అన్నీ కోతలే..

ABN , First Publish Date - 2022-09-16T05:41:08+05:30 IST

పాఠశాలలను బలోపేతం చేసేందుకు నాడు–నేడు పనులతో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు ప్రచారపు ఆర్భాటాలు చేస్తోన్న ప్రభుత్వం.. వాటి నిర్వహణ ఖర్చులను మాత్రం భారీగా తగ్గించేసింది.

అన్నీ కోతలే..

పాఠశాల నిర్వహణ నిధులను భారీగా తగ్గించిన ప్రభుత్వం

పెరిగిన విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకే గ్రాంట్లు సరిపోవంటున్న హెచ్‌ఎంలు, ఎంఈవోలు


ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 15 : పాఠశాలలను బలోపేతం చేసేందుకు నాడు–నేడు పనులతో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు ప్రచారపు ఆర్భాటాలు చేస్తోన్న ప్రభుత్వం..  వాటి నిర్వహణ ఖర్చులను మాత్రం భారీగా తగ్గించేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్‌ గ్రాంట్‌ నిధులను విడుదల చేస్తూ గురువారం విద్యా శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు– నేడు పనులతో పాఠశాలల్లో  పలు మౌలిక సదుపాయాలు కల్పించగా, వాటి నిర్వహణకు విద్యుత్‌ ఖర్చులు పెరుగుతాయని ఆ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన స్కూల్‌ గ్రాంట్లలో కోతలు పెట్టడంపై పలువురు హెచ్‌ఎంలు, ఎంఈవోల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అరకొర నిధులతో పాఠశాలల నిర్వహణ కష్టమని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తోన్న నిధులు చాలడం లేదని, తమ జేబుల నుంచి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతు న్నారు. ఏటా పెరిగే ఖర్చులకు అనుగుణంగా గ్రాంట్లను ఇవ్వకుండా తగ్గిస్తుండటంపై నిరసన వ్యక్తమవుతోంది.

కోతలతో తాజాగా గ్రాంట్లు

పాఠశాలల నిర్వహణ నిమిత్తం వార్షిక స్కూల్‌ గ్రాంట్‌ నిధులను ఏటా సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం విడుదల చేస్తోంది. మండల రిసోర్సు కేంద్రానికి (ఎంఆర్‌సీ) గతేడాది రూ.75 వేలు చొప్పున కేటా యించగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి కేవలం రూ.70 వేలను మాత్రమే ఖాయం చేశారు. 2020–21లో ఒక్కో ఎంఆర్‌సీకి రూ.1.25  లక్షలు ఇవ్వగా, ఇప్పుడు              ఏటా తగ్గిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవు తోంది. వాస్తవానికి ఎంఆర్‌సీకి ఇచ్చే గ్రాంటు కేవలం విద్యుత్‌ బిల్లులు, ఇంట ర్నెట్‌ బిల్లుల చెల్లింపులకు కూడా సరిపోవని చెబుతున్నారు. ఇప్పుడు ఇచ్చే రూ.70 వేలతో టీఎల్‌ఎం, హెచ్‌ ఎంల సమావేశాల ఖర్చులు, టీఏలు, డీఏలు, కంప్యూటర్‌ రిపేర్లు తదితర ఖర్చులు ఎక్కడ భరించగలమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెరిగిన ధరలతో ఒక్కో ఎంఆర్‌సీ నిర్వహణకు ఏటా రూ.3 లక్షలు ఖర్చవుతోందని, కానీ ప్రభుత్వం ఏటా గ్రాంట్లను తగ్గిస్తోందని వాపోతున్నారు. ఇక ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌ (సీఆర్‌సీ)కి ఇస్తోన్న రూ.22,500లను తాజాగా రూ.20 వేలకే పరిమితం చేశారు. ఈ నిధులతో కాంప్లెక్స్‌ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశాలు, టీఎల్‌ఎం కొనుగోళ్ళు, కంటింజెన్సీ ఖర్చులను అధిగమించడం అసాధ్యమని చెప్పవచ్చు. ఇక ప్రాథమిక పాఠశాలకు ఇచ్చే రూ.12,500లను ఈ ఏడాది రూ.10 వేలుగా నిర్ణయించారు. ఉన్నత పాఠశాలకు ఇప్పటి వరకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ ఆధారంగా ఒక్కో హైస్కూలుకు గరిష్టంగా రూ.లక్ష ఇచ్చేవారు. ఇప్పుడు దీంతో నిమిత్తం లేకుండా అన్ని ఉన్నత పాఠశాలలకు ఒకే విధంగా రూ.25 వేలు చొప్పున కేటాయించి, ఇందులోనూ ప్రస్తుతానికి 25 శాతం నిధులను మాత్రమే విడుదల చేయడం గమనార్హం.

నాడు–నేడుతో పెరిగిన ఖర్చులు

నాడు–నేడులో పాఠశాలల్లో ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్‌, నీటిశుద్ధి యంత్రాలు వంటివి ఏర్పాట య్యాయి. వీటితోపాటు అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం, డిజిటల్‌ టీవీలు వంటివి ఏర్పాటు చేసే కార్యాచరణ జరుగుతోంది. వీటన్నింటికీ విద్యుత్‌తోనే ముడిపడి ఉంది. అంటే విద్యుత్‌ బిల్లులే అధిక మొత్తంలో వస్తాయన్నది వాస్తవం. ఇక ఇంటర్నెట్‌ బిల్లులు, ఏవైనా రిపేర్లు వస్తే వాటిని బాగు చేయించడానికి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఆ ప్రకారం పెరిగిన ఖర్చులకు అనుగుణంగా స్కూల్‌ మెయింటినెన్సు గ్రాంట్లను పెంచాల్సింది పోయి ఏటా తగ్గిస్తుండటంపై హెచ్‌ఎంలు, ఎంఈవోల్లో సైతం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.


Updated Date - 2022-09-16T05:41:08+05:30 IST