కరోనాపై పోరుకు నిధులేవీ?

ABN , First Publish Date - 2020-03-22T10:49:17+05:30 IST

కరోనా(కోవిడ్‌-19)ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఆర్థిక కష్టాలు అడ్డొస్తున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు మాటలు చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో...

కరోనాపై పోరుకు నిధులేవీ?

  • వైరస్‌ నియంత్రణ చర్యలకు ఆర్థిక కష్టాలు 
  • రూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వం 
  • నమూనాల తరలింపునకూ ఆరోగ్యశాఖ ఇబ్బందులు
  • సిద్ధం కాని వెంటిలేటర్లు, ఐసోలేషన్‌ గదులు 
  • 3వ దశకు చేరితే కష్టమే: వైద్య నిపుణులు 
  • అధికారులు ప్రకటనలకే పరిమితం 


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కరోనా(కోవిడ్‌-19)ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఆర్థిక కష్టాలు అడ్డొస్తున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు మాటలు చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో వైరస్‌ నియంత్రణ చర్యలకు రూపాయి కూడా విడుదల చేయడం లేదు. సమావేశాలు, సూచనలకే పరిమితమవుతున్న ఉన్నతాధికారులు... సమస్య తీవ్రమైతే తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై దృష్టి పెట్టడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రెండోదశలో ఉంది. అంటే విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రం పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఇక మూడోదశలో స్థానికులకు కూడా వైరస్‌ సోకుతుంది.


ఈ దశకు చేరితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులు కాగితాలపైనే చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు. రాష్ట్రంలో 450 ఐసోలేషన్‌ వార్డుల నిర్మాణం చేపడుతున్నామని, 100 వెంటిలేటర్లు కొనుగోలు చేస్తున్నామని, వారంలోగా వీటిని అందుబాటులోకి తెస్తామని రెండు వారాల క్రితం ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ అడుగు ముందుకు పడలేదు. ఆరోగ్యశాఖకు నిధుల కొరతే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కరోనా నియంత్రణ పనులకు రూ.10కోట్లు విడుదల చేస్తున్నట్లు ఒక జీవో మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించి నిధులు రూపాయి కూడా విడుదల కాలేదు.


అయినా అవి ఏ మూలకూ సరిపోవు. ఉన్నతాధికారులు కొనుగోలు చేయాలని నిర్ణయించిన 100వెంటిలేటర్ల ధరే రూ.12కోట్ల వరకూ ఉంటుంది. ఐసోలేషన్‌ గదులు ఒక్కోటీ రూ.10లక్షలతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక కంపెనీకి అర్డర్‌ కూడా ఇచ్చారు. ప్రతి బోధనాస్పత్రిలో సుమారు 10- 20 గదుల నిర్మాణం చేపట్టాలనుకున్నారు. దీనికి కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు.


ఎక్కడైనా ఒకేసారి 10 నుంచి 20 కేసులు వస్తే ఆరోగ్యశాఖ కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అత్యవసరమైతే రోగికి వెంటిలేటర్లు కూడా చాలా జిల్లాల్లో అందుబాటులో లేవు. బోధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల్లో నుంచి తీసుకువచ్చి కరోనా రోగులకు ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల సాధారణ రోగులకు వైద్యసేవలు, శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా మూడోదశకు చేరితే సమర్థంగా ఎదుర్కోవడం కష్టమేనని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్‌హెచ్‌ఎం నిధులు ఖర్చు 

కరోనా అనుమానితుల నుంచి నమూనాలు తీసి, ల్యాబ్‌కు పంపించడానికి కూడా ఆరోగ్యశాఖ ఇబ్బందులు పడుతోంది. చాలా జిల్లాల్లో అధికారులు తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. నిధులు ఇస్తేగానీ శాంపిళ్లు ల్యాబ్‌కు తరలించలేమని ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల సిబ్బంది స్పష్టంగా చెబుతున్నారు. దీంతో చేసేది లేక అధికారులు అందుబాటులో ఉన్న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిధులు ఉపయోగిస్తున్నారు. అవీ లేకపోతే ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చేది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు మార్చి 1నుంచి ప్రారంభించారు. అప్పటినుంచి నమూనాలు తరలించడానికి, ఇతర పనులకు సుమారు రూ.2కోట్ల వరకూ ఎన్‌హెచ్‌ఎం నిధులు ఖర్చయ్యాయి. మరోవైపు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం నుంచి వారం క్రితమే రూ.175కోట్లు వస్తాయని ఆరోగ్యశాఖ భావించింది. కానీ ఇప్పటి వరకూ రూపాయి కూడా విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-03-22T10:49:17+05:30 IST