విలీనం వద్దు

ABN , First Publish Date - 2022-07-26T05:04:19+05:30 IST

విలీనం వద్దుగాక వద్దు అంటూ గంట్యాడ మండలం కరకవలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. పాఠశాల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తమ పాఠశాలను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

విలీనం వద్దు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు

కరకవలస పాఠశాల విద్యార్థుల ఆందోళన
కిలోమీటర్‌ దూరం నడవలేమని ఆవేదన
కలెక్టరేట్‌, జూలై25:
విలీనం వద్దుగాక వద్దు అంటూ గంట్యాడ మండలం కరకవలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. పాఠశాల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తమ పాఠశాలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. మండుటెండలో అవస్థలు పడుతూనే చాలా సేపు నిరసన తెలిపారు. ఈ పాఠశాలలో ఐదో తరగతి వరకూ 50 మంది పిల్లలు ఉండగా మూడు నుంచి ఐదో తరగతి వరకూ చదువుతున్న 31 మంది విద్యార్థులను రామవరం జడ్పీ పాఠశలలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతూ కొద్దిరోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనూ ఆందోళన చేయాలని తలపెట్టి సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ చిన్న పిల్లలను హైస్కూల్‌ పిల్లలతో కలపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో తరగతి విద్యార్థులు కిలోమీటరు దూరం నడవడం కష్టమన్నారు. అటు హైస్కూల్స్‌లోనూ సరైన మౌలిక సౌకర్యాలు లేవని,  పాఠశాల విలీన ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.


Updated Date - 2022-07-26T05:04:19+05:30 IST