రుణం వద్దు.. రణమే ముద్దు

ABN , First Publish Date - 2022-06-03T08:22:03+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అప్పులపై పేచీ ఎటూ తెగడం లేదు. ఆర్థిక సంవత్సరం మొదలై రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ రెండు నెలల్లో రాష్ట్రానికి

రుణం వద్దు.. రణమే ముద్దు

అప్పులపై కేంద్రంతో రాష్ట్ర సర్కారు తీరు

అడిగిన సమాచారం ఇవ్వకుండా సాచివేత

కేంద్ర విధానాలే తప్పంటూ ఎదురుదాడి

రుణాల మంజూరులో కేంద్రం ప్రాతిపదికనే

తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు

ఈ ఆర్థిక సంవత్సరంలో రెణ్నెల్లు గడిచినా

తెలంగాణ అప్పులకు దొరకని అనుమతి

ఇప్పటికే ఆ వివరాలు ఇచ్చి కావాల్సిన అప్పులు

తెచ్చుకుంటున్న బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు

కేంద్రం అడిగిన వివరాలు సమర్పిస్తే రాష్ట్రానికి

పుట్టే అప్పు అంచనా వేసినదాంట్లో 10-15ు!

దానికోసం కేంద్రానికి ఇవ్వడం కంటే 

యుద్ధానికే మొగ్గుచూపుతున్న రాష్ట్ర సర్కారు?

ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలన్న ఆలోచన?

పక్కనున్న ఏపీ, బీజేపీయేతర రాష్ట్రాలు ఎడాపెడా అప్పులు తెచ్చుకుంటున్నాయి. కానీ.. రాష్ట్రానికి మాత్రం అప్పు పుట్టట్లేదు. కేంద్రం ఎందుకు తెలంగాణ అప్పులకు అనుమతి ఇవ్వట్లేదు అంటే.. కార్పొరేషన్ల పేరుతో అధిక వడ్డీలకు హద్దూపద్దూ లేకుండా తెస్తున్న గ్యారంటీ అప్పులపై స్పష్టంగా, నిర్దిష్టంగా ఇవ్వాలంటూ కేంద్రం అడిగిన వివరాలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వకపోవడమే కారణమని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ వివరాలిస్తే అసలు స్వరూపం, అప్పుల బండారం బయటపడుతుందనే ఆందోళనే ఇందుకు కారణమంటున్నాయి. కొత్త పద్ధతి ప్రకారం రాష్ట్రానికి ఈ ఏడాది ప్రతిపాదించిన అప్పుల్లో 10-15 ు కూడా వచ్చే చాన్స్‌ ఉండదు! ఆ మాత్రానికే కేంద్రానికి వివరాలు ఎందుకివ్వాలి? దీన్ని రాజకీయంగా వాడుకుందామనే ఉద్దేశంతో రాష్ట్రసర్కారు ‘రుణం వద్దు.. కేంద్రంపై రణమే ముద్దు’ అనే వ్యూహానికి తెరతీసిందని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అప్పులపై పేచీ ఎటూ తెగడం లేదు. ఆర్థిక సంవత్సరం మొదలై రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ రెండు నెలల్లో రాష్ట్రానికి రావాల్సిన 11 వేల కోట్ల రూపాయల అప్పు పుట్టకుండా పోయింది. ఇక జూన్‌ నెలలో రూ.4000 కోట్ల అప్పు తీసుకోవాల్సి ఉంది. కానీ, దానిపై ఏ స్పష్టతా లేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి మే 31 వరకూ రూ.9500 కోట్ల అప్పు తీసుకుంది. మరి తెలంగాణకే అప్పు ఎందుకు పుట్టట్లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ప్రస్తుత పరిస్థితికి నేపథ్యం తెలుసుకోవాలనుకుంటే.. రెండు నెలలు వెనక్కి వెళ్లాలంటున్నారు ఆర్థిక నిపుణులు! ఆర్థికంగా అతలాకుతలమై రావణకాష్టంలా రగులుతున్న శ్రీలంక దుస్థితిని చూసి అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు తాము తీసుకుంటున్న అప్పుల వివరాలతోపాటు, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న గ్యారంటీ అప్పుల వివరాలు కూడా తమకు సమర్పించాలంటూ మార్చి 31న లేఖలు రాసింది. కొత్త విధాన నిర్ణయం ప్రకారం ఒక్క తెలంగాణకే కాక దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే తరహా వివరాలు అడుగుతూ లేఖలు రాసింది. కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులు, వడ్డీలను కూడా బడ్జెట్‌ నిధుల నుంచే చెల్లిస్తున్నారని లేఖలో పేర్కొంది. బడ్జెట్‌ అప్పులు జీఎ్‌సడీపీలో 3.5 శాతం ఉండాలని, కానీ... గ్యారంటీ అప్పులను కూడా కలిపితే ఈ పరిమితి దాటిపోతోందని ఆందోళన వెలిబుచ్చింది. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు మేరకు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్‌, బడ్జెటేతర(గ్యారంటీ అప్పులు) రుణాలను కలిపి లెక్కిస్తామని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకుని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకోవడానికి అర్హమవుతుందో నిర్ధారిస్తామని చెప్పింది. అన్ని రాష్ట్రాలూ ఏయే పద్దు కింద ఎంతెంత అప్పులు తీసుకున్నాయో నిర్దిష్ట పద్ధతిలో, వివరంగా తెలియజేయాలని అందులో విస్పష్టంగా పేర్కొంది. ఒక్క తెలంగాణ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ వివరాలను అందించి, అప్పులు తీసుకుంటున్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా కేంద్రం అడిగిన సమాచారం అందించి అప్పులు పొందగలుగుతున్నాయి. ఏపీ జీఎ్‌సడీపీ ప్రకారం ఆ రాష్ట్రం రూ.45-50 వేల కోట్ల దాకా అప్పు తీసుకునే అవకాశం ఉంది. కానీ, కొత్త విధానం ప్రకారం  కేంద్రం నిర్ధారించిన రూ.28 వేల కోట్ల పరిమితితో సంతృప్తి చెందింది.

