నోట్ల ముద్రణ ఆలోచనే లేదు

ABN , First Publish Date - 2021-07-27T06:00:03+05:30 IST

కొవిడ్‌తో తలెత్తిన ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు అదనపు నోట్ల ముద్రణ ఆలోచనే

నోట్ల ముద్రణ ఆలోచనే లేదు

  • ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నాయ్‌..
  • ప్యాకేజీ చర్యలతోనే గట్టెక్కుతాం
  • ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌


న్యూఢిల్లీ: కొవిడ్‌తో తలెత్తిన ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు అదనపు నోట్ల ముద్రణ ఆలోచనే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. కొన్ని ఇబ్బందులున్నా భారత ఆర్థిక మూలాలు ఇప్పటికీ పటిష్ఠంగానే ఉన్నట్టు తెలిపారు.  కొవిడ్‌తో తలెత్తిన అదనపు ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం రూ.12 లక్షల కోట్ల వరకు  అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో ద్రవ్యలోటు చుక్కలనంటుతోంది. అదనపు నోట్ల ముద్రణ ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చని చాలా మంది ఆర్థికవేత్తలు, నిపుణులు సూచించారు. దీంతో కొన్ని ప్రతికూల సమస్యలూ ఎదురయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపించాయి.


ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌ అసలు అలాంటి ఆలోచనే లేదని లోక్‌సభలో స్పష్టం చేయడం విశేషం. లాక్‌డౌన్ల తొలగింపుతో పాటు ఆత్మ నిర్భర్‌ భారత్‌ (ఎఎన్‌బీ) పేరుతో ప్రభుత్వం ప్రకటించిన రూ.29.87 లక్షల కోట్ల ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిస్తుందని సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 


రూ.8.34 లక్షల కోట్ల ఎన్‌పీఏలు


మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) రూ.8.34 లక్షల కోట్లుగా లెక్క తేలాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కే కరద్‌ లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ భారం రూ.61,180 కోట్లు తక్కువ. 


ఐటీ పోర్టల్‌ కోసం ఇన్ఫోసి్‌సకు రూ.164.5 కోట్లు


కొత్త ఐటీ పోర్టల్‌ అభివృద్ధి కోసం ఇన్ఫోసిస్‌ కంపెనీకి రూ.164.5 కోట్లు చెల్లించినట్లు ఆర్థిక శాఖ  సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. గత నెల 7న ప్రారంభమైన ఈ పోర్టల్‌ తొలి రోజు నుంచి పలు సాంకేతిక సమస్యలతో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇన్ఫోసి్‌సతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పారు.


16,527 కంపెనీల పేర్ల తొలగింపు 


అల్లాటప్పా కంపెనీలపైనా ప్రభు త్వం దృష్టి పెట్టింది. కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 248 కింద గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 16,527 కంపెనీల పేర్లను రికార్డుల నుంచి తొలగించింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు.  




రూ.20,324 కోట్ల నల్లధనం గుట్టురట్టు 


పనామా, ప్యారడైజ్‌ పేపర్ల లీకేజీలతో రూ.20,324 కోట్ల నల్లధనం గుట్టు రట్టయిందని ఆర్థిక శాఖ మరో సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఈ విషయం ప్రకటించారు. ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే)  అందించిన వివరాలతో లెక్కల్లో చూపని మరో రూ.11,010 కోట్ల నల్లధన వివరాలు తెలిసినట్టు తెలిపారు. కాగా జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ నికర పన్ను వసూళ్లు రూ.5.57 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 86 శాతం ఎక్కువని చౌదరి చెప్పారు.  




దివాలా చట్టం నుంచి ఎంఎ్‌సఎంఈలకు ఊరట


దివాలా చట్టం నుంచి ఎంఎ్‌సఎంఈలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు ఉద్దేశించిన దివాలా చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మల  లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రూ.కోటి కంటే తక్కువ ఉన్న కేసుల్లో ముంద స్తు పరిష్కార ప్రక్రియకు ఈ సవరణలో శ్రీకారం చుట్టారు. ఏదైనా ఎంఎ్‌సఎంఈ బకాయిలు రూ.కోటి లోపు ఉంటే రుణదాతలు, వాటాదారులు కలిసి ఎన్‌సీఎల్‌టీకి వెళ్లకుండానే ప్రత్యామ్నాయ పరిష్కార కోసం ఈ బిల్లు ద్వారా ప్రయత్నించవచ్చు. ఈ బిల్లు ద్వారా దివాలా కేసుల నుంచి ఎంఎ్‌సఎంఈలకు పెద్ద ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. 


Updated Date - 2021-07-27T06:00:03+05:30 IST