రాష్ట్రంలో Lockdown రాదు: మంత్రి

ABN , First Publish Date - 2022-07-07T13:08:06+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో బుధవారం నుంచి మాస్కు ధరించకపోతే రూ.500 జరిమానా అమలులోకి వచ్చింది. గత రెండు వారాలుగా నగరంలో కరోనా

రాష్ట్రంలో Lockdown రాదు: మంత్రి

                              - మాస్క్‌ లేకుంటే రూ.500 జరిమానా


చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం చెన్నైలో బుధవారం  నుంచి మాస్కు ధరించకపోతే రూ.500 జరిమానా అమలులోకి వచ్చింది. గత రెండు వారాలుగా నగరంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు నగరంలో మాస్కు ధారణను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు నగరంలో బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్కులు ధరించాలని లేకుంటే రూ.500ల జరిమానా విధిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, మాల్స్‌, దుకాణాలు, ఆసుపత్రులు తదితరాల్లో ప్రజలు, సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం కూడా పాటించాలని రెండు రోజులుగా కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ కార్యకర్తలు కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి నగరంలో మాస్కులు ధరించనివారికి రూ.500 జరిమానా విధిస్తున్నారు. సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు కూడా తప్పకుండా మాస్కు ధరించాలని, డ్రైవర్‌  కండెక్టర్‌ తదితర రవాణా శాఖ కార్మికులు, ఉద్యోగులు కూడా మాస్కులు ధరించాల్సిందేనన్నారు. బుధవారం ఉదయం న్యూవాషర్‌మెన్‌పేట, కాశిమేడు చేపలరేవు, మార్కెట్‌ ప్రాంతాలు, తిరువొత్తియూరు, స్టాన్లీ ఆస్పత్రి, బ్రాడ్వే బస్టాండు, కోయంబేడు బస్‌స్టేషన్‌, టి.నగర్‌ బస్టాండు, రంగనాధన్‌ వీధి, పాండీ బజార్‌, పురుషవాక్కం తదితర ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా వేశారు.


రాష్ట్రంలో లాక్‌డౌన్‌ రాదు : మంత్రి సుబ్రమణ్యం

రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధించబోతున్నారనే పుకార్లను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక ఓమందురార్‌ ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనని, దీనిపట్ల తామంతా ఆందోళనతో వున్నామన్నారు. అయితే కరోనా తీవ్రత ప్రమాదకరంగా ఏమీ లేదన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోని సిబ్బందికి బూస్టర్‌డోస్‌ టీకాలను ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించడంపై చర్చించామని, త్వరలోనే దీనిపె నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం వరకు రాష్ట్రంలో 2662 మంది కరోనా బాధితులున్నట్లు తేలిందని, అయితే వీరిలో 16 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగిలినవారంతా హోం క్వారంటైన్‌లో వున్నారన్నారు.  ప్రజలు మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చాన్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-07T13:08:06+05:30 IST