తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తేయడానికి ప్లాన్!

ABN , First Publish Date - 2021-12-17T13:15:22+05:30 IST

ప్రాథమిక పాఠశాలల్లోని..

తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తేయడానికి ప్లాన్!

బడీ, భాషా దూరమే

విలీనంతో తెలుగు మాధ్యమానికీ మంగళమే!

విలీన ఉత్తర్వులను సవరించిన ప్రభుత్వం

ప్రాథమికస్థాయిలో టీచర్‌ నిష్పత్తి తొలుత 20

దానిని ఇప్పుడు 1:30గా మార్చిన వైనం

ఉన్న టీచర్లతో 2 మీడియాల నిర్వహణ కష్టం

డీఎస్సీ ఆలోచనే చేయని రాష్ట్ర ప్రభుత్వం

విలీనంతో టీచర్‌ పోస్టులకు పూర్తిగా తెర!


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనంచేశాక...ప్రాథమిక స్థాయిలో 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని గత నవంబరులో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ రెండు రోజుల క్రితం ఇచ్చిన తాజా ఉత్తర్వుల్లో ఈ నిష్పత్తిని 1:30గా సవరించారు. అంటే ఉన్న ఉపాధ్యాయ పోస్టులనే సర్దేసి ఇక డీఎస్సీకి మంగళం పాడేద్దామనే ఉద్దేశమా? ఈ క్రమంలో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తేసే యత్నమా?.. డీఎస్సీకి తిలోదకాలు ఇవ్వడానికే చేపట్టారని భావిస్తున్న విలీన ప్రక్రియ.. పిల్లలకు బడినే కాకుండా.. మాతృభాషనూ దూరం చేయనుందా?.. విద్యావర్గాల్లో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.  


అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి...తీరా ముఖ్యమంత్రి అయ్యాక రెండున్నరేళ్లయినా ఆ ఊసే ఎత్తడం లేదు. మెగా డీఎస్సీ సంగతి దేవుడెరుగు అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీనే చేయడం లేదు. ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం కూడా ఇక ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ లేకుండా చేసేందుకేననే అభిప్రాయం తొలినుంచీ వ్యక్తమవుతోంది. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ పాఠశాలల విలీనంపై ఇచ్చిన సవరణ ఉత్తర్వులు ఈ అనుమానాలను బలోపేతం చేస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేస్తున్నారు.


తొలుత 250మీటర్ల దూరం ఉన్న పాఠశాలలనే విలీనం చేస్తామన్నా...ఆ తర్వాత కిలోమీటరు దూరం వరకూ పెంచేశారు. రాబోయేరోజుల్లో రెండు కిలోమీటర్ల దూరం వరకూ ఉన్న పాఠశాలల్నీ విలీనం చేసేయనున్నారని సమాచారం. ఈ విలీనం వల్ల పాఠశాలలు దూరమై విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ విలీనం వల్ల అటు ప్రాథమిక పాఠశాలల్లోను, ఇటు ఉన్నత పాఠశాలల్లోను ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందని ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలు రాసింది. దీనిపై నవంబరులో నాటి పాఠశాల విద్య డైరక్టర్‌ చినవీరభద్రుడు స్పందిస్తూ.. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:20గా ఉండాలని ఆదేశాలిచ్చారు. కానీ ప్రస్తుత డైరక్టర్‌ సురేశ్‌కుమార్‌ రెండు రోజుల క్రితం అర్థరాత్రి తొలుత ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ ఉత్తర్వులతో ఒక సర్క్యులర్‌ జారీచేశారు. విలీనం తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే 1,2తరగతుల విద్యార్థులకు 1:30నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉంటే సరిపోతుందని ఇచ్చారు. వాస్తవానికి ఒకటి, రెండు తరగతుల్లో తరగతికి ఒకరనే ప్రాతిపదికన ఉపాధ్యాయులుండాలి.


