దుబాయ్: వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియాకు మరో షాక్. 2021 ఏడాదికి గాను ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులానే, పురుషుల జట్టులోనూ ఒక్కరంటే ఒక్క భారతీయ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. తాజాగా, ప్రకటించిన ఐసీసీ 2021 వన్డే జట్టుకు పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది.
బాబర్ సహచరుడైన ఫకర్ జమాన్‌కూడా చోటు లభించింది. ఇద్దరు సఫారీ ఆటగాళ్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు, బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు, ఇద్దరు ఐర్లాండ్ ఆటగాళ్లకు ఐసీసీ వన్డే జట్టులో చోటు లభించింది.
2021లో ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బాబర్ 67.50 సగటుతో 405 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో జట్టులో కీలక పాత్ర పోషించాడు. సీమర్లకు అనుకూలించే బర్మింగ్‌హామ్ పిచ్‌పై మర్చిపోలేని సెంచరీ నమోదు చేశాడు.
ఫకర్ జమాన్ కూడా గతేడాది అద్భుతంగా రాణించాడు. ఆరు మ్యాచుల్లో 60.83 సగటుతో 365 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇందులో ఒకటి సౌతాఫ్రికాపై సాధించాడు. బ్యాట్, బంతితో రాణించిన శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ 14 మ్యాచుల్లో 27.38 సగటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 4.56 ఎకానమీతో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.
2021 ఐసీసీ వన్డే జట్టు: పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్), జామనెమన్ మలాన్ (దక్షిణాఫ్రికా), బాబర్ ఆజం (పాకిస్థాన్), ఫకర్ జమాన్ (పాకిస్థాన్), రాసీ వాండెర్ డుసెన్ (దక్షిణాఫ్రికా), షకీబల్ హసన్ (బంగ్లాదేశ్), ముస్తాఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్), వనిందు హసరంగ (శ్రీలంక), ముస్తాఫిజుర్ రహ్మాన్(బంగ్లాదేశ్), సిమి సింగ్ (ఐర్లాండ్), దుష్మంత చమీర (శ్రీలంక)