లడించింది. ఈ సర్వేను ప్రారంభించిన 15 ఏళ్లలో నియామకాలపై కార్పొరేట్లలో ఇదే అత్యంత నిస్తేజ దృక్పథమని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ అంటోంది. అయినప్పటికీ, భారత్‌ మెరుగేనంటోంది. మొత్తం 43 దేశాల్లో ఉద్యోగ నియామకాలపై సానుకూలంగా ఉన్న టాప్‌-4 దేశాల్లో ఒకటని తెలిపింది. జపాన్‌లోని 11 శాతం కంపెనీలు హైరింగ్‌ యోచనలో ఉండగా.. చైనా, తైవాన్‌లో 3 శాతం చొప్పున సంస్థలు నియామక ప్రణాళికల్లో ఉన్నాయట. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. సర్వే కోసం దేశవ్యాప్తంగా 695 కంపెనీల నుంచి నియామక ప్రణాళికలపై సేకరించింది.
  2. ఆర్థిక తిరోగమనంతో కార్పొరేట్‌ రంగం తన సిబ్బందిని హేతుబద్దీకరించుకునే పనిలో ఉంది. మార్కెట్లో వస్తు, సేవలకు మళ్లీ గిరాకీ పుంజుకునే వరకు కంపెనీలు నియామకాల విషయంలో వేచి చూసే ధోరణినే కనబర్చనున్నాయి. 
  3. జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో మైనింగ్‌, నిర్మాణం, ఫైనాన్స్‌, బీమా, స్థిరాస్తి రంగాలు మన జాబ్‌ మార్కెట్‌ను ముందుకు నడిపించనున్నాయి. మాన్యుఫాక్చరింగ్‌, సేవా రంగాలు బలహీనంగా కన్పిస్తున్నాయి. కొత్త నియామకాలపై ఉత్తర, దక్షిణాది మార్కెట్లలో సానుకూల వైఖరి ఎక్కువగా కన్పించింది. 
  4. టోకు, రిటైల్‌ వర్తక వ్యాపారాలు అధికంగా ప్రభావితమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా తమ వ్యాపారం కుదేలైందని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది తెలిపారు. 


2021లో మళ్లీ మంచిరోజులు

లాక్‌డౌన్‌ సమయంలో కార్పొరేట్‌ రంగానికి సాంకేతికత గేమ్‌ చేంజర్‌గా ఉపయోగపడింది. కంపెనీలు వర్చువల్‌ సమావేశాలతో కార్యకలాపాలను నెట్టుకొచ్చాయి. ఈ కష్ట కాలాన్ని ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచే శిక్షణ కోసం ఉపయోగించుకున్నాయి. పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాపారాన్ని మల్చుకోవడమనేది కంపెనీలకు సరికొత్త సాధారణ ప్రక్రియగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వనున్నాయి. ఉద్యోగాల కల్పనపైనా ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఉద్యోగార్థులకు మళ్లీ మంచి రోజులు రావచ్చు.

- సందీప్‌ గులాటి,

 మ్యాన్‌పవర్‌  గ్రూప్‌ ఇండియా ఎండీ 


Updated Date - 2020-06-10T06:24:41+05:30 IST