తెలంగాణకే అప్పు ఎందుకు పుట్టట్లేదంటే..

బడ్జెట్‌, బడ్జెటేతర అప్పులకు సంబంధించి కేంద్రం వివరాలు అడిగి రెండు నెలలు అవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలు ఇవ్వట్లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దోబూచులాడుతుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా, రాష్ట్ర మంత్రులు కొనుగోళ్ల వివరాలను బయటపెడుతూ దుమ్మెత్తిపోశారు. కానీ, అప్పులపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. అప్పు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టకపోవడం గమనార్హం. గ్యారంటీ అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీలను బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నందున.. ఆ విషయాలు బయటపడతాయనే కేంద్రం వద్ద మొహం చాటేస్తోందని ఆర్థిక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అడిగిన వివరాలు ఇవ్వకపోగా కేంద్ర విధానాలనే తప్పుపడుతూ లేఖలు రాస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా తమ జీఎ్‌సడీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3.5 శాతం మేర అప్పు తీసుకోవచ్చు. ఆ లెక్కన 2020-21లో రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.9,80,407 కోట్లు. అందులో 3.5 శాతం అప్పు అంటే.. రూ.34,314 కోట్ల దాకా అప్పు చేసుకోవడానికి రాష్ట్ర సర్కారుకు అనుమతి ఉంది. కానీ, 2020-21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.45,638 కోట్ల అప్పు తీసుకుంది. వివిధ కార్పొరేషన్ల పేర (గ్యారంటీ అప్పు) మరో రూ.21,969 కోట్ల మేర సేకరించింది. రెండూ కలిపితే రూ.67,607 కోట్లు. అంటే.. తీసుకోవాల్సిన దానికన్నా రూ.33,293 కోట్లు అధికం. 2021-22లో రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.11,54,860 కోట్లు. అంటే రూ.40,420 కోట్ల దాకా అప్పు తీసుకోవచ్చు. కానీ, ఆ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ అప్పు రూ.55,532 కోట్లు, గ్యారంటీ అప్పు రూ.27,488 కోట్లు తీసుకుంది. రెండూ కలిపితే ఏకంగా రూ.83,020 కోట్లు. అంటే పరిమితి కన్నా ఏకంగా రూ.42,600 కోట్లు. రెండేళ్లలో కలిపి అదనంగా తీసుకున్న అప్పు ఏకంగా రూ.75 వేల కోట్లకు పైమాటే! ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎ్‌సడీపీ రూ.12,20,804 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేశారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,728 కోట్ల మేర అప్పు తీసుకోవచ్చు. మార్చి 31న కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వమేమో ఈ ఏడాది  రూ.4,102 కోట్ల మూలధన వ్యయ అప్పు కాకుండా, రూ.55,532 కోట్ల అప్పును సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కార్పొరేషన్ల ద్వారా సేకరించాలని భావిస్తున్న అప్పు కూడా కలిపితే దాదాపుగా రూ.90 వేల కోట్ల దాకా ఉంటుంది. జీఎస్‌డీపీ తుది అంచనాల ప్రకారం ఇంకొంచెం పెరగొచ్చు. కేంద్రమేమో తెలంగాణ అప్పుల పరిమితి రూ.42,728 కోట్లేనని.. అది కూడా గత రెండేళ్ల బడ్జెట్‌, బడ్జెటేతర అప్పులను బట్టి ఉంటుందని చెబుతోంది. ఆ రెండేళ్లలో అధికంగా తీసుకున్న అప్పులను తీసేసి.. వివిధ కార్పొరేషన్ల చెల్లింపు