మరో ఉద్యమం కోసం సుముఖంగా లేము: Mohan Bhagwat

ABN , First Publish Date - 2022-06-03T20:59:10+05:30 IST

జ్ఞానవాపి మసీదు వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తొలిసారి..

మరో ఉద్యమం కోసం సుముఖంగా లేము: Mohan Bhagwat

నాగపూర్: జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) తొలిసారి స్పందించారు. ప్రతి మసీదులోను శివలింగం (Shivling) కోసం అన్వేషించనక్కరలేదని అన్నారు. మరే ఇతర ఉద్యమం కోసం ఆర్ఎస్ఎస్ సుముఖంగా లేదని తెలిపారు. నాగపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ క్యాంప్ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ, జ్ఞానవాపి విషయంలో తమకు డివోషన్ ఉందని, ఆ ప్రకారమే తాము చేస్తామని అన్నారు. ప్రతి మసీదులోనూ శివలింగం కోసం కోసం ఎందుకు అన్వేషించాలని ఆయన ప్రశ్నించారు. మరో ఉద్యమం చేపట్టేందుకు ఆర్ఎస్ఎస్ సుముఖంగా లేదని అన్నారు.


''మేము రాజమజన్మభూమి ఆందోళనలో పాలుపంచుకున్నాం. అందుకు పరిస్థితులే కారణం. ప్రజాభీష్టాన్ని మేము నెరవేర్చాం. ఇంకెలాంటి ఆందోళనలకు పిలుపునివ్వాలని మేము కోరుకోవడం లేదు'' అని మోహన్ భగవత్ అన్నారు. జ్ఞానవాపి వివాదంలో విశ్వాసాలకు సంబంధించిన కొన్ని అంశాలున్నాయని, దానిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు.


''జ్ఞానవాపి అంశం ప్రస్తుతం నడుస్తోంది. చరిత్రను మనం మార్చలేం. ఇవాల్టి హిందువులు కానీ ఇవాల్టి ముస్లింలు కానీ దాన్ని సృష్టించ లేదు. ఆ సమయంలో జరిగిన విషయం అది. దేశంపై దండెత్తివచ్చిన వారి నుంచి, బయట నుంచి ఇస్లాం వచ్చింది. ప్రజల్లో ఉన్న స్వాతంత్ర్య కాంక్షను దెబ్బతీసేందుకు జరిపిన దాడుల్లో దేవస్థానాలను (ఆలయాలు) కూల్చేశారు'' అని మోహన్ భగవత్ అన్నారు. ముస్లింలకు హిందువులు వ్యతిరేకం కాదని, ఇవాల్టి ముస్లింల పూర్వీకులు కూడా హిందువులేనని చెప్పారు.


మసీదుల్లో జరుగుతున్నది కూడా ఒక తరహా ప్రార్ధనేనని, అయితే అది బయట నుంచి వచ్చిననని భగవత్ అన్నారు. అయితే ఆ ప్రార్థనా విధానాన్ని అనుసరిస్తున్నది బయట వాళ్లు కాదని, వాళ్లు దీనిని అర్థం చేసుకోవాలని చెప్పారు. ''వాళ్ల ప్రార్థనలు ఈ దేశానికి వెలుపల నుంచి వచ్చినప్పుడు, దానినే కొనసాగించాలని వారు అనుకున్నప్పుడు మనకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆరాధనా విధానలను మేము వ్యతిరేకించడం లేదు'' అని మోహన్ భగవత్ చెప్పారు.

Updated Date - 2022-06-03T20:59:10+05:30 IST