Abn logo
Jul 31 2021 @ 16:42PM

అప్పట్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చెబితే కాదన్నారు.. ఇప్పుడు దాన్నే ఒప్పుకున్నారు!

రాష్ట్రంలో అదో ప్రముఖ పుణ్యక్షేత్రం. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు కొండపై కొలువుదీరిన స్వామివారిని దర్శించి, అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు తీర్చుకుంటారు. అటువంటి దేవస్థానంలో పారిశుధ్యం పడకేసింది. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుధ్య పనుల కాంట్రాక్టర్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ,  స్వామివారి కోట్లాది రూపాయల సొమ్మును కైంకర్యం చేస్తున్నాడు. అనేక ఆరోపణలు ఉన్న కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పజెప్పారని అప్పట్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని, సదరు కాంట్రాక్ట్ సంస్థను వెనకేసుకొచ్చిన ఆలయ పెద్దలు ఇప్పుడు తల నిమురుకుంటున్నారు. 

(ద్వారకాతిరుమల)అసలేం జరిగిందంటే..

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. అటువంటి ఆలయంలో పారిశుధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి.  నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, శానిటేషన్ పనులు నాసిరకంగా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన పారిశుధ్య పనుల కాంట్రాక్టును 2019 సెప్టెంబర్ 1 నుంచి విజయవాడకు చెందిన చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీకి అప్పజెప్పారు. దేవస్థానం టెండర్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న ఆ సంస్థ  అప్పటి నుంచి శానిటేషన్ పనులు చేస్తోంది. ఆ సంస్థ నెలకు 15లక్షల 12 వేలకు టెండర్ కోట్  చేయడంతో చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీకి శానిటేషన్ కాంట్రాక్ట్‌ను ఆలయ అధికారులు అప్పజెప్పారు. ఆ తరువాత కాంట్రాక్టర్‌కు, ఆలయ అధికారులకు మధ్య జరిగిన చర్చల్లో నెలకు 18 శాతం జీఎస్టీతో కలిపి 14 లక్షల 12 వేలకే పనులు చేయడానికి సంస్థ అంగీకరించింది.  అయితే అప్పటికే ఆ సంస్థపై శానిటేషన్ పనుల విషయంలో అనేక విమర్శలు ఉన్నాయి. 2015లో శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎలుకలు కొరికి ఓ చిన్నారి మృతికి కారణమయ్యారని చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ సంస్థను అప్పటి ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే 2019లో ద్వారకా తిరుమలతో పాటు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ శానిటేషన్ టెండర్లు వేసింది. కానీ విజయవాడ దేవస్థానం, అన్నవరం దేవస్థానాలు ఆ సంస్థ వేసిన టెండర్లను డిస్‌క్వాలిఫై చేశాయి. కానీ ద్వారక తిరుమల దేవస్థానం మాత్రం సదరు సంస్థ పట్ల అతి ప్రేమ చూపిస్తూ, తక్కువ ధరకు టెండర్ వేశారనే కారణంతో శానిటేషన్ పనులను ఆ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ పూర్వాపరాలు పరిశీలించకుండా టెండర్ కట్టబెట్టడం వెనుక అప్పట్లో కొందరు దేవస్థానం అధికారులు సహకరించారనే ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో ఆ టెండర్ ప్రక్రియపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కథనాలు కూడా ప్రసారం చేసింది. అయితే ఆ కథనాలపై దేవస్థానం చైర్మన్ ఎస్.వి సుధాకర్ రావు మండిపడ్డారు. దేశంలోనే ఇటువంటి శానిటేషన్ కంపెనీ లేనట్లుగా వారికి కితాబిచ్చి ఆ సంస్థను ఆకాశానికెత్తారు. అంతేకాక కంపెనీ ఏ దేవస్థానంలో లేనివిధంగా 60 లక్షల రూపాయల విలువైన మిషనరీలు ఉపయోగించి పూర్తి అధునాతన టెక్నాలజీతో శానిటేషన్ పనులు చేస్తారని ఆ సంస్థను వెనకేసుకొచ్చారు. 


