Helmet లేకుంటే.. తప్పదు జరిమానా

ABN , First Publish Date - 2022-07-07T13:52:10+05:30 IST

హెల్మెట్‌ ధరించని ద్విచక్రవాహనదారుల పట్ల ఇకపై కఠినంగా వ్యహరిస్తామని, ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని చెన్నై పోలీసు

Helmet లేకుంటే.. తప్పదు జరిమానా

- హెచ్చరించిన పోలీసు కమిషనర్‌  

- నెల రోజుల్లోనే 1,36,656 మందిపై కేసు నమోదు

- పలు చోట్ల అవగాహనా ప్రచారం


చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): హెల్మెట్‌ ధరించని ద్విచక్రవాహనదారుల పట్ల ఇకపై కఠినంగా వ్యహరిస్తామని, ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ హెచ్చరించారు. బుధవారం మెరీనాలో చెన్నై ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం, సూర్యన్‌ ఎఫ్‌ఎం రేడియో సంయుక్తంగా హెల్మెట్‌ ధారణపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన కమిషనర్‌  పలువురికి ఉచితంగా హెల్మెట్లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారుల్లో ఎక్కువమంది హెల్మెట్‌ ధరించకపోవడం వలనే ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరించాల్సిందేనన్నారు. ఇప్పటికే ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయని, అయితే ప్రజల్లో అవగాహనా రావాలన్న ఉద్దేశంతో వెనుక కూర్చున్నవారు హెల్మెట్‌ పెట్టకపోయినా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అయితే ఇక నుంచి ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్‌ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. మే 23 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు హెల్మెట్‌ ధరించని 1,36,656 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో 72,744 మంది వాహనం నడిపేవారు కాగా, 63,912 మంది వెనుక కూర్చున్నవారున్నారని తెలిపారు. వీరి నుంచి రూ.కోటి 36 లక్షల 65 వేల 600లు జరిమానాగా వసూలు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు రవాణా కమిషనర్‌ కపిల్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ కుమార్‌, సన్‌ రేడియో ఎఫ్‌ఎం వైస్‌ ప్రెసిడెంట్‌ శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T13:52:10+05:30 IST