ఒకటో తరగతిలో 15మంది, రెండో తరగతిలో 20మంది ఉన్నా...తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున ఇద్దరుండాలి. కానీ ఇప్పుడు 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అంటే రెండు తరగతులకు కలిపి ఒక ఉపాధ్యాయుడే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక తరగతిలో 20మంది, ఇంకో తరగతిలో 20మంది ఉన్నా రెండో ఉపాధ్యాయుడు ఉండరు. రెండు తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాలి. ఒక తరగతికి చెప్తుంటే ఇంకో తరగతి పిల్లలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 


ఆ రెండో ఆలోచనే లేదు...

విలీనం తర్వాత ఉన్నత పాఠశాలల్లో ఉన్న 8తరగతులకు కలిపి 9మంది ఉపాధ్యాయులుండాలని పాఠశాల విద్య డైరక్టర్‌ పేర్కొన్నారు. అంటే ఒక్కో తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడుంటే ఇంకో ఉపాధ్యాయుడు మాత్రమే పైన ఉంటారు. మరి ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు సెలవులో ఉంటే...కొన్ని తరగతులకు ఉపాధ్యాయులే ఉండరు. అంటే ఒకే సెక్షన్‌, ఒకే మాధ్యమం ఉంటేనే ఈ పరిస్థితి! మరి ఒక తరగతిలో రెండు సెక్షన్లు, రెండు మాధ్యమాలుంటే పరిస్థితి ఏంటి? ఉపాధ్యాయులు ఎక్కడినుంచి వస్తారు? సరిగ్గా ఇదే ప్రశ్న ప్రభుత్వం క్రమంగా తెలుగు మాధ్యమంను ఎత్తేస్తుందా అన్న అనుమానాలు కలిగిస్తోంది. అసలు రెండో సెక్షన్‌, రెండో మాధ్యమం అన్న ఆలోచనే ప్రభుత్వం మదిలో లేదన్న విమర్శ వినిపిస్తోంది. 


59మందికి మించితేనేనట!

ఉన్నత పాఠశాలల్లో పదో తరగతిని తీసుకుంటే ఒక సెక్షన్‌కు 40మందికి మించి ఉండకూడదు. అంతకంటే ఎక్కువమంది ఉంటే రెండో సెక్షన్‌ను ప్రారంభించాలి. కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం విద్యార్థుల సంఖ్య 59కి మించితేనే రెండో సెక్షన్‌ అన్న సూత్రాన్ని అనుసరించాలని, అనధికారికంగా చెప్పేసినట్టు సమాచారం. అంటే సెక్షన్లు పెరిగితే ఉపాధ్యాయులను కొత్తగా భర్తీ చేయాలి. అలా పెంచే పనిలేకుండా ఎక్కువమంది విద్యార్థులున్నా ఒకే సెక్షన్‌లో సర్దుబాటు చేసేయాలని లోపాయికారీగా చెప్తోందని తెలిసింది. 


16మంది ఉండాల్సినచోట 9 మందే... 

విలీనం తర్వాత ఉన్నత పాఠశాలల్లో అప్పటికే ఉన్న ఆరు నుంచి 10వ తరగతితోపాటు ప్రాథమిక పాఠశాల నుంచి కలిసే 3,4,5 తరగతులు కూడా ఉంటాయి. అంటే మూడునుంచి పదో తరగతి వరకు, మొత్తం 8తరగతులు ఉంటాయి. ఈ 8తరగతుల్లోను రెండేసి సెక్షన్లు ఉంటే.. అంటే ఒక తెలుగు మీడియం సెక్షన్‌, ఒక ఆంగ్ల మీడియం సెక్షన్‌ ఉంటే...ఒక్కో సెక్షన్‌కు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నా 16మంది ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం 8తరగతులకు కలిపి 9మంది ఉపాధ్యాయులు ఉంటే చాలంది. మరి ప్రతి పాఠశాలలోను రెండు మీడియంలు ఉంటే...ఒక్కో తరగతిలోను రెండు సెక్షన్లు ఉండాల్సిందే. ప్రభుత్వం మాత్రం ఆ మేరకు ఉపాధ్యాయులు ఉండాలన్న ఆలోచనతో ఉన్నట్టు కనిపించడం లేదు.. దీనివల్లే తెలుగు మీడియం ఎత్తేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-12-17T13:15:22+05:30 IST