మాస్కుల్లేవ్‌.. దూరమూ లేదు!

ABN , First Publish Date - 2021-04-16T06:05:19+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, వసతి గృహాలలో కొవిడ్‌ నిబంధనలు అమలు కావడం లేదు. ఒక్కో పాఠశాలలో, హాస్టల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడుతున్నారు.

మాస్కుల్లేవ్‌.. దూరమూ లేదు!
నంద్యాలలోని ఓ పాఠశాలలో

  1. పాఠశాలల్లో కనిపించని శానిటైజేషన్‌
  2. ఇరుకుగా తరగతి గదులు, వసతి గృహాలు
  3. బడి బస్సులు, ఆటోల్లోనూ అదే పరిస్థితి
  4. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్లక్ష్యం
  5. ఇప్పటికే 720 మంది విద్యార్థులకు పాజిటివ్‌
  6. ఆదోని కస్తూర్బా హాస్టల్లో 21 మందికి కరోనా


కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉండే ప్రభుత్వ బీసీ బాలికల వసతి . కొవిడ్‌ కేసులు పెరుగుతున్న కారణంగా ఉగాది నుంచి మూసేశారు. ఈ హాస్టల్లో 180 మంది బాలికలకు వసతి కల్పించారు. వీరిలో 26 మంది కరోనా బారినపడ్డారు. ఎస్సీ బాలికలు, బీసీ బాలికలు, అనాథాశ్రమం విద్యార్థులు, బెగ్గర్‌ హోం బాలలు.. ఇలా నాలుగు వసతి గృహాలను ఒకే కాంప్లెక్సులో ఏర్పాటు చేశారు. వీటిలో 450 నుంచి 500 మంది విద్యార్థులు ఉంటున్నారు. నివాస గృహాలు ఉన్న కాలనీల మధ్య ఈ కాంప్లెక్సు ఉంది. అందుకే చుట్టూ మూసేసినట్లుగా, ఇరుకుగా ఉండే ఈ భవనంలో సరిగా గాలి కూడా సోకదు. కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇలా ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కేశారు. భౌతిక దూరం అన్న మాటకు ఆస్కారమే లేదు. ఒక్కో గదిలో 10 మందికి మించకూడదని నిబంధనలున్నా.. 20 మందికి పైగా విద్యార్థులను ఉంచారు. ఇలా ఉంటే విద్యార్థులు కొవిడ్‌ బారిన పడకుండా ఉంటారా..?


(కర్నూలు, ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, వసతి గృహాలలో కొవిడ్‌ నిబంధనలు అమలు కావడం లేదు. ఒక్కో పాఠశాలలో, హాస్టల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. పలువురు ఉపాధ్యాయులకూ పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు, నంద్యాల, ఆదోని.. ఇలా ప్రధాన పట్టణాల్లో విద్యార్థులు వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. సెకెండ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించింది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కళ్లకు కట్టింది. తరగతి గదుల్లోనే కాదు, విద్యార్థులు ప్రయాణించే బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల్లోనూ భౌతిక దూరం కనిపించడం లేదు. మాస్కులు, శానిటైజర్లను వినియోగించడం లేదు.


మాస్కులు ఎక్కడ..?

నంద్యాల పట్టణంలోని దేవనగర్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో 244 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ చేయడం లేదు. తరగతి గదుల్లో ఒకరిద్దరు విద్యార్థులు తప్ప మిగతా వారికి మాస్క్‌లు లేవు. అయితే ఇక్కడ బెంచీకి ఇద్దరు విద్యార్థులు కూర్చొనేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. 


బెంచికి  ముగ్గురు

నందికొట్కూరు జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో 60 మందికి పైగా విద్యార్థులను కూర్చోబెట్టారు. ఒక బెంచీలో ముగ్గురు విద్యార్థులు ఇరుక్కొని కూర్చుంటున్నారు. ఇంగ్లీష్‌ మీడియంలో 9, 10 తరగతుల్లో విద్యార్థులు అధికంగా ఉన్నారని, పాఠశాలకు 40 తరగతి గదులు అవసకం కాగా, 20 గదులే ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు ప్రాణేష్‌కుమార్‌ తెలిపారు. కొన్ని రోజుల క్రితం వరకు విద్యార్థులను ఆరు బయట కూర్చోబెట్టే వారమని, ఎండల తీవ్రత కారణంగా గదిలో కూర్చోబెట్టక తప్పడం లేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్యార్థులను ఇరుకు గదుల్లో పరిమితికి మించి కూర్చోబెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ుగ్గురు


మాస్కులు ఎక్కడ..?

ఆత్మకూరు తోటగేరిలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. జడ్పీ ఉర్దూ హైస్కూల్‌కు వెళ్లే ఆటోలో పది మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆత్మకూరులో విద్యార్థులను తరలించే దాదాపు అన్ని వాహనాల్లోనూ పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. 