సామర్థ్యానికి సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తే.. నికరంగా రాష్ట్రానికి మిగిలే అప్పు పరిమితి ప్రతిపాదించిన దాంట్లో 10-15 శాతం మించి ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం అర్థమైనందునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడిగిన వివరాలను సమర్పించకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా చేశారంటూ కేంద్రాన్ని విమర్శిస్తూ లేఖలు రాస్తోందని, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల గ్యారంటీ అప్పులను అసలు లెక్కలోకే తీసుకోవద్దని, కావాలంటే... 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం కొత్త విధానాన్ని అమలు చేయాలంటూ డిమాండ్‌ చేస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. జనాకర్షక పథకాలకు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయం నుంచి ఖర్చుపెడుతూ.. ఆస్తుల కల్పన కోసం మాత్రం విపరీతమైన వడ్డీలకు ఎడాపెడా అప్పులు చేయడమే ఈ సమస్య మొత్తానికీ కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ కోణం?

కేంద్రం అడిగిన వివరాలు సమర్పిస్తే వచ్చే అప్పు.. తాము అనుకున్నదాంట్లో 10-15 శాతమే ఉంటుంది కాబట్టి ఆ కాస్త కోసం కేంద్రం ముందు సాగిలపడకూడదనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ మాత్రం ఆదాయం సొంతవనరుల ద్వారా సంపాదించుకోలేమా అనే భావనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు సమాచారం. మద్యం ధరల పెంపు, భూముల అమ్మకం వంటివి అందులో భాగమేనని తెలుస్తోంది. పైగా గత రెండేళ్లుగా తీసుకున్న గ్యారంటీ అప్పులను బడ్జెట్‌ నుంచే చెల్లించాల్సి వచ్చిందన్న అపరాధ భావం కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ సంవత్సరానికి అప్పు తీసుకోకుండా ఉండడమే మేలన్న ఆలోచనకు రాష్ట్ర సర్కారు వచ్చిందని.. తద్వారా దీనిని రాజకీయంగా వాడుకోవచ్చన్న వ్యూహం కూడా ఉన్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ‘‘మొన్న ధాన్యం కొనుగోళ్ల విషయంలో పేచీ పెట్టిన కేంద్రం.. ఇప్పుడు అప్పు పుట్టకుండా రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తోంద’’ంటూ కేంద్రంపై దుమ్మెత్తిపోయవచ్చనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు రాబోతున్నందున.. అప్పుడు ఈ అప్పుల అంశాన్ని తెరపైకి తెచ్చి, కేంద్రంలోని బీజేపీని తూర్పారపట్టవచ్చని టీఆర్‌ఎస్‌ సర్కారు యోచనగా రాజకీయనిపుణులు విశ్లేషిస్తున్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చన్నది అధికార పార్టీ ఆలోచనగా భావిస్తున్నారు. ఆ ఆలోచనే లేకపోతే.. సీఎం కేసీఆర్‌గాని, రాష్ట్ర ఆర్థిక మంత్రిగానీ అప్పులపై కేంద్రంతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆలోచన వేరుగా ఉండడం వల్లే పరిస్థితి ఇలా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కొత్త విధానం ప్రకారం గత రెండేళ్లలో తీసుకున్న అధిక అప్పులను ఈ ఒక్క ఏడాదిలోనే మినహాయించకుండా మూడేళ్లపాటు మినహాయించాలని కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కేంద్రం ఆ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. తెలంగాణ సర్కారు అలా కూడా అడగకపోవడం గమనార్హం.

