ఏం కొ(తి)నేట్టు లేదు

ABN , First Publish Date - 2021-07-25T06:35:01+05:30 IST

కరోనా సగటు జీవి ఆర్థిక గమనాన్ని తలకిందులుచేసింది. పనుల లేమి, పరిశ్రమల మూత, ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత, పప్పులు, ఉప్పుల కొరత, అంతంతమాత్రంగా కూరగాయల దిగుబడులు వెరసి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఏం కొ(తి)నేట్టు లేదు

కరోనాతో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు

వేతన, బడుగు జీవుల ఇక్కట్లు


రామయ్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిపి కుటుంబంలో మొత్తం ఆరుగురు. కరోనాకు ముందు అతడి వేతనం రూ.20వేలు. ఇంటి అద్దె రూ.4,500. నిత్యావసరాల కోసం సగటున రూ.5వేలు ఖర్చు చేసేవాడు. కూరగాయలకు రూ.1500, పాలకు రూ.2,250, అతడి, ఇంట్లో వాడుతున్న సెల్‌ఫోన్‌ రీచార్జికి రూ.1000. పెట్రోల్‌కు రూ. 900, పిల్లల చదువుకు నెలకు రూ.2వేలు. కరెంటు బిల్లు రూ.600. తల్లిదండ్రులకు మందులకు రూ.900. కొత్త దుస్తులకు రూ.1000. మొత్తంగా నెలవారీ ఖర్చు రూ.19,650 అవుతుండగా, మిగిలేది రూ. 350. కాగా, కరోనాతో రూ.5వేలు వేతనం లో కోత పడగా, రూ.15,000చేతికి వస్తున్నాయి. దీనికి తో డు నిత్యావసరాలపై మరో రూ.15 00, కూరగాయలపై రూ.500, పాలపై రూ. రూ.450 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో మొత్తం నెల ఖర్చు రూ.22,100కు చేరింది. వచ్చే వేతనం సరిపోక, నెలకు రూ.7,100 అప్పు చేస్తున్నాడు.


ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సుబ్బారావు(పేరుమార్చాం)కు కరోనా నేపథ్యంలో వేతనం ఇవ్వలేక యాజమాన్యం కొలువు నుంచి తొలగించింది. దీంతో 20ఏళ్లుగా అధ్యాపక వృత్తిని నమ్ముకున్న ఆయన ఏం చేయాలో తెలియక దిగులు పడుతున్నారు. ఎదిగిన పిల్లలు, ఉన్నత ఖర్చులకు అలవాటు పడిన కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియక కలత చెందుతూనే అప్పు తెచ్చి కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఇది ఒక్క రామయ్య, సుబ్బారావు పరిస్థితి కాదు... బడుగు, వేతన జీవుల అందరి పరిస్థితి ఇలానే ఉంది.



కోదాడ, జూలై 24: కరోనా సగటు జీవి ఆర్థిక గమనాన్ని తలకిందులుచేసింది. పనుల లేమి, పరిశ్రమల మూత, ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత, పప్పులు, ఉప్పుల కొరత, అంతంతమాత్రంగా కూరగాయల దిగుబడులు వెరసి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉండగా, ప్రస్తుతం వేతన, సగటు జీవి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. కరోనాకు ముందు రూ.100 తీసుకొని బజారుకు వెళ్తే రోజువారి నిత్యావసరాల పై రూ.80 ఖర్చుచేసి, ఇంటికి రూ.20 తెచ్చేవారు. కరోనాతో రూ.500 తీసుకెళ్లినా రూ.20 ఇంటికితెచ్చే పరిస్థితి లేదు. రూ.100కు రూ.500కు తేడా లేకుండాపోయిందని బడుగు, వేతన జీవులు వాపోతున్నారు. కరోనా నేపథ్యంలో నిత్యావసర వస్తువులతోపాటు, చమురు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో బడుగు, బలహీన వర్గాలు, వేతన జీవులకు పూట గడవడం కష్టంగా మారింది. మరో వైపు థర్డ్‌వేవ్‌ ప్రచారం వారిలో మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చేస్తు న్న పనులు ఇకపై ఉంటాయో లేదో అనే అనుమానం వారిని వేధిస్తోంది. కార్పొరేటు, మల్టీనేషనల్‌ కంపెనీల్లో పనిచేస్తూ వేలల్లో వేతనాలు తీసుకున్న ఉద్యోగులు కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయారు. వేతనాల కోతతో లోన్‌ కింద కొనుగోలు చేసిన కారు ఈఎంఐ చెల్లించలేక నానా తంటాలు పడుతున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి ని పెంచుకోవాలని సూచిస్తున్న ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.


బతికే పరిస్థితి లేదు : సిరిగిరి రామకృష్ణారెడ్డి, ఫొటోగ్రాఫర్‌, సూర్యాపేట జిల్లా కోదాడ 

కరోనా మొదలైనప్పటి నుంచి వ్యాపారాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఇంటి, షాపు అద్దె కట్టలేకపోతున్నాం. దీనికి తోడు రోజు రోజూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్తే పండ్లు తెచ్చుకోలేని పరిస్థితి. కరోనాకు ముందు రోజుకు రూ.2వేల వరకు వ్యాపారం నడిచేది. కరోనా దగ్గర నుంచి రూ.1000 కూడా రావడం లేదు. దీంతో బతికే పరిస్థితి లేదు.



సంచిలో డబ్బులు, జేబులో సరుకులు : రాంబాబు, ప్రైవేటు ఉపాధ్యాయుడు, సూర్యాపేట జిల్లా కోదాడ 

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సంచిలో డబ్బులు తీసుకెళ్తే జేబులో సరుకులు వచ్చే పరిస్థితి ఉంది. కరోనాతో వేతనాల్లో కోత, పెరిగిన ధరలతో ఏం కొనేట్టు, తినేట్టు లేదు. ఆకాశాన్ని అంటుతున్న ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప ఐదు వేళ్లు నోట్లోకిపోయే పరిస్థితి ఉండదు.



నిత్యావసరాల ధరల పెరుగుదల ఇలా..

నిత్యావసర వస్తువులు జనవరిలో ప్రస్తుతం 

(కిలో) (రూపాయల్లో) (రూపాయల్లో)

బియ్యం (క్వింటా) 3,400 4,800

పామాయిల్‌ 140 165

అల్లం 50 80

టీపొడి (పావుకిలో) 150 175

కందిపప్పు 110 125

పెసర పప్పు 100 130

ఉప్పు 10 14

ఎండు మిర్చి 130 160

సబ్బు (ఒకటి) 25 27

చమురు ధరలు (లీటర్‌)

పెట్రోల్‌ 86.95 105.67

డీజిల్‌ 80.47 97.78

గ్యాస్‌ సిలిండర్‌ 895 911

కూరగాయలు (కిలో)

ఆలుగడ్డ 30 50

దొండకాయ 20 40

వంకాయ 20 50

టమాటా 20 20

దోసకాయ 30 45

కాకరకాయ 50 65

గోకర 50 80

క్యారెట్‌ 80 85

బీరకాయ 40 65

పచ్చిమిర్చి 60 80

పండ్ల ధరలు

అరటిపండ్లు (డజన్‌) 25 40

యాపిల్‌  (ఐదు) 50 100

జామ (ఒకటి) 10 15

Updated Date - 2021-07-25T06:35:01+05:30 IST