బీసీ హాస్టల్లో 27 మందికి పాజిటివ్‌

కర్నూలు నగరంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో 57 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 27 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. రాయలసీమ క్రిస్టియన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ 63 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్‌ వచ్చింది. కల్లూరు మండలం గోకులపాడు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో ఇంగ్లీష్‌ అసిస్టెంట్‌ కొవిడ్‌తో మృతిచెందారు. నగరంలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. చాలా పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయడం లేదు. మాస్కులు  లేకున్నా అనుమతిస్తున్నారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచడం లేదు. భౌతిక దూరం గురించి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌, మాస్కుల విషయంపై కఠినంగానే వ్యవహరిస్తున్నా, భౌతిక దూరం అమలు కావడం లేదు. శానిటైజర్ల ఖర్చు పెరిగిందని, అందుకే ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచలేకపోతున్నామని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ నిబంధనలూ పాటించడం లేదు. విద్యార్థులు మాస్కులు లేకుండా తిరుగుతున్నా, గుంపులు, గుంపులుగా కూర్చుంటున్నా పట్టించుకునే వారే లేరు. శానిటైజర్లు, శానిటేషన్‌కు నిధులను కేటాయించలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. 


కస్తూర్బాలో కలకలం

ఆదోని పట్టణంలోని కస్తూర్బా (జనరల్‌) బాలికల వసతి గృహంలో 250 మంది పైగా బాలికలు ఉంటున్నారు. వారిలో 14 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఏడుగురు ఉపాధ్యాయులు కూడా కరోనా బారిన పడ్డారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దారు రామకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో రంగనాయకులు కస్తూర్బా విద్యాలయానికి చేరుకున్నారు. మిగిలిన బాలికలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వసతి గృహాన్ని, ఆవరణను శానిటైజ్‌ చేయించారు. వసతి గృహంలో బాలికలను ఇళ్లకు పంపించారు. 

మదిరె జడ్పీ హైస్కూల్‌, ఎంపీపీ మెయిన్‌ పాఠశాలలో కరోనా నిబంధనలను పాటించడంలేదు. గ్రామంలో 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వీరిలో ఓ విద్యార్థి కూడా ఉన్నాడు. ఈ జడ్పీ ఉన్నత పాఠశాలలో 387 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో గురువారం 264 మంది హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు 54 మంది హాజరయ్యారు. అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టారు. భౌతిక దూరం పాటించలేదు. మాస్కులు ధరించలేదు. పదో తరగతి గదిలో 57 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ మాస్క్‌లు ధరించలేదు. తల్లిదండ్రులు విద్యార్థులకు అదనంగా మాస్కులు ఇచ్చి పంపాలని, మాస్కులు లేకుంటే పాఠశాలకు ఇకపై అనుతించేది లేదని ఇన్‌చార్జి హెచ్‌ఎం రంగనాయకులు అన్నారు.  హెచ్‌ఎం గదిలో ఉన్న ఒకే ఒక్క శానిటైజర్‌ను 264 మంది విద్యార్థులు వినియోగిస్తున్నారని ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం. 


ఆదోని, చాగలమర్రి కేజీబీవీలకు సెలవులు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 15: చాగలమర్రి, ఆదోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు సెలవులను ప్రకటించినట్లు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్‌ గురువారం తెలిపారు. ఈ కేజీబీవీలల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేజీబీవీల్లో శానిటేషన్‌, భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆలూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా ర్థులు పూర్తి స్థాయిలో మాస్కులు ధరించలేదు. చాలామంది జలుబుతో, కొందరు జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. వీరిని తరగతి గదిలో మిగిలిన విద్యార్థులకు కాస్త దూరంగా కూర్చోబెట్టి చదివిస్తున్నారు. కొవిడ్‌ పరీక్షలు చేయించే ప్రయత్నం చేయాలేదు. తరగతి గదుల్లో శానిటైజర్లు లేవు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, బడిలోకి అనుమతిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు పుష్పరాజ్‌ తెలిపారు. 

గోనెగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. విద్యార్థులు మాస్క్‌లు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. పాఠశాలలో 1500 విద్యార్థులు ఉన్నారు. రోజూ వెయ్యి మంది వరకూ హాజరువుతున్నారు. తరగతి గదుల్లో, భోజన సమయంలో నిబంధనలు పాటించడం లేదు. 

కోసిగి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1100 మంది విద్యార్థులు ఉన్నారు. సుమారు 90 శాతం మంది మాస్కులు ధరించలేదు. భౌతికదూరం పాటించటం లేదు. శానిటైజర్‌ ఊసే లేదు.

పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు.  90 శాతం మంది విద్యార్థులు మాస్క్‌లను ఽధరించడంలేదు. శానిటైజర్ల వినియోగం కూడా లేదు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదు.


సమయం చాలడం లేదు 

మాస్క్‌లు లేకుండా వచ్చిన విద్యార్థులకు తాత్కాలికంగా మాస్క్‌లను అందజేస్తున్నాం. సమయం లేకపోవడంతో శానిటైజర్లను స్ర్పే చేయడం లేదు. బెంచికి ఇద్దరు విద్యార్థులను మాత్రమే కూర్చోబెడుతున్నాం  - లక్ష్మణ్‌రావు, ప్రిన్సిపాల్‌, ఏపీ మోడల్‌ స్కూల్‌, మహానంది





Updated Date - 2021-04-16T06:05:19+05:30 IST