‘ఐసొలేషన్‌ సెంటర్‌’లో ఉండక్కర్లేదు

ABN , First Publish Date - 2022-01-22T07:50:46+05:30 IST

విదేశాల నుంచి వచ్చి.. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులు ఇకపై ప్రత్యేకంగా ఐసొలేషన్‌ సెంటర్‌లో ఉండడం కచ్చితం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముప్పు జాబితాలోనివి సహా ఏ దేశం నుంచి...

‘ఐసొలేషన్‌ సెంటర్‌’లో ఉండక్కర్లేదు

‘విదేశీ పాజిటివ్‌’లకు మినహాయింపు: కేంద్రం

దేశంలో కొత్తగా 3.47 లక్షల కరోనా కేసులు నమోదు 


న్యూఢిల్లీ, జనవరి 21: విదేశాల నుంచి వచ్చి.. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులు ఇకపై ప్రత్యేకంగా ఐసొలేషన్‌ సెంటర్‌లో ఉండడం కచ్చితం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముప్పు జాబితాలోనివి సహా ఏ దేశం నుంచి వచ్చినా ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ   ఆదేశాలు శనివారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అమల్లో ఉంటాయని పేర్కొంది. దీనికితగినట్లు మార్గదర్శకాల్లో సమరణ చేసింది.  ఈ మార్పు తప్ప.. విదేశీ ప్రయాణికుల్లో పాజిటివ్‌ వచ్చినవారికి ఇప్పటికే ఉన్న ప్రామాణిక మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం తెలిపింది. కాగా, కేరళ, కర్ణాటకల్లో భారీగా కేసులు రావడం.. తమిళనాడులోనూ పెద్దసంఖ్యలో నమోదు కావడంతో దేశంలో పాజిటివ్‌లు మరింత పెరిగాయి. గురువారం 3,47,254 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. క్రితం రోజుకు ఇవి 30 వేలు అధికం. కర్ణాటకలో 47,754 కేసులు రాగా, బెంగళూరులోనే 30 వేలపైగా నమోదయ్యాయి. కేరళలో గత రెండు వేవ్‌లలో ఎన్నడూలేని విధంగా 46,387 కేసులు వచ్చాయి. పాజిటివ్‌ రేటు 40 దాటింది. తమిళనాడులో 28 వేల కేసులు రికార్డయ్యాయి. ఈ ప్రభావంతో దేశంలో యాక్టివ్‌లు 20 లక్షలు దాటాయి. రోజు వారీ పాజిటివ్‌ రేటు 18కి చేరింది. ఢిల్లీలో కొత్త కేసులు 12 వేలకు తగ్గాయి. మరోవైపు దేశంలో గురువారం 703 మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రత రీత్యా వచ్చే రెండు ఆదివారాలు అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటినీ నిలిపివేయాలని కేరళ నిర్ణయించింది. రెండేళ్లలోపు పిల్లలున్న ఉద్యోగినులు, దీర్ఘకాల వ్యాధులున్న ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే వీలు కల్పించారు. కాగా, కేరళ మాజీ సీఎం వీఎస్‌ అచ్యుతానందన్‌,  మేఘాలయ సీఎం కోనార్డ్‌ సంగ్మా కొవిడ్‌ బారినపడ్డారు. తమిళనాడులోనూ 23న ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో గత ఆదివారమూ లాక్‌డౌన్‌ అమ లు చేశారు. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూను ఎత్తేసి.. రాత్రి కర్ఫ్యూ కొనసాగించనున్నారు. 


వ్యక్తుల కొవిడ్‌ డేటా లీక్‌

దేశంలో వేలాది మంది పౌరుల కొవిడ్‌ సమాచారం లీకయింది. వ్యక్తుల పేర్లు, ఫోన్‌, పాన్‌ నంబర్లు, చిరునామా.. ఆఖరికి ఆర్టీపీసీఆర్‌ టెస్టు తేదీ, ఫలితం సహా వివరాలన్నీ బహిర్గతమయ్యాయి. ప్రభుత్వ సర్వర్‌ నుంచే లీకేజీ వ్యవహారమంతా జరిగినట్లు తెలుస్తోంది. ఈ డేటా అంతటినీ రైడ్‌ ఫోరమ్స్‌ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఇదే అదనుగా ఓ సైబర్‌ నేరస్తుడు తన వద్ద 20 వేల మంది వివరాలున్నట్లు ప్రకటించాడు. వ్యక్తుల వివరా లు, ఆర్టీపీసీఆర్‌ టెస్టు ఫలితాలు తదితర సమాచారం కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌ నుం చి బహిర్గతమైందంటూ సైబర్‌ భద్రతా నిపుణుడు రాజశేఖర్‌ రజహారియా ట్వీట్‌ చేశారు. 


ఒక హ్యాండ్‌ బ్యాగ్‌కే అనుమతి!

మూడో వేవ్‌ ఉధృతి దృష్ట్యా, పౌర విమానయాన భద్రత బ్యూరో(బీసీఏఎస్‌) కొత్త ఆదేశాలను జారీ చేసింది. ప్రయాణికులు విమానాల్లో తమతో పాటు ఒకే హ్యాండ్‌ బ్యాగ్‌ను తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. 2 లేదా 3 హ్యాండ్‌ బ్యాగ్‌లతో ప్రయాణికులు వస్తుండటం వలన తనిఖీ ప్రదేశాల రద్దీ ఎక్కువవుతోందని.. ఆ పరిస్థితిని అడ్డుకునేందుకే ఈ నిబంధనను తీసుకొచ్చామని అధికారులు వివరణ ఇస్తున్నారు. అయితే.. బీసీఏఎస్‌ సర్క్యులర్‌లో పేర్కొన్న వస్తువులను మాత్రం తీసుకెళ్లచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-22T07:50:46+05:30 IST