Advertisement
Advertisement
Abn logo
Advertisement

GPSకు నో.. వాహనాల కదలికలను గుర్తించకుండా ఎత్తులు

  • అత్యధిక ట్యాంకర్లకు తొలగించిన యజమానులు
  • దారి మళ్లుతున్న ఉచిత నీరు
  • డొమెస్టిక్‌కు బుక్‌ చేసి కమర్షియల్‌కు వినియోగం
  • మానిటరింగ్‌ మరచిన ఐటీ విభాగం

ఆ నీళ్లు చేరాల్సిన చోటుకే చేరుతున్నాయా, ఏ ట్యాంకర్‌ ఎటువైపు వెళ్తుంది.. అనేది తెలుసుకునేందుకు వాటర్‌బోర్డులో గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) అందుబాటులోకి తెచ్చారు. ట్యాంకర్ల కదలికలను గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ విధానానికి యజమానులు తిలోదకాలిస్తున్నారు. ఉచితంగా అందించాల్సిన నీటిని దారి మళ్లించి జేబులు నింపుకుంటున్నారు. వీరికి ఐటీ విభాగం, ఫిల్లింగ్‌ స్టేషన్లలోని కొందరు అధికారులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, యూనియన్ల నేతలు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా వ్యవస్థలో వాటర్‌ ట్యాంకర్లు కూడా కీలకమే. బోర్డు ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా కాని ప్రాంతాలకు ఉచితంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తారు. దాంతో పాటు బుక్‌ చేసుకుంటే ట్యాంకర్ల ద్వారా నీటిని పంపుతారు. 5 వేల లీటర్ల ట్యాంకర్‌కు డొమెస్టిక్‌ అయితే రూ.500,  కమర్షియల్‌కు రూ.850 వసూలు చేస్తారు. డొమెస్టిక్‌ ట్యాంకర్‌ పదివేల లీటర్లకు రూ.వెయ్యి కాగా, కమర్షియల్‌కు రూ.1700, 20వేల లీటర్లకు రూ.3400గా బోర్డు ధర నిర్ణయించింది. ప్రస్తుతం వాటర్‌బోర్డు పరిధిలో 900కు పైగా ట్యాంకర్లు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. ఒక్కో ట్యాంకర్‌ నిత్యం ఐదుకు పైగానే (వేసవిలో అయితే పదికి మించే) ట్రిప్పు లు తిరుగుతుంది. ఒక్కో ట్రిప్పునకు వాటర్‌బోర్డు రూ.310 చెల్లిస్తుంది. దీంతో ఒక్కో యజమాని కనీసం ఐదు నుంచి పది ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. కొందరు యూనియన్‌ నేతలు, అధికారులు, ఉద్యోగులు బినామీ పేర్లతో ట్యాంకర్లు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


దారి మళ్లింపు

పేదల దాహార్తి తీర్చాల్సిన ఉచిత నీటి ట్యాంకర్లను కొందరు ట్యాంకర్ల యజమానులు దారి మళ్లిస్తున్నారు. డబ్బులు తీసుకుని బడాబాబుల ఇళ్లకు, వాణిజ్య సముదాయాలకు కేటాయిస్తున్నారు. ఇటీవల బహదూర్‌పురా సెక్షన్‌లోని ఎంఆర్‌జీ ఫిల్లింగ్‌ స్టేషన్‌ నుంచి రోజుకు 550 ట్రిప్పుల ట్యాంకర్ల నీటిని పక్కదారి పట్టించి కోట్లాది రూపాయలను ఆర్జించినట్లు వాటర్‌బోర్డు విజిలెన్స్‌ నిగ్గు తేల్చింది. 


గోదావరి జలాలు నిలిచిన సమయంలో..

రెండు నెలల క్రితం భారీ వర్షాల కారణంగా మల్లారంలోని పంపుహౌస్‌ నీటి మునగడంతో నగరానికి గోదావరి జలాల సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలలో నీటి ఇక్కట్లు ఎదురయ్యాయి. దీంతో వారం రోజుల పాటు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి పరిధిలోని పలు ప్రాంతాలకు పెద్దఎత్తున ఉచిత నీటి ట్యాంకర్లను తరలించారు. సుమారు 15 వేల వరకు ట్రిప్పులను తరలించగా, అందులో అత్యధికంగా పక్కదారి మళ్లినట్లు తెలిసింది. స్థానిక ఫిల్లింగ్‌ స్టేషన్ల సిబ్బందిని, మేనేజర్లును, డీజీఎం, జీఎంలను ప్రభావితం చేసేలా పలువురు యూనియన్‌ నేతలు వ్యవహరించినట్లు సమాచారం.

జీపీఎస్‌ నిర్వీర్యం

ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా జీపీఎస్‌తో అనుసంధానించాలని వాటర్‌బోర్డు మూడేళ్ల క్రితమే ఆదేశాలిచ్చింది. ఏ ట్యాంకర్‌ ఏ వైపు వెళ్తుందో కార్యాలయం ఐటీ విభాగం నుంచి మానిటరింగ్‌ చేసేలా నిర్ణయించారు. ప్రతీ ట్యాంకర్‌ బుక్‌ అయిన చిరునామాకే వెళ్తుందా అనేది గమనించాలి. పక్కదారి పడితే ట్యాంకర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టాలి. కానీ, జీపీఎ్‌సతో అనుసంధానమైన ట్యాంకర్లను మానిటరింగ్‌ చేయడం లేదు. అత్యధిక మంది ట్యాంకర్ల యజమానులు సాంకేతిక లోపం పేరుతో ట్యాంకర్లకు ఉన్న జీపీఎ్‌సను తొలగించినట్లు తెలిసింది. జీపీఎస్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన తర్వాత కూడా వేలాది ట్యాంకర్ల ట్రిప్పులు పక్కదారి పట్టాయి. ఈ విషయం తెలిసినా కొందరు అధికారులు ట్యాంకర్‌ యజమానుల కొమ్ముకాస్తున్నారు. వాటర్‌బోర్డు డివిజన్లలోని ఫిల్లింగ్‌ స్టేషన్ల నుంచి ట్యాంకర్లపై నిఘా వేస్తే పెద్దఎత్తున అవినీతి డొంక కదిలే అవకాశాలున్నాయి. 


కమర్షియల్‌ అవసరాలకు..

నిబంధనల ప్రకారం.. డొమెస్టిక్‌ ట్యాంకర్‌ బుక్‌ చేసుకుంటే ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఎవరైనా వాణిజ్య అవసరాలకు వాడుకుంటే ట్యాంకర్‌ యజమానులు ఫిల్లింగ్‌ స్టేషన్‌ అధికారులకు సమాచారం తెలపాలి. దాంతో కమర్షియల్‌ కింద పరిగణిస్తారు. అయితే కొంతమంది ట్యాంకర్ల యజమానులే డొమెస్టిక్‌ ట్యాంకర్లను ముందుగానే ఎంచుకున్న కమర్షియల్‌ భవనాలకు తరలిస్తున్నారు. వారే తమకు తెలిసిన చిరునామాల పేరుతో బుక్‌ చేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

Advertisement
Advertisement