చెప్పిందొకటి.. చేస్తోందొకటి

కాంట్రాక్టు పొంది సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు మిషనరీలు కాదు కదా, కనీసం సాధారణంగా శానిటేషన్‌కు ఉపయోగించే ఫినాయిల్, బ్లీచింగ్ వంటివాటినే నాణ్యమైనవి ఉపయోగించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులే స్వయంగా ఒప్పుకున్నారు.  కాంట్రాక్ట్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు దేవస్థానం శానిటేషన్ అధ్వాన్నంగా ఉందంటూ ఇప్పటికే ఆ సంస్థకు దేవస్థానం అధికారులు పలుమార్లు నోటీసులు అందించారు. దాదాపు మూడు నెలల క్రితం అంటే మే నెల ఏడో తేదీన చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీకి దేవస్థానం మరోసారి నోటీసులు అందించింది. కాంట్రాక్టు పొందిన సమయంలో నిబంధనలో భాగంగా 28 రకాల మిషనరీలతో శానిటేషన్ నిర్వహిస్తామని చెప్పి, ప్రస్తుతం 8 మిషనరీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతూ.. ఇప్పటి వరకు మిగిలిన 20 మినషరీలు సప్లయి చేయలేదని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా శానిటేషన్ పనుల కోసం శానిటరీ మెటీరియల్స్ నాణ్యమైనవి వాడడం లేదని, కేశఖండనశాల వద్ద, గదుల వద్ద శుభ్రతకు నాణ్యమైన ఫినాయిల్స్ వాడటం లేదని, దీంతో భక్తుల నుంచే కాకుండా అధికారుల నుంచి కూడా శానిటేషన్‌పై ఫిర్యాదులు వస్తున్నాయని కూడా నోటీసులో పేర్కొన్నారు. టెండర్ షరతులలో సూచించిన ప్రకారం మిషనరీలను ఉపయోగించకపోవడంతో నిబంధనలను ఉల్లంఘించారని, నోటీస్ అందిన 7 రోజులలో మొత్తం మిషనరితో మెకనైజ్డ్ సిస్టమ్ ద్వారా శానిటరీ పనులు చేయకపోతే టెండరు రద్దుచేసి, సెక్యూరిటీ డిపాజిట్‌ను దేవస్థానం ఖాతాలో జమ చేస్తామని, అంతేకాకుండా మరో టెండరు పిలిచి నష్టాన్ని న్యాయపరంగా మీ నుంచి రాబడతామని సదరు సంస్థకు ఇచ్చిన నోటీసులో దేవస్థానం హెచ్చరించింది. 


నోటీసు ఇచ్చినా మారని తీరు

నోటీసు ఇచ్చి దాదాపుగా మూడు నెలలు అవుతున్నా సదరు సంస్థ నుంచి ఎటువంటి స్పందన లేదు. సంస్థ పని తీరులోనూ మార్పు రాలేదు. నాణ్యత లేకుండా ఇంత దారుణంగా శానిటేషన్ పనులు చేస్తున్నారని దేవస్థానం నోటీసులు పంపినా.. ఆ సంస్థ మళ్లీ అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వెనుక కారణం ఏమిటో తెలియడం లేదు. ఆ సంస్థను వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు? ఒక సంస్థపై ఇన్ని ఆరోపణలున్నా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే అంశంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ సంస్థ పని తీరుపై ఇటీవల కొత్తగా దేవస్థానానికి వచ్చిన ఓ అధికారి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన  ప్రతి విషయంపై విచారణ జరిపి తనకు రిపోర్టు ఇవ్వాలని దిగువ స్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ఆ సంస్థపై చర్యలు తీసుకుంటారా? లేక ఎవరైనా దేవస్థానానికి చెందిన పెద్దలు ఆ సంస్థపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడతారా అనే విషయం త్వరలో తేలనుంది.


2019 అక్టోబర్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం ఇదీ...