ఎన్‌పీఎ్‌స ద్వారా కూడా అప్పు

నేషనల్‌ పెన్షన్‌ స్కీంలో భాగంగా ఉద్యోగుల నుంచి సేకరించిన, రాష్ట్రప్రభుత్వ కాంట్రిబ్యూషన్ల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ‘నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సడీఎల్‌)’ సంస్థలో జమ చేస్తోంది. ఇలా జమ చేసిన డిపాజిట్లపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరికొంత శాతం మేర అప్పు తీసుకోవడానికి అనుమతిస్తామని కేంద్రం చెబుతోంది. ఇది కూడా ఒక రకంగా రాష్ట్రానికి కలిసి వచ్చే అంశమే. కానీ... ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని ప్రభుత్వం భయపడుతోంది. ఇదే కాకుండా... మోటార్లకు మీటర్లు బిగించడం వంటి విద్యుత్తు సంస్కరణలను అమలు చేస్తే మరో 0.5 శాతం అదనపు రుణ పరిమితికి అనుమతిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ సంస్కరణలను అమలు చేసే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కరాఖండీగా చెప్పేశారు. ఇలా కేంద్రం కల్పిస్తున్న వెసులుబాట్లను వినియోగించుకున్నా... వినియోగించుకోపోయినా... కనీసం గ్యారంటీ అప్పులపై కేంద్రానికి పూర్తి సమాచారాన్ని అందిస్తే కొంతైనా అప్పు చేసుకునే అవకాశం లభిస్తుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇలాగే చేసిందని వారు గుర్తుచేస్తున్నారు.

 రూ.10 లక్షలు మించితే.. బిల్లుల చెల్లింపుల్లేవ్‌!

అసలే ఆర్థిక కష్టాలు.. అప్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరణ.. ఏప్రిల్‌, మే నెలల్లో దక్కని రూ.11 వేల కోట్ల రుణం.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రూ.10 లక్షల విలువ మించిన బిల్లులను విడుదల చేయొద్దంటూ అన్ని శాఖలను ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని శాఖలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఒకవేళ రూ.10 లక్షల విలువ మించిన బిల్లులను ఇవ్వాలనుకుంటే... తప్పకుండా తన దృష్టికి తేవాలని సూచించారు. రూ.10లక్షల లోపు బిల్లుల చెల్లింపునకు మాత్రం అనుమతి ఇచ్చారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో ఈ ఆదేశాలు జారీచేశారని తెలిసింది. ఉద్యోగులకు జీతాల చెల్లింపు పూర్తయ్యేవరకు ఈ ఆంక్షలను అమలు చేయనున్నట్లు భావిస్తున్నారు. కాగా, సర్కారుకు నెలవారీ ఆదాయం రూ.10 వేల కోట్ల వరకు వస్తోంది. వ్యయాలు రూ.16వేల కోట్ల వరకు ఉంటాయి. కానీ, ఈ నెలలో రూ.7,600 కోట్లను రైతుబంధు పథకానికి సర్దాల్సి ఉంది. దీంతో నిధుల కటకట ఏర్పడనుంది. వేతనాలు, పింఛన్లు, రైతుబంధు, అప్పుల కిస్తులు, వడ్డీ చెల్లింపులు తదితరాలన్నింటికీ కలిపి రూ.23వేల కోట్లపైగా అవసరం. మేలో రూ.9,900 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. వీటిని వ్యయాలన్నింటికీ సర్దాలి. ఇవి ఏమూలకూ సరిపోవు. అందుకే, బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించినట్లు తెలిసింది.


Updated Date - 2022-06-03T08:22:03+05:30 IST