భూములిచ్చేది లేదు..

ABN , First Publish Date - 2022-05-01T05:22:30+05:30 IST

మెదక్‌ మీదుగా సిద్దిపేట వరకు నిర్మించనున్న హైవే నంబర్‌ 765 డీజీ నిర్మాణానికి భూములివ్వబోమని రైతులు తేల్చి చేప్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కాలువ, రైల్వేలైన్‌ పేరిట సాగు భూములు తీసుకున్నారని, మిగిలిన భూమిని హైవే నిర్మాణం కోసం ఇస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతంలో ఎకరా కోటి రూపాయలు ధర పలుకుతున్నదని, ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో గుంట భూమిని కూడా కొనలేమని వాపోతున్నారు. రామాయంపేటలో హైవే బైపాస్‌ నిర్మాణం కోసం సర్వేకు వచ్చిన అధికారులను పలు గ్రామాల రైతులు అడ్డుకుని ఆందోళన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

భూములిచ్చేది లేదు..
రామాయంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న రైతులు (ఫైల్‌)

ఇప్పటికే కాళేశ్వరం, రైల్వేలైన్‌ కోసం త్యాగం

మళ్లీ ఇప్పుడు జాతీయ రహదారి కోసమా?

తేల్చి చెబుతున్న  రైతులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఏప్రిల్‌ 30: మెదక్‌ మీదుగా సిద్దిపేట వరకు నిర్మించనున్న హైవే నంబర్‌ 765 డీజీ నిర్మాణానికి భూములివ్వబోమని రైతులు తేల్చి చేప్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కాలువ, రైల్వేలైన్‌ పేరిట సాగు భూములు తీసుకున్నారని, మిగిలిన భూమిని హైవే నిర్మాణం కోసం ఇస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతంలో ఎకరా కోటి రూపాయలు ధర పలుకుతున్నదని, ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో గుంట భూమిని కూడా కొనలేమని వాపోతున్నారు. రామాయంపేటలో హైవే బైపాస్‌ నిర్మాణం కోసం సర్వేకు వచ్చిన అధికారులను పలు గ్రామాల రైతులు అడ్డుకుని ఆందోళన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.


రూ.881 కోట్లతో 67 కిలోమీటర్ల రోడ్డు

మెదక్‌ నుంచి సిద్దిపేట వరకు 67 కిలోమీటర్ల మేర నూతన రోడ్డును నిర్మించడానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, దీనికి హైవే నంబర్‌ 765 డీజీ నామకరణం చేశారు. ఇందు కోసం రూ.881 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేసింది. ఈ రోడ్డుకు 765 డీజీగా నామకరణం చేశారు. డీపీఆర్‌ను సిద్ధం చేసిన అధికారులు సర్వే చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట నాలుగు లైన్లుగా రోడ్డు నిర్మాణం చేయనున్నారు.  


మూడు బైపాస్‌ రోడ్లు

మెదక్‌-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మూడుచోట్ల బైపాస్‌ రోడ్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. తొనిగండ్ల, అక్కన్నపేట, రామాయంపేట పట్టణం మీదుగా బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అక్కన్నపేటలో రైల్వేగేటు ఉండటంతో హైవేను మళ్లించి బైపాస్‌ రోడ్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఇందు కోసం భూసేకరణ చేయనున్నారు. రామాయంపేట మండలం తొనిగండ్లలో బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి 5 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. రహదారి విస్తరణలో తొనిగండ్లలో 16 ఇళ్లు ఉన్న కాలనీ పోతున్నది. అక్కన్నపేటలో 11 ఎకరాలు, కోనాపూర్‌లో మూడెకరాలు, రామాయంపేట పట్టణంలో 35 ఎకరాలు సేకరించనున్నారు. 


రైతుల నుంచి వ్యతిరేకత

ఆయా గ్రామాల్లో బైపాస్‌ రోడ్ల నిర్మాణానికి భూసేకరణ చేయడం ఇబ్బందికరంగా మారింది. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదిలేదని రైతులు అంటున్నారు. మరోవైపు భూములు, ప్లాట్లు, ఇళ్లు కోల్పోయినవారికి ఎంత పరిహారం ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా తేల్చలేదు. గతంలో రైల్వేలైన్‌ నిర్మాణం కోసం అక్కన్నపేట ప్రాంతంలో సేకరించిన భూమి ఎకరాకు రూ. 5 నుంచి రూ. 7 లక్షల వరకు పరిహారం చెల్లించారు. రామాయంపేట మండల పరిధిలో కాళేశ్వరం కాలువల కోసం భూములు ఇచ్చినవారికి ఎకరాకు రూ.7.20 లక్షలు ఇచ్చారు. ప్రస్తుతం భూముల విలువ పెరగడంతో హైవే నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రైతులు ముందుకురావడంలేదు. తొనిగండ్ల, అక్కన్నపేట, కోనాపూర్‌ ప్రాంతాల్లో ఎకరా భూమి రూ.50 లక్షల వరకు పలుకుతున్నది. రామాయంపేటలో రూ. కోటి పైగానే ఉన్నది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా రామాయంపేట పట్టణం మినహా మిగితా ప్రాంతాల్లో అధికారులు బైపాస్‌ నిర్మాణానికి భూములను గుర్తించేందుకు సర్వే పూర్తిచేశారు.

Updated Date - 2022-05-01T05:22:30+05:30 IST