వరంగల్‌లో 15 నో మూవ్‌మెంట్ జోన్లు.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా..

ABN , First Publish Date - 2020-04-07T18:55:05+05:30 IST

కరోనా ప్రభావ క్రమంలో వరంగల్‌ మహానగరంలో గుర్తించిన నో మూవ్‌మెంట్‌ ఏరియాలకు నిత్యావసరాల సరఫరాకు అర్బన్‌ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

వరంగల్‌లో 15 నో మూవ్‌మెంట్ జోన్లు.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా..

జనం బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు 

నిత్యావసరాలు సైతం ఇళ్ల వద్దకే సరఫరా

బల్దియా, మార్కెటింగ్‌, పోలీస్‌ శాఖలతో బృందాలు 

మొత్తం 15 బృందాలు, 26 వాహనాలు 8 జేసీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ


వరంగల్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : కరోనా ప్రభావ క్రమంలో వరంగల్‌ మహానగరంలో గుర్తించిన నో మూవ్‌మెంట్‌ ఏరియాలకు నిత్యావసరాల సరఫరాకు అర్బన్‌ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అంతే కాదు నో మూవ్‌మెంట్‌ ఏరియాలతో పాటు సమీప, గుర్తించిన మరికొన్ని ప్రాంతాల్లో సరుకుల సరఫరా ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకే అధికారగణం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ సరుకుల సరఫరాలో భాగస్వాములను చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు దిశా, నిర్దేశం చేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. 


వరంగల్ నగరంలోని నో మూవ్‌మెంట్‌ ఏరియాలలోని ప్రతీ ఇంటికి సరుకులను సరఫరా చేసేందుకు బల్దియా, పోలీస్‌, మార్కెటింగ్‌ శాఖలకు చెందిన ముగ్గురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 15 బృందాలు ఏర్పాటయ్యాయి. వీరంతా వివిధ ఏరియాలలో సరుకులను ఇంటింటికి అందజేస్తారు. కూరగాయలతో పాటు పప్పులు, నూనె ఇతరాత్రా నిత్యావసరాలన్నింటినీ ప్రతీ ఇంటికి సరఫరా చేస్తారు. నో మూవ్‌మెంట్‌ ఏరియాలలో ఉన్న మొత్తం ఇళ్ల సంఖ్యను బల్దియా అధికారుల ద్వారా కలెక్టర్‌ సమాచారాన్ని సేకరించారు. గుర్తించిన ఏరియాలలో మొత్తంగా ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది కూడా లెక్కలు తీశారు. ఈ ప్రకారం బృందాలను ఏర్పాటు చేశారు. కేటాయించిన ఏరియాల వారీగా బృందాల సభ్యులు వెళ్తారు. ఆ ఇళ్లలోని వారికి బృందంలోని సభ్యులు తమ ఫోన్‌ నెంబర్లు అందజేస్తారు. ఫోన్ల ద్వారా వచ్చే ఆర్డర్లను సేకరిస్తారు. 


15 ప్రత్యేక బృందాల నుంచి వచ్చిన నిత్యావసరాల ఆర్డర్లు పర్యవేక్షక అధికారులుగా నియమించిన వారికి ప్రతీ రోజు సాయంత్రం అందుతాయి. పర్యవేక్షక అధికారులుగా బల్దియా ఆర్‌ఐలు 10, ఆర్‌వోలు నియమితులయ్యారు. వీరు బృందాల నుంచి సేకరించిన ఆర్డర్లు జాయింట్‌ కలెక్టర్‌కు అందజేస్తారు. ఇక సివిల్‌ సప్లయీస్‌, మార్కెటింగ్‌ శాఖలు ఆ సరుకులను సమకూర్చుతాయి. ఈ సరుకుల రవాణా నిమిత్తం 26 వాహనాలను జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ముగ్గురు సభ్యుల బృందం ఇళ్లకు సరుకులను అందజేస్తుంది. ఈ మేరకు మొత్తాన్ని ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా కేవలం సరుకుల కొనుగోలుకు అయ్యే మొత్తాన్నే వసూలు చేస్తుంది. బృందాలలో సభ్యులుగా, పర్యవేక్షణ అధికారులుగా బల్దియా రెవెన్యూ విభాగం సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో బల్దియా కమిషనర్‌ పమేలా సత్పతి సోమవారం సిబ్బందితో సమీక్ష జరిపారు. ఎవరూ గైర్హాజరు కాకుండా విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


నో మూవ్‌మెంట్‌ ఏరియాలపై దృష్టి పెట్టాలి: మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ నగరంలో గుర్తించి నో మూమెంట్‌ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జీడబ్ల్యూఎంసీ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నగరంలో గుర్తించిన 15 నో మూవ్‌మెంట్‌ జోన్లలో చేపడుతున్న చర్యలను మేయర్‌ ప్రకాశ్‌రావు అధికారుల నుంచి కోరారు. సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ, పారిశుధ్య పనులు తదితర వాటిని చర్చించారు. కార్పొరేటర్లతో సమన్వయం చేసుకొని డివిజన్ల వారీగా పిచికారీ, పారిశుధ్య పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ నగరంలో పిచికారీ పనులను విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమకూర్చుకున్న యంత్రాలు, ఇతరాత్ర పరికరాలను తెలియజేశారు. అన్నపూర్ణ కేంద్రాల భోజన వసతి ఏర్పాట్లను వివరించారు. 


నోమూవ్‌మెంట్‌ ఏరియాల్లో ఎవరూ బయటకు రావొద్దు: కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు 

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు సూచించారు. సోమవారం శంభునిపేట మోమిన్‌పుర ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు కమిషనర్‌ రవీందర్‌, బల్దియా కమిషనర్‌ పమేల  సత్పితితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నో మూవ్‌మెంట్‌ ప్రాంతాల్లో ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని, నిత్యావసర సరుకులకోసం అవసరమైతే అదనపు వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటింటికీ తిరిగి ఆర్డర్‌ ప్రకారం సరఫరా చేస్తామన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. ఇంట్లోనే పాత కాటన్‌కు సంబంధించి క్లాతులు ఉంటే మాస్క్‌లు తయారు చేసుకోవాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ ముఖ్యమన్నారు. వైరస్‌ ప్రభావితం అయిన వారి ఇంటి చుట్టు పక్కల వారికి క్వారంటైన్‌ స్టాంప్‌ వే యాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-04-07T18:55:05+05:30 IST