Home Ministry: రోహింగ్యాలను ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్‌లకు షిఫ్ట్ చేసేది లేదు..

ABN , First Publish Date - 2022-08-18T00:16:43+05:30 IST

రోహింగ్యా అక్రమ వలసదారులను ఔటర్ ఢిల్లీలోని బక్కర్‌వాలాకు తరలించేందుకు ..

Home Ministry: రోహింగ్యాలను ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్‌లకు షిఫ్ట్ చేసేది లేదు..

న్యూఢిల్లీ: రోహింగ్యా అక్రమ వలసదారులను (Rohingya illegal migrants) ఔటర్ ఢిల్లీలోని బక్కర్‌వాలాకు తరలించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర హోం వ్యవహారాల శాఖ (MHA) బుధవారంనాడు వివరణ ఇచ్చింది. వలసదారుల తరలింపుపై కేంద్ర హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇంతకుముందు ఒక ప్రకటన చేయడంతో హెచ్ఎంఏ ఈ వివరణ ఇచ్చింది.


''రోహింగ్యా అక్రమ వలసదారులకు సంబంధించి ఒక వర్గం మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో హోం శాఖ వివరణ ఇవ్వదలచుకుంది. రోహింగ్యా వలసదారులకు న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో ఈడబ్ల్యూఎస్ (Ecomomically weaker sections) అపార్ట్‌మెంట్లకు తరలించేందుకు హోం శాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు'' అని ఆ ప్రకటనలో హెచ్ఎంఏ తెలిపింది. రోహింగ్యా అక్రమ వలసదారులు ప్రస్తుతం ఉంటున్న కాంచన్ కుంజ్, మదన్‌పూర్ ఖదర్‌లోనే వారిని కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించామని, రోహింగ్యా అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిరిగి పంపేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సంబంధిత దేశాల దృష్టికి ఇప్పటికే తీసుకు వెళ్లిందని ఎంహెచ్ఏ తెలిపింది. రోహింగ్యాలు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాలను డిటెన్షన్ సెంటర్స్ (Detention centers)గా ప్రకటించాలని కూడా ఢిల్లీ ప్రభుత్వానికి తాము ఆదేశాలిచ్చామని చెప్పింది.


దీనికి ముందు, హర్దీప్ సింగ్ పురి ఓ ట్వీట్‌లో రోహింగ్యా శరణార్థులను ఔటర్ ఢిల్లీలోని బక్కర్‌వాలా అపార్ట్‌మెంట్లకు షిఫ్ట్ చేయనున్నామని, వారికి కనీస వసతి సౌకర్యాలు, పోలీసు భద్రత కల్పించనున్నామని ప్రకటించారు. దేశ శరణార్థుల విధానాన్ని విమర్శిస్తున్న వారికి ప్రభుత్వ చర్య నిరాశపరచవచ్చని కూడా ఆయన అన్నారు.

Updated Date - 2022-08-18T00:16:43+05:30 IST