మా కుటుంబంలో గొడవలు లేవు

ABN , First Publish Date - 2020-10-21T08:41:43+05:30 IST

ప్రపంచ చాంపియన్‌, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శిక్షణ శిబిరం నుంచి అర్ధంతరంగా లండన్‌కు వెళ్లడంపై వివాదం చెలరేగింది. ‘టార్గెట్‌ ఒలింపిక్స్‌’లో భాగంగా భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) ఎంపిక చేసిన కొద్ది మంది స్టార్‌ షట్లర్లకు హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో

మా కుటుంబంలో గొడవలు లేవు

  • లండన్‌ పర్యటనపై ‘బాయ్‌’కు లేఖ రాశానన్న పీవీ సింధు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ చాంపియన్‌, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శిక్షణ శిబిరం నుంచి అర్ధంతరంగా లండన్‌కు వెళ్లడంపై వివాదం చెలరేగింది. ‘టార్గెట్‌ ఒలింపిక్స్‌’లో భాగంగా భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) ఎంపిక చేసిన కొద్ది మంది స్టార్‌ షట్లర్లకు హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో రెండు నెలలుగా జాతీయ శిక్షణ శిబిరం కొనసాగుతోంది. శిబిరం జరుగుతుండగానే సింధు లండన్‌లోని గెటోరేడ్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లడం వివాదానికి కేంద్ర బిందువైంది. అయితే, వచ్చే జనవరిలో జరగనున్న ఆసియా ఓపెన్‌, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సన్నద్ధతలో భాగంగా బాడీ కండీషనింగ్‌, న్యూట్రిషన్‌ కోసం లండన్‌ వచ్చానని సింధు స్వయంగా సోమవారం ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం అక్కడి గెటోరేడ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (జీఎ్‌సఎస్‌ఐ)లోని ప్రముఖ స్పోర్ట్స్‌ న్యూట్రిషనిస్ట్‌ రెబ్కా రాండెల్‌ పర్యవేక్షణలో సింధు కసరత్తులు చేస్తోంది. ‘ఇంగ్లండ్‌లో ఉన్నందుకు ఆనందంగా ఉంది. న్యూట్రిషన్‌, ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని వారాలు జీఎ్‌సఎ్‌సఐలో శ్రమించనున్నా. ప్రతిష్ఠాత్మక ఆసియా ఓపెన్‌, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ మూడు నెలల్లో సమీపిస్తుండడంతో నన్ను మెరుగుపర్చుకోవడానికి ఇది మంచి అవకాశం’ అని సింధు ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ చేసిన అనంతరం శిక్షణ శిబిరం నుంచి సింధు వైదొలగడానికి వేరే కారణాలు ఉన్నాయని ఒక ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది. కుటుంబ సభ్యులతో నెలకొన్న విభేదాల వల్లే సింధు ఇంగ్లండ్‌ వెళ్లినట్టు, జాతీయ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌తో కూడా అభిప్రాయభేదాలు ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే, వీటిని సింధు ట్విటర్‌ వేదికగా ఖండించగా... ఆమె తండ్రి రమణ, గోపీచంద్‌ భిన్నంగా స్పందించడం గమనార్హం.


కొరియా కోచ్‌లతో శిక్షణ

సింధు తండ్రి రమణ తాజా వ్యాఖ్యలతో గోపీచంద్‌తో వారికున్న విభేదాలు బహిర్గతమయ్యాయి. గోపీ తీరుతో కొంత కాలంగా అసహనంతో ఉన్న రమణ.. సింధును రోజువారీ సాధన కోసం హైదరాబాద్‌లోని మరో అకాడమీకి తీసుకువెళుతున్నట్టు సమాచారం. గత రెండేళ్లుగా సింధు కొరియా కోచ్‌ల ఆధ్వర్యంలో వ్యక్తిగత శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిసింది.


క్యాంప్‌ సరిగ్గా జరగడం లేదు

జాతీయ శిక్షణ శిబిరంలో సింధు సాధన సరిగ్గా జరగడం లేదు. శిక్షణపై సింధు సంతృప్తిగా లేదు. 2018 ఆసియా క్రీడల తర్వాత నుంచి సింధు శిక్షణపై గోపీచంద్‌ శ్రద్ధ తీసుకోవడం లేదు. ప్రాక్టీస్‌ చేయడానికి సింధుకు సరైన భాగస్వామిని కూడా ఇవ్వలేకపోయాడు. అకాడమీలో ప్రామాణిక శిక్షణ లభించకపోవడంతో పాటు వారి వ్యవహారశైలితో సింధు విసిగిపోయింది.

-పీవీ రమణ (సింధు తండ్రి)


రమణ వ్యాఖ్యలపై స్పందించను

సింధు తండ్రి పీవీ రమణ చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించాలనుకోవడం లేదు. ఒకవేళ సింధు నా గురించి ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా.                   

- పుల్లెల గోపీచంద్‌ 


అకాడమీ సదుపాయాలపై అసంతృప్తి లేదు

లండన్‌ టూర్‌పై బాయ్‌కు సమాచారం ఇచ్చా. మా కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవు. అమ్మానాన్నతో చర్చించి వారి అనుమతితోనే లండన్‌ పయనమయ్యా. నా కెరీర్‌ కోసం మావాళ్లు జీవితాలనే త్యాగం చేశారు. అంతటి గొప్పవారితో నాకు ఇబ్బందులు ఎలా ఎదురవుతాయి? ఎక్కడున్నా రోజూ వాళ్లతో మాట్లాడతా. గోపీచంద్‌తో కూడా ఎలాంటి సమస్యలు లేవు. గోపీ అకాడమీలోని సదుపాయాల విషయంలోనూ 

ఎలాంటి అసంతృప్తి లేదు.

- పీవీ సింధు

Updated Date - 2020-10-21T08:41:43+05:30 IST