ఏం చెప్పినా తూచ్‌!

ABN , First Publish Date - 2022-09-22T10:17:48+05:30 IST

ఏం చెప్పినా తూచ్‌!

ఏం చెప్పినా తూచ్‌!

జగన్‌కు శాశ్వత అధ్యక్ష పదవి ఉత్తిదే!

ఈసీ ముందు నాలుక మడతేసిన వైసీపీ 

జగన్‌ ‘జీవితకాల’ అధ్యక్షుడని ప్లీనరీలో ప్రకటన

ఫిర్యాదులపై స్పందించి వివరణ కోరిన ఈసీ

పలుమార్లు సమాధానం దాటవేసిన వైసీపీ

చివరికి... మీడియాపై నెపం నెట్టిన వైనం

అంతర్గత విచారణ పేరుతో ‘సైలెన్స్‌’

‘శాశ్వతం’ చెల్లదని తేల్చి చెప్పిన ఈసీ.. బహిరంగ ప్రకటన చేయాలని ఆదేశం

జగన్‌కుఈసీ ఝలక్‌


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగం ఆర్టికల్‌ 8, 9 ప్రకారం పార్టీ అధ్యక్షులు... జీవిత కాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారు. ఈ సవరణకు ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాను. 2022 జూలై 8వ తేదీన నిర్వహించిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయనందున.. జగన్మోహన్‌ రెడ్డి ఏకగ్రీవంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటిస్తున్నాం.

- జూలై 9న పార్టీ ప్లీనరీలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన


అసెంబ్లీలో అబద్ధాలు. ప్రజలకు అబద్ధాలు. కోర్టులకు అబద్ధాలు. చివరికి... కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా అబద్ధాలే! నిజాలు చెప్పలేక, అబద్ధాలు దాచలేక జగన్‌ పార్టీకి ఎన్నెన్ని తిప్పలో! ‘మా పార్టీకి నేనే శాశ్వత అధ్యక్షుడిని’ అని ప్లీనరీలో ఘనంగా ప్రకటించుకుని... ‘అబ్బే, అదేమీ లేదు. మీడియాలో అలాంటి వార్తలు వచ్చాయి’ అంటూ ఎన్నికల కమిషన్‌  ముందు మాట మడతపెట్టేశారు. ‘జాగ్రత్త! ప్రజాస్వామ్యంలో పార్టీలకు శాశ్వత అధ్యక్షులు ఉండరు’ అని ఈసీ చేత మెత్తగా చీవాట్లు పెట్టించుకున్నారు.


శాశ్వతం కాదు.. అధ్యక్షా!

న్యూఢిల్లీ/అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి జగన్మోహన్‌ రెడ్డి జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు’... అని ప్లీనరీ సాక్షిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఉత్తుత్తినే ప్రకటన చేశారా!? కేవలం మీడియాలో వార్తలు రావడం కోసమే ఉత్తుత్తినే జగన్మోహన్‌ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారా!? ఈ సందేహాలు ఎందుకంటారా? జగన్‌ను తమ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా

 ఎన్నుకోలేదని, దీనిపై మీడియాలో వచ్చిన వార్తలపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని ఎన్నికల కమిషన్‌కు వైసీపీయే వివరణ ఇచ్చింది. ఇప్పటిదాకా గుట్టుగా దాచిన ఈ ఉదంతం బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలతో బట్టబయలైంది.


అసలేం జరిగింది... 

ఈ ఏడాది జూలై 8, 9 తేదీలలో జరిగిన ప్లీనరీలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని పార్టీకి జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.  అయితే... మన దేశంలో ఉన్న నిబంధనల ప్రకారం పార్టీలకు ఇలా శాశ్వత అధ్యక్షులను నియమించడం కుదరదు. ఈ విషయాన్ని అప్పుడే ‘ఆంధ్రజ్యోతి’ తెలిపింది. ఆ తర్వాత ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని జూలై 19న ఎన్నికల కమిషన్‌ వైసీపీని ఆదేశించింది. కానీ... దీనిపై ఆ పార్టీ స్పందించలేదు. దీంతో గతనెల 1న ఒక లేఖ, ఐదో తేదీన మరో లేఖ రాసింది. ‘‘మా ఆదేశాలపై మీరు స్పందించడంలేదు. మీ మౌనం జగన్మోహన్‌ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది’’ అని ఈ లేఖలో ఈసీ పేర్కొంది. అప్పటికీ వైసీపీ స్పందించలేదు. చివరికి... గతనెల 23వ తేదీన ఈసీకి అటూఇటూ కాని ఒక సమాధానం పంపింది.  జగన్మోహన్‌ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనే నిర్దిష్ట ఆరోపణ నిజమా, కాదా అని చెప్పకుండా సమాధానం దాటవేసింది. 


అబ్బే... మాకేం తెలియదు!

‘శాశ్వత అధ్యక్ష పదవి’పై ఈనెల 11న ఈసీకి వైసీపీ కొన్ని డాక్యుమెంట్లు పంపింది. అవి... ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన వైసీపీ రాజ్యాంగానికి జరిగిన సవరణల వివరాలను సమర్పించింది. అదే సమాధానంలో... ఒక బీభత్సమైన ‘వివరణ’ ఇచ్చింది. అదేమిటంటే... ‘‘జగన్మోహన్‌ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మా పార్టీ అంతర్గత విచారణ ప్రారంభించింది. అసలు వాస్తవాలేమిటో తెలిసిన తర్వాత... తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ తెలిపింది. అంటే... ప్లీనరీలో వేలాదిమంది వైసీపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య, ‘జగన్మోహన్‌ రెడ్డి జీవితకాల అధ్యక్షుడు’ అని విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన ‘తూచ్‌’ అని తేల్చేసింది. ఈ మొత్తం వివరాలను బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎన్నికల కమిషనే పొందుపరిచింది.


‘శాశ్వతం’ కుదరదు...

ఇన్ని లేఖలు రాసినా, సమాధానాలు ఇచ్చినా... ‘జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించారా? లేదా?’ అనే ప్రశ్నకు మాత్రం వైసీపీ బదులివ్వలేదు. ‘‘ఆ అంతర్గత విచారణను వీలైనంత త్వరగా ముగించండి. మీడియాలో వచ్చినట్లుగా జగన్‌ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా నియమించలేదని ప్రకటించండి. ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించండి’’ అని ఈసీ ఆదేశించింది. అంతేకాదు... ‘‘పార్టీకి సంబంధించిన పదవులను శాశ్వతంగా అప్పగించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇది కుదరనే కుదరదని స్పష్టంగా చెబుతున్నాం. నిర్దిష్ట గడువు ప్రకారం ఆయా పదవులకు ఎన్నికలు జరపాల్సిందే. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం... కమిషన్‌ ఆదేశాలను ఉల్లంఘించడమే’’ అని ఎన్నికల కమిషన్‌ సూటిగా చెప్పింది. జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించారనే వార్తలను స్పష్టంగా ఖండించకపోతే ఇతర పార్టీల్లోనూ అయోమయానికి దారి తీస్తుందని... ఇలాంటి వైఖరులను ఈసీ అనుమతించిందనే అభిప్రాయం ఏర్పడుతుందని తెలిపింది. ఇతర పార్టీలు కూడా ఇదే ధోరణి అవలంబిస్తాయని పేర్కొంది.

Updated Date - 2022-09-22T10:17:48+05:30 IST