ఎంత ఎదిగినా సొంతూరిని మరవొద్దు

ABN , First Publish Date - 2022-08-06T09:18:28+05:30 IST

జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా పుట్టిన ఊరితో, ఎదిగొచ్చిన సామాజిక నేపథ్యంతో సంబంధాలను కొనసాగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

ఎంత ఎదిగినా సొంతూరిని మరవొద్దు

  • మాతృమూర్తిని, దేశాన్ని, భాషని గౌరవించాలి
  • మూలాలను విస్మరిస్తే చరిత్ర క్షమించదు
  • రాజ్యాంగంపై అందరికీ అవగాహన అవసరం
  • ఓయూ డాక్టరేట్‌ను అందుకోవడం గౌరవం
  • ఉస్మానియా స్నాతకోత్సవంలో సీజేఐ రమణ
  • సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి: తమిళిసై


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా పుట్టిన ఊరితో, ఎదిగొచ్చిన సామాజిక నేపథ్యంతో సంబంధాలను కొనసాగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. మూలాలను మరిస్తే చరిత్ర క్షమించదని ఆయన హితవు పలికారు. ప్రతి ఒక్కరూ సాహిత్యాన్ని చదవడం, లేఖలను రాయడం నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా మానసిక వికాసంతోపాటు భావ వ్యక్తీకరణ పరిఢవిల్లుతుందని జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం వర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చైతన్యవంతమైన రాజకీయ ఉద్యమాలకు, సంస్కృతికి, చరిత్రకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆలవాలమన్నారు. ఇంతటి గొప్ప సంస్థ నుంచి పట్టా అందుకొని నూతన జీవితంలోకి ప్రవేశించబోతున్న యువతీ యువకులు మాతృమూర్తిని, మాతృదేశాన్ని, మాతృభాషను మరవొద్దని జస్టిస్‌ రమణ సూచించారు. ఈ సందర్భంగా దాశరథి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ కవితను ఆయన చదివారు.


 విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ వంటి మహనీయులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన ఓయూ నుంచి ఇప్పుడు తాను గౌరవ డాక్టరేట్‌ అందుకోవడాన్ని అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ‘‘ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతోమంది సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దింది. అత్యుత్తమ ప్రతిభావంతులను సమాజానికి అందించింది. ప్రధానమంత్రి పదవికి వన్నెతెచ్చిన గొప్ప నేత పీవీ నరసింహారావుతోపాటు ముఖ్యమంత్రులను, మంత్రులను, ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ముఖ్యభూమిక పోషిస్తున్న ఎంతోమంది ఉన్నతాధికారులను ఓయూ అందించింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఇదే వర్సిటీలో చదువుకున్నారు’’ అంటూ ఓయూ ఔన్నత్యాన్ని జస్టిస్‌ రమణ కొనియాడారు.


లా కాలేజీలో చేరలేకపోయాను...

ఈ సందర్భంగా ఓయూతో తన జ్ఞాపకాలను జస్టిస్‌ రమణ గుర్తుచేసుకున్నారు. ‘‘తొలినాళ్లలో నేను ఉస్మానియా లా కాలేజీలో చేరాలనుకున్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అయితే, ఇక్కడ ‘ఇ’ హాస్టల్‌లో నా స్నేహితులు చాలామంది ఉండేవారు. వివిధ కార్యక్రమాలకు వచ్చినప్పుడు వాళ్లను కలవడంతోపాటు... లా, లింగ్విస్టిక్స్‌ సెమినార్లకు హాజరైన సందర్భాలున్నాయి. అలాగే క్యాంటీన్‌, లైబ్రరీలో గడిపిన క్షణాలున్నాయి’’ అన్నారు. సామాజిక అభివృద్ధికి విద్య ముఖ్యమైన పునాది అని, నాణ్యమైన విద్యతోపాటు నిబద్ధత, కష్టపడేతత్వం వంటివి సామాజిక అడ్డుగోడలను సైతం పెకిలించగలవని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘పౌరులందరికీ రాజ్యాంగంపై అవగాహన, చైతన్యం తప్పనిసరి. ఎందుకంటే, అంతిమంగా రాజ్యాంగమే పౌరులకు రక్షణ కవచం కనుక’’ అని జస్టిస్‌ రమణ చెప్పారు.   అలాగే... ‘‘ప్రపంచీకరణతో కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం. తద్వారా మన ఆహార సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 


వాతావరణం, జీవవైవిధ్యంలో అసమతౌల్యాన్ని చూస్తున్నాం. అంతర్జాతీయ విపణిలో స్థానిక ఉత్పతులు పోటీపడలేకపోతున్నాయి. ఇలా బోలెడన్ని సవాళ్లు మన ముందున్నాయి. వీటికి పరిష్కార మార్గాలను యువతరం చూపించాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి ఆశించారు. తాను ప్రపంచీకరణను విమర్శించడం లేదని, మానవ శ్రేయస్సుకు దోహదపడే సంస్కృతి, జీవన విధానంతోపాటు సుస్థిరాభివృద్ధి, జీవవైవిధ్యం, సమతుల్యత గల గ్లోబలైజేషన్‌ను కాంక్షిస్తున్నానని వివరించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 48వ గౌరవ డాక్టరేట్‌ను భారత 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ అందుకున్నారు. గతంలో విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సి.రాజగోపాలాచారి, జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, బీఆర్‌ అంబేడ్కర్‌, డాక్టర్‌ వై.నాయుడమ్మ, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వంటి ఎందరో ప్రముఖులు ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. అలాగే... వర్సిటీ లా విభాగం నుంచి గతంలో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న 29మంది ప్రముఖుల సరసన జస్టిస్‌ రమణ చేరారు.


విజయానికి షార్ట్‌కట్స్‌ ఉండవు: గవర్నర్‌ తమిళిసై

ఈ సందర్భంగా ఓయూ ఛాన్స్‌లర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ... అలవాట్లను మార్చుకోవడం ద్వారా భవిష్యత్తును  మార్చుకోవచ్చని అబ్దుల్‌ కలాం అన్నారని, విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి ఎదగలంటే తమ అలవాట్లను మార్చుకోవాలని  హితవుపలికారు. విజయానికి షార్ట్‌కట్స్‌ ఉండవని, కష్టపడాల్సిందేనని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ధైర్యంతో ఎదుర్కోవాలని, ఎక్కడా లొంగిపోవద్దని సూచించారు. అలాగే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలన్నారు. సాధారణంగా ఉండాలని, అసాధారణ పనులు చేయాలని గవర్నర్‌ పేర్కొన్నారు. జీవితంలో ఎదగాలంటే మొదటి, రెండవ, మూడో సీక్రెట్‌ కూడా హార్డ్‌వర్కే అన్నారు. ప్రస్తుతం ఓ ఐదు నిమిషాలు మొబైల్‌ను పక్కనపెట్టే పరిస్థితి లేదని... అమ్మ, నాన్న, చదువు చెప్పే గురువులను మరిచి ప్రతిదీ గూగుల్‌లో వెతుకుతున్నారన్నారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని విద్యార్థులకు గవర్నర్‌ సూచించారు. ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో 31మంది విద్యార్థులకు 55 బంగారు పతకాలను జస్టిస్‌ రమణ, గవర్నర్‌ తమిళిసై ప్రదానం చేశారు. అదేవిధంగా 221 మందికి డాక్టరేట్‌ పట్టాలను అందించారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఇప్లూ వీసీ సురేష్‌కుమార్‌, హైకోర్టు న్యాయమూర్తులు, పలు వర్సిటీల వీసీలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - 2022-08-06T09:18:28+05:30 IST