మాస్క్‌ లేకుంటే రూ.500 జరిమానా

ABN , First Publish Date - 2022-07-06T13:46:16+05:30 IST

చెన్నై నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం నుంచి ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, లేకుంటే

మాస్క్‌ లేకుంటే రూ.500 జరిమానా

అడయార్‌(చెన్నై): చెన్నై నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం నుంచి ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, లేకుంటే రూ.500 జరిమానా విధిస్తామంటూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గత కొన్ని రోజులుగా చెన్నై నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన నగర పాలక సంస్థ వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా బుధవారం నుంచి ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని ఆదేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో భౌతికదూరం పాటించాలని కోరింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఒకే సమయంలో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లను అనుమతించొద్దని సూచించింది. అలాగే, వాణిజ్య సంస్థలు, మాల్స్‌, థియేటర్స్‌, వస్త్రదుకాణాల్లో పనిచేసే సిబ్బంది కూడా మాస్కులు ధరించేలా ఆయా సంస్థల యజమాన్యాలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. చెన్నై కార్పొరేషన్‌ అధికారుల ఆకస్మిక తనిఖీల సమయంలో మాస్క్‌ లేకుండా కనిపిస్తే రూ.500 చొప్పున తమిళనాడు ప్రజా ఆరోగ్య చట్టం 1939 ప్రకారం అపరాధం విధిస్తామని స్పష్టం చేసింది.

Updated Date - 2022-07-06T13:46:16+05:30 IST