ఇక ఖరీదైన భోజనం

ABN , First Publish Date - 2022-05-09T05:11:27+05:30 IST

ప్రభుత్వాసుత్రులకు అందించే భోజన చార్జీలను సర్కారు రెండింతలు చేసింది. పెరిగిన నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది.సర్కార్‌ దవాఖానాల్లో నాసిరకమైన భోజనం, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారు, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో చికిత్స పొందుతున్న వారు మరింత అనారోగ్యానికి గురువుతున్నారన్న ఆరోపణలున్నాయి

ఇక ఖరీదైన భోజనం

ప్రభుత్వాసుపత్రుల్లో భోజన చార్జీలు రెట్టింపు

పదకొండేళ్ల తర్వాత పెంచిన సర్కార్‌..మరో రెండు రోజుల్లో అమల్లోకి!

ఇకనైనా రోగులకు నాణ్యమైన ఆహారం అందేనా!?


 మెదక్‌అర్బన్‌, మే8: ప్రభుత్వాసుత్రులకు అందించే భోజన చార్జీలను సర్కారు రెండింతలు చేసింది. పెరిగిన నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది.సర్కార్‌ దవాఖానాల్లో నాసిరకమైన భోజనం, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారు, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో చికిత్స పొందుతున్న వారు మరింత అనారోగ్యానికి గురువుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో రోగి భోజనానికి రోజుకు రూ.40 చొప్పున ఖర్చు చేస్తుండగా ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసింది. ఈ మేరకు గత నెలలో ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రోగులకు ఇక నుంచి పోషకాహారం అందే అవకాశం ఉంది. ధరలు పెంచడంతో పాటు రోగులకు అందించే ఆహార మెనూ కూడా ప్రకటించి  టెండర్లను పిలిచారు. నేడు రేపో ఖరారు చేసి రెండు రోజుల్లో కొత్త చార్జీలు అమలు చేయనున్నారు.


పదకొండేళ్ల తర్వాత పెంపు

ప్రభుత్వ దవాఖానాల్లో భోజనానికి సంబంధించిన చార్జీలు 2011 నుంచి పెరగలేదు. ప్రస్తుతం టెండర్‌ ఏజెన్సీ ద్వారా ఆహారం అందిస్తున్నారు. వందశాతం పెంచిన చార్జీల ఉత్తర్వులు జారీ కాగా పూర్తిస్ధాయి మార్గదర్శకాలు రావాల్సిఉంది.


మెదక్‌ జిల్లా వ్యాప్తంగా

మెదక్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రి, తూప్రాన్‌ సామాజిక, నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగులకు భోజనం అందిస్తున్నారు. ఇక నుంచి జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభమయ్యే వంద పడకల మాతా శిశు సంరక్షణతోపాటు కౌడిపల్లి, రామాయంపేట ఆసుపత్రి రోగులకు ఆహారం అందించనున్నారు. పెరిగిన చార్జీలతో ఆరు ఆసుపత్రుల్లోని వందలాది మంది రోగులకు నాణ్యమైన ఆహారం అందనుంది.


ప్రస్తుత మెనూ ఇలా

ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వైద్యులకు ప్రతీరోజు అల్పాహారం, భోజనం అందజేస్తారు. ఉదయం పాలు, బ్రైడ్‌ అల్పాహారంగా ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో ఏదైనా కూర, పప్పు, గుడ్డు లేదా, అరటిపండు అందజేస్తారు. రాత్రి భోజనంలో మరో కూర, పప్పు, గుడ్డు లేదా అరటిపండు ఇస్తారు. వైద్యులకు మధ్యాహ్న భోజనంలో ఏదైనా కూర పప్పు, గుడ్డు, లేదా అరటి పండు ఇస్తారు. సాయంత్రం టీ, స్నాక్స్‌, రాత్రి భోజనంలో కూడా కూర, పప్పు, గుడ్లు అరటి పండు ఇస్తారు. 

పెరిగిన చార్జీలు ఇలా

రోగులు                    ప్రస్తుత చార్జీలు      పెరిగిన చార్జీలు

సాధారణ                             రూ. 40                     రూ.80

గర్భిణులు, టీబీ, మానసిక        రూ.56                     రూ.112

డ్యూటీ డాక్టర్‌                        రూ.80                     రూ.160


రుచికరమైన నాణ్యమైన భోజనం అందనుంది 

- డాక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌, మెదక్‌

పెరిగిన చార్జీలతో రోగులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందనుంది. మెస్‌ చార్జీలను పెంచుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. రెండు రోజుల్లో ఖరారు చేసి కొత్త చార్జీలను అమలు చేస్తాం.



Read more