ఫర్నిచర్‌ లేదు.. ఫ్యాన్లు తిరగవు

ABN , First Publish Date - 2022-05-21T04:33:40+05:30 IST

పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో నేటికీ సరైన వసతులు కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తమౌతోంది.

ఫర్నిచర్‌ లేదు.. ఫ్యాన్లు తిరగవు
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డు ఉన్నత పాఠశాలలో సరిగా లేని వసతులు

విరిగిన కిటికీలు.. తలుపులు

ప్రహరీ లేని చోట్ల కేంద్రాల ఏర్పాటు

ఇదీ పదో తరగతి పరీక్ష కేంద్రాల దుస్థితి

‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెలుగు

రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఎగ్జామ్స్‌

విద్యార్థులకు తప్పని కష్టాలు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 20: పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో నేటికీ సరైన వసతులు కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. పరీక్షలకు ఒక్క రోజే సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మేరకు వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేసేరా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ శుక్ర వారం చేసిన పరిశీలనలో పలు విష యాలు వెలుగుచూశాయి. మహబూబ్‌నగర్‌ అర్బన్‌, రూరల్‌, రాజాపూర్‌, గం డీడ్‌, మహ మ్మదాబాద్‌, మిడ్జిల్‌, దేవరకద్ర, జడ్చర్ల, సీసీకుంట, భూత్పూర్‌ మండ లాల్లో మరు గుదొడ్లు, మూత్రశాలలు మంచి నీటి సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంది. ఒక్కో చోట విద్యుత్‌ సౌకర్యం లేకపోగా ఫ్యాన్లు కూడా సరిపోను లేవు. మరికొన్ని పాఠశాలల్లో ప్రైవేట్‌ పాఠశాలల్లో చిన్న పిల్లలు కూర్చునే టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. వాటిపై విద్యార్థులు మూడు గంటల పాటు కూర్చొని పరీక్షలు రాయాలంటే ఇబ్బందులు పడతారని అంటున్నారు. కంపౌండ్‌ లేని పాఠశాలల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వం చెబితే ప్రహరీ లేకున్నా ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల తలుపులు, కిటికీలు  విరిగి పోయాయి. జిల్లా కేంద్రం లోని మోడల్‌ బేసిక్‌ ఉన్నత పాఠశాలలో విద్యుత్‌ సౌకర్యం సరిగా లేదు. గదుల్లో చాలా వరకు ఫ్యాన్లు లేకపోగా, ఉన్నవి కూడా సరి గా పనిచేయడం లేదు. మహాత్మ గాంధీ రోడ్డు ఉన్న త పాఠశాల లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.


మండలాల్లో అధ్వానం

మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. జడ్చర్ల మండలంలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా సౌకర్యాలు సరిగా లేవు. కోడ్గల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ప్రహరీ లేదు. గదుల్లో ఫ్యాన్లు, ఫర్నీచర్‌ సరిపడా లేవు. విద్యుత్‌ సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంది. బాదేపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో ఫర్నీ చర్‌ సరిగా లేదు. ఇక్కడ గదుల్లో వెలుతురు కూడా రాదు. దేవరకద్ర మండ లంలో మూడు కేంద్రాలు ఉన్నాయి. అందులో సరి పడా బెంచీలు లేవు. అందులో కొన్ని విరిగి పోయాయి. సీసీకుంటలో రెండు కేంద్రాలు ఉన్నాయి. సీసీకుంట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ప్రహరీ పూర్తి స్థాయిలో లేదు. ఫర్నీచర్‌ కూడా సరిపోను లేదు. వడ్డేమాన్‌ కేంద్రంలోనూ ఫర్నిచర్‌ లేకపోవడం అద్దెకు తెప్పించినట్లు నిర్వహకులు తెలిపారు. భూత్పూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి కిటికీలు లేవు. తలుపులు విరిగిపోయాయి. ఇక్కడ కూడా ఫర్నిచర్‌ సరిగా లేదు. మిడ్జిల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫర్నీచర్‌, ఫ్యాన్లు సరిపోను లేవు. మరుగుదొడ్లు, మూత్రశాలలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.







Updated Date - 2022-05-21T04:33:40+05:30 IST