ఇక పక్కాగా ఉపాధి

ABN , First Publish Date - 2022-01-20T05:16:45+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీకి చెక్‌ పెట్టేలా మార్పులు చేసింది.

ఇక పక్కాగా ఉపాధి
ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలు

- పథకం అమలులో సమూల మార్పులు

- గ్రామం యూనిట్‌గా పనుల కేటాయింపు

- కేంద్రం కనుసన్నల్లోనే నిధుల చెల్లింపులు

- ఫిబ్రవరి 1 నుంచి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ అమలు


కామారెడ్డి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీకి చెక్‌ పెట్టేలా మార్పులు చేసింది. ఏళ్లుగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ను తొలగిస్తూ కేంద్ర మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల భాగస్వామ్యంతో చేపట్టే ఈ పనులపై కేంద్రం పూర్తిస్థాయిలో తన పెత్తనాన్ని పెంచుకొనేలా సాంకేతిక మార్పులు చేసింది. ఇన్నాళ్లు పనుల్లో మార్పులు, చేర్పులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికే వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం పనుల నిర్వహణకు ప్రత్యేకించి టీసీఎస్‌ సర్వర్‌ను ఉపయోగించింది. ప్రస్తుతం ఆ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్మర్మేటిక్‌ సెంటర్‌) ద్వారా ఇక నుంచి రాష్ట్రంలో ఉపాధి పనుల నిర్వహణ కొనసాగనుంది.

ఉపాధి పనుల్లో మరింత పారదర్శకత

2005లో అమలులోకి వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సూచించిన ప్రతీ అంశం ఇక నుంచి ఈ విధానంలోనే అమలు చేయనున్నారు. పాత విఽధానంలో కొనసాగిన పనులు, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం ఆధీనంలో ఈ సర్వర్‌ ఉండటంతో అవకాశం ఉన్న పనులు మాత్రమే గ్రామాల్లో చేపడతారు. కొత్త విధానాన్ని ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌పై ఎంపీడీవోలతో పాటు ఉపాధి సిబ్బందికి ఇప్పటికే శిక్షణనిచ్చారు. గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలో ఎన్‌ఐసీ విధివిధానాల్లో పొందుపరుస్తున్నారు. కూలీలు చేసే పనుల ఆధారంగానే ఆ గ్రామానికి మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు మంజూరు చేస్తారు. దీంతో ఉపాధి పనుల్లో మరింత పారదర్శకత పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

సొంత సాఫ్ట్‌వేర్‌తో..

గ్రామంలో పేరు నమోదు చేసుకున్న కూలీలందరికీ ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పించాలని చట్టం చెబుతోంది. 60శాతం నిధులు కూలీలకు, 40 శాతం నిధులు మెటీరియల్‌ కాంపోనెంట్‌కు ఖర్చుచేసే వెసులుబాటును కల్పించారు. దేశ వ్యాప్తంగా ఇదే విధానాన్ని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ మాత్రం కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ కాకుండా సొంత సాఫ్ట్‌వేర్‌తో పనులు చేపడుతున్నారు. దీంతో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద వచ్చే నిధులను తమకు నచ్చిన పనులకు రాష్ట్రం వినియోగిస్తోంది. గ్రామం యూనిట్‌గా కాకుండా జిల్లా యూనిట్‌గా మెటీరియల్‌ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. సీసీరోడ్లు, మురుగు కాల్వలతో పాటు రైతు వేదికలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు తదితర పనులకు ఈ నిధులను ఎక్కువగా వెచ్చిస్తోంది. కొత్త విధానంతో ఇలాంటి పనులకు గండి పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను ఇత ర పనులకు మళ్లిస్తుండడంతో కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. దీన్ని గమనించిన కేంద్రం ప్రభుత్వం తెలంగా రాష్ట్రంలో ఎన్‌ఐసీ విధానాన్ని అమలులోకి తేవాలని నిర్ణయించింది.

గ్రామాలకు ఎంతో మేలు

కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ అమలైతే గ్రామం యూనిట్‌గా తీసుకుంటారు. ఏ గ్రామంలో ఎక్కువ మంది కూలీలు పని చేస్తే ఆ గ్రామానికి మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద ఎక్కువ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో జిల్లా యూనిట్‌గా చేసుకుని కూలీల పని, మెటీరియల్‌కు నిధులు కేటాయించేవారు. ఇప్పుడు మాత్రం ఏ గ్రామానికి సంబంధించిన ఉపాధి డబ్బులు ఆ గ్రామానికి వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు.

Updated Date - 2022-01-20T05:16:45+05:30 IST