No GST On Perks : కంపెనీల యాజమాన్యాలకు గుడ్‌న్యూస్.. సీబీఐసీ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-08-03T20:35:06+05:30 IST

కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులకు కల్పించే సేవలకు జీఎస్టీ (Goods and Services Tax) వర్తించదని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డ్ (CBIC) స్పష్టం చేసింది.

No GST On Perks : కంపెనీల యాజమాన్యాలకు గుడ్‌న్యూస్.. సీబీఐసీ కీలక ప్రకటన

న్యూఢిల్లీ : ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యాలు కల్పించే  సౌకర్యాలకు జీఎస్టీ (Goods and Services Tax) వర్తించదని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డ్ (CBIC) స్పష్టం చేసింది. ఉద్యోగి - యాజమాన్యం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే ఉద్యోగికి యాజమాన్యం సౌకర్యాలు కల్పిస్తున్నందున జీఎస్టీ పరిధిలోకి రావని తెలిపింది. చంఢీగడ్‌లో గతవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ (GST Council) భేటీలో నిర్ణయాల అమలుపై వివరణ ఇచ్చిన అంశాల్లో ఈ మేరకు పేర్కొంది. కాగా ఎంప్లాయిమెంట్ సమయంలో ఉద్యోగికి యాజమాన్య సంస్థ అందించే సేవలను వస్తు లేదా సర్వీసులుగా పరిగణించరాదని సీబీఐసీ ఇటివలే విడుదల చేసిన సర్క్యూలర్ పేర్కొంది. అయితే వివరాలు పేర్కొనకపోవడంతో  తాజాగా ఈ స్పష్టత ఇచ్చినట్టయ్యింది.


కాగా ఉద్యోగులకు యాజమాన్యం అందించే సేవలపై జీఎస్టీ విధింపునకు సంబంధించి గతంలో స్పష్టత ఉండేది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీపై జీఎస్టీ విధింపు నిబంధన కింద జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఈ అంశంపై వివాదంగా కూడా కొనసాగింది. ఒప్పందం ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు వాదిస్తూ వచ్చాయి. జీఎస్టీ చట్టం 2017లోని షెడ్యూల్ 3 ప్రకారం తమకు నుంచి మినహాయింపు లభిస్తుందని డిమాండ్ చేశాయి. అందుకే గతవారం ముగిసిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవడం, సీబీఐసీ వివరణ ఇవ్వడంతో క్లారిటీ వచ్చినట్టయ్యింది.


పెండింగ్‌లో అనేక వ్యాజ్యాలు

ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలు, సేవలపై జీఎస్టీ విధింపునకు సంబంధించి అనేక వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా సీబీఐసీ ఇచ్చిన క్లారిటీతో ఈ గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. కాగా కంపెనీ అందించే సేవల్లో నగదేతర ప్రయోజనాలైన రవాణా, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ లేదా క్యాంటీన్ సర్వీసులు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సేవలను యాజమాన్యాలు అందిస్తాయి.

Updated Date - 2022-08-03T20:35:06+05